'హింసతో పరిష్కారం ఉండదు.. శాంతి ముఖ్యం'
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉంటూ శాంతియుతంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్లో ఓబీసీ రిజర్వేషన్లకోసం పోరుబాట పట్టిన పటేళ్లకు విజ్ఞప్తి చేశారు. హింసతో ఎవరికీ ఎలాంటి మేలు జరగదని ఆయన గుర్తు చేశారు. పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హార్దిక్ పటేల్ అనే 21 ఏళ్ల యువకుడి నాయకత్వంలో ఉద్యమం మొదలైన విషయం తెలిసిందే.
తొలుత శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం అనంతరం కొంత హింసాత్మక రూపం దాల్చింది. పలు చోట్ల వాహనాలు తగులబెట్టారు. అక్కడక్కడ ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఈ రోజు అక్కడ బంద్కు పిలుపునివ్వడం, అంతకుముందు హార్దిక్ పటేల్ అరెస్టు అనంతరం విడుదల వంటి ఘటనల నేపథ్యంలో కొన్ని చోట్ల అల్లర్లు తలెత్తాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఐదువేల బలగాలను కూడా దించింది. ఈ నేపథ్యంలోనే అంతా శాంతియుతంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మరోపక్క, హార్దిక్ పటేల్ ఓ మీడియాతో ఇంటర్వ్యూ ఇస్తూ హింసకు పాల్పడటం తమ ఉద్దేశం కాదని, తమ డిమాండ్ను అమలుచేయాలని శాంతియుతంగానే కోరుతున్నామని చెప్పారు. ప్రభుత్వమే అనవసరంగా పోలీసులను దించి తమపై దాడులు చేయిస్తుందని ఆరోపించారు.