గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మద్దతిస్తామని పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. తిరిగి పటేళ్లను దగ్గర చేసుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. గుజరాత్‌లో పటేళ్లు మొదట్నుంచీ బీజేపీతోనే ఉన్నారని.. ఈ వర్గంలోకి కొందరు మాత్రం రిజర్వేషన్ల పేరుతో పార్టీకి వ్యతిరేకంగా మారారని ప్రధాని పేర్కొన్నారు. గురువారం గాంధీనగర్‌లోని అక్షరధామ్ ఆలయంలోని ‘బొచనసన్‌వాసీ శ్రీ అక్షర్‌పురుషోత్తం స్వామినారాయన్ సంస్థ’ (బీఏపీఎస్) రజతోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడనప్పటికీ.. పటేళ్లు ఆరాధించే స్వామినారాయణ్ వర్గానికి చెందిన స్వామీజీలతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘పటేళ్లు ఈ స్వామినారాయణ్ వర్గాన్ని చాలా ఆదరిస్తారు. పటేళ్లు సంప్రదాయంగా, దీర్ఘకాలంగా బీజేపీతో కలిసే ఉన్నారు. కానీ ఇందులోని ఓ వర్గం పార్టీపై వ్యతిరేకతతో ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. బీఏపీఎస్ చీఫ్ స్వామీ మహరాజ్ (ఈ ఏడాది ఏప్రిల్‌లో అస్తమించారు) తన జీవిత కాలంలో 1200 దేవాలయాలను నిర్మించారని.. ఇవి కేవలం దేవాలయాలు మాత్రమే కావని సంస్కృతి, ఆధ్యాత్మికత విలసిల్లే కేంద్రాలని ప్రధాని తెలిపారు. తను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు స్వామీ మహరాజ్‌తో.. సరైన సమయంలో ప్రాజెక్టులను పూర్తిచేయటంపై గుజరాత్ అధికారులకు క్లాసులు చెప్పించిన విషయాన్నీ మోదీ గుర్తుచేశారు.
కాంగ్రెస్‌కే మా మద్దతు: హార్దిక్ పటేల్
గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే మద్దతుంటుందని పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పటీదార్లకు బహిరంగంగానే మద్దతు తెలియజేస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ఇప్పుడు మా పటేళ్లంతా బీజేపీ పతనానికే మద్దతు తెలుపుతున్నారు. ప్రజలు తెలివైన వారు. బీజేపీకి ఓటేయవద్దంటే.. ఆ ఓటు ఎవరికి వేయాలో (పరోక్షంగా కాంగ్రెస్‌ను ప్రస్తావిస్తూ) వారికి తెలుసు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment