హార్దిక్ పటేల్ అసలు లక్ష్యం.. డబ్బు, అధికారం! | hardik patel wanted to enmass crores, have power say close aides | Sakshi
Sakshi News home page

హార్దిక్ పటేల్ అసలు లక్ష్యం.. డబ్బు, అధికారం!

Published Tue, Aug 23 2016 8:54 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

హార్దిక్ పటేల్ అసలు లక్ష్యం.. డబ్బు, అధికారం!

హార్దిక్ పటేల్ అసలు లక్ష్యం.. డబ్బు, అధికారం!

హార్దిక్ పటేల్.. దేశంలో ఈ పేరు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పటేళ్లను బీసీలలో చేర్చాలంటూ ఆయన సాగించిన ఉద్యమం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ, అసలు హార్దిక్ పటేల్ ఆ ఉద్యమం ఎందుకు చేశాడన్న విషయమై ఒకప్పుడు ఆయనకు సన్నిహిత సహచరులుగా ఉన్నవాళ్లు వెల్లడిస్తున్న అంశాలు మరింత సంచలనం సృష్టిస్తున్నాయి. తాను ఒక్క ఏడాది కాలంలోనే నాయకుడిగా ఎదగాలని, దాంతోపాటు కోటీశ్వరుడిని కావాలనే ఉద్దేశంతోనే ఆ ఉద్యమం మొదలుపెట్టాడని అంటున్నారు. గతంలో హార్దిక్ పటేల్‌కు కుడి, ఎడమ భుజాలుగా ఉన్న చిరాగ్ పటేల్, కేతన్ పటేల్ ఈ విషయాలు వెల్లడించారు. నియంత వ్యవహారం మానకపోతే అతడి చీకటి నిజాలను బయటపెడతామని హెచ్చరించారు. దీనిపై హార్దిక్‌కు బహిరంగ లేఖ రాశారు. ''మీరు నాయకుడిగా ఎదగాలని, భారీ మొత్తంలో డబ్బు కూడగట్టుకోవాలని స్వార్థంతో వ్యవహరించారు. దానివల్ల పటేల్ వర్గంతో పాటు మన సంస్థకు కూడా భారీ నష్టం జరిగింది'' అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవాళ్ల కుటుంబాలను ఆదుకోవాల్సింది పోయి హార్దిక్, ఆయన స్నేహితులు విలాసవంతమైన జీవితం గడిపారని, అమరులకు సాయం చేయడానికి సేకరించిన విరాళాలతో హార్దిక్, ఆయన మామ విపుల్‌భాయ్ ఖరీదైన కార్లు కొన్నారని ఆరోపించారు. సాధారణంగా జైలుకు వెళ్లారంటే నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లడమే కష్టమని, కానీ హార్దిక్ మాత్రం జైలుకు వెళ్లిన తర్వాత కోటీశ్వరుడు అయ్యాడని చిరాగ్, కేతన్ అన్నారు.

గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత హార్దిక్ పటేల్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్రాంతానికి వెళ్లాడు. ఆరు నెలల పాటు గుజరాత్ వెలుపల ఉండాలని కోర్టు ఆదేశించడంతో అలా చేశాడు. ఇక కేతన్, చిరాగ్ చేసిన ఆరోపణలపై హార్దిక్ గానీ, ఆయన అనుచరులుగానీ ఏమీ స్పందించలేదు. హార్దిక్ పటేల్ తొమ్మిది నెలల పాటు జైల్లో ఉండగా, చిరాగ్.. కేతన్ కూడా దాదాపు 8 నెలల పాటు జైల్లోనే ఉన్నారు. గుజరాత్‌లో 2015 ఆగస్టు 25న పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నిర్వహించిన ర్యాలీలో భారీ స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అహ్మదాబాద్ పోలీసులు వీరిపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు.

హార్దిక్ పటేల్ ఇటీవల చిరాగ్, కేతన్‌లను పక్కనపెట్టి వేరే బృందాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. హార్దిక్ నియంతలా వ్యవహరిస్తాడని, పటేళ్లు రిజర్వేషన్లు పొందే అవకాశాలను సర్వనాశనం చేశాడని వాళ్లు ఆరోపిస్తున్నారు. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం అతడు మాత్రమే జైల్లో ఉన్నట్లు మీడియాకు చెప్పాడని, అతడితోపాటు తాము కూడా జైల్లోనే ఉన్నామన్న విషయం మర్చిపోయాడని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలా వ్యవహరించడం మానకపోతే అతడికి సంబంధించిన మరిన్ని 'చీకటి నిజాలను' వెల్లడిస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement