Narendra Patel
-
కోటి ఇస్తామన్నారు
గాంధీనగర్: పటేల్ ఉద్యమం రాష్ట్ర కన్వీనర్ నరేంద్ర పటేల్ ఆదివారం సాయంత్రం గుజరాత్ బీజేపీ చీఫ్ జితూ వాఘానీ సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో బీజేపీకి పటేళ్ల బలం పెరుగుతోందనే భావన వ్యక్తమైంది. అంతలోనే సీన్ రివర్స్ అయింది.. చేరిన రెండుగంటల్లోపే నరేంద్ర పటేల్ మీడియా సమావేశం పెట్టి మాట మార్చారు. తను బీజేపీలోకి వచ్చేందుకు కోటిరూపాయలు ఇవ్వజూపారని ఆరోపించారు. తొలివిడతగా రూ.10లక్షలు ఇచ్చారని సమావేశంలో ఆ డబ్బును చూపించారు. పటేల్ ఆందోళనలో కీలకంగా వ్యవహరించి.. శనివారం బీజేపీలో చేరిన వరుణ్ పటేల్, రేష్మా పటేల్‌లు బీజేపీలోకి వస్తే కోటి రూపాయలు ఇస్తామన్నారని నరేంద్ర ఆరోపించారు. దీంతో పెద్ద దుమారం రేగింది. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో భాగమని విమర్శించింది. అటు, పటేళ్ల సంక్షేమానికి బీజేపీ ఇచ్చిన హామీలేవీ అమలు కావటం లేదంటూ నిఖిల్ సవానీ అనే పటీదార్ నేత కమలం పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. నరేంద్ర పటేల్ ఆరోపణలపై న్యాయవిచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘పటీదార్ నేతలకు బీజేపీ లంచం ఇవ్వటం.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఈ ఆరోపణలు తీవ్రమైనవి. ఈ కేసులో గుజరాత్ బీజేపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. గుజరాత్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి’ అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. కోర్టు నేతృత్వంలో విచారణ జరగని పక్షంలో గుజరాత్ ఎన్నికల పవిత్రతపైనే అనుమానాలు తలెత్తుతాయన్నారు. గుజరాత్ ఎన్నికలపై బీజేపీ భయపడుతోందని.. అందుకే ఎన్నికల షెడ్యూల్ విడుదలను ఆలస్యం చేస్తోందన్నారు. ప్రధాని గుజరాత్ ప్రజలకు వరాలు ప్రకటించేందుకే కావాలని ఆలస్యం చేస్తున్నారని మనీశ్ తివారీ ఢిల్లీలో ఆరోపించారు. -
‘కోటి’ కలకలంపై స్పందించిన సీఎం
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో గుజరాత్లో ‘కోటి’ కలకలం రేగింది. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) నాయకుడిని తమవైపు తిప్పుకునేందుకు అధికార బీజేపీ చేసిన ప్రయత్నం బట్టబయలు కావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. బీజేపీ ఇచ్చిన డబ్బుతో పీఏఏఎస్ కన్వీనర్ నరేంద్ర పటేల్ సోమవారం మీడియాకు రావడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్పందించారు. పటీదార్ల మద్దతు బీజేపీకే ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాల్లో గెలుస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. తమపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, సీఎం విజయ్ రూపానీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భేటీ అయ్యారు. రూ. కోటి లంచం ఆరోపణలు, తాజా పరిణామాలపై చర్చించారు. తమ పార్టీలో చేరేందుకు బీజేపీ తనకు కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైందని నరేంద్ర పటేల్ తెలిపారు. ఇటీవల బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్ సన్నిహితుడు వరుణ్ పటేల్ ద్వారా తనతో బేరం కుదుర్చుకుందని ఆయన మీడియాకు వెల్లడించారు. అడ్వాన్స్‌గా తనకు రూ. 10 లక్షలు ఇచ్చారని, మిగతా రూ. 90 లక్షలు రేపు ఇస్తామని చెప్పినట్టు తెలిపారు. వరుణ్ పటేల్ ఇచ్చిన రూ. 10 లక్షల నగదును మీడియాకు చూపించారు. నరేంద్ర పటేల్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఇదంతా కాంగ్రెస్ కుట్రగా వర్ణించింది. తమ పార్టీలో చేరేందుకు ఆయనే ముందుకు వచ్చారని, రెండుమూడు గంటల తర్వాత ఈ డ్రామాకు తెరతీశారని బీజేపీ అధికార ప్రతినిధి భరత్ పాండ్యా అన్నారు. మొత్తం కోటి రూపాయలు తీసుకున్న తర్వాత మీడియాకు ముందుకు రావచ్చు కదా, ముందే ఎందుకు వచ్చారని వరుణ్ పటేల్ ప్రశ్నించారు. పటేల్ కులస్తులంతా బీజేపీ వైపు మొగ్గుచూపుతుండటంతో భయపడిపోయి కాంగ్రెస్ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తోందని ఎదురుదాడి చేశారు.