కడప అర్బన్: కడప నగరం శంకరాపురంలో ఉన్న గాలేరు-నగరి సుజల స్రవంతి(జీఎన్‌ఎస్‌ఎస్) పథకం కింద మంజూరైన పరిహారాన్ని ఆన్‌లైన్‌లో జమ చేసేందుకు రూ.4వేలు లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ నాగరాజు కథనం మేరకు.. చింతకొమ్మదిన్నె మండలం గుర్రంగుంపు తాండాకు చెందిన ఇస్లావత్ కిశోర్‌నాయక్, అతని అమ్మమ్మ లక్షుమ్మకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటిని, గుడిసెను నిర్మించుకున్నారు. మొత్తం స్థలం, వారు ఆశ్రయం పొందుతున్న ఇల్లు, గుడిసె కెనాల్ కింద ముంపునకు గురవుతుందని ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
ఈ మొత్తం రూ. 4,22,000 వారికి పన్నుల మినహాయింపు తర్వాత రావాల్సి ఉంది. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఈ మొత్తాన్ని మంజూరు చేశారు. ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో జమ చేసేందుకు దాదాపు నెలన్నర రోజుల నుంచి జీఎన్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ప్రమీలమ్మ ఇస్లావత్ కిశోర్‌నాయక్‌ను తిప్పుకుంటోంది. ఆ మొత్తాన్ని జమ చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను కలిసి తన పరిస్థితిని వివరించాడు. వారి సూచన మేరకు రూ. 4 వేలను మంగళవారం కార్యాలయంలోనే బాధితుడు జూనియర్ అసిస్టెంట్‌కు ఇస్తుండగా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.4 వేలు స్వాధీనం చేసుకున్నారు. ప్రమీలమ్మను అరెస్టు చేసి బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐ శివశంకర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఏసీబీ వలలో జీఎన్‌ఎస్‌ఎస్ ఉద్యోగిని
Published Wed, Apr 20 2016 3:12 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement