GNSS
-
గుడ్‌న్యూస్.. 20 కిలోమీటర్ల వరకు టోల్ ఫీజు లేదు
ఫంక్షనల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఉన్న వాహనాలు హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో రోజుకు 20 కిలోమీటర్ల వరకు టోల్ ఫీజు లేకుండా ప్రయాణించడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈ మేరకు జాతీయ రహదారుల రుసుము (రేట్ల నిర్ణయం, వసూళ్లు) నిబంధనలు- 2008ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సవరించింది. కొత్త నిబంధనలు మంగళవారం నుండి అమలులోకి వచ్చినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్లో తెలిపింది.కొత్త నిబంధనల ప్రకారం.. జీఎన్ఎస్ఎస్ వాహనాలు 20 కిలోమీటర్లు దాటి ఎంత దూరం ప్రయాణిస్తాయో అంత దూరంపై మాత్రమే ఇప్పుడు రుసుము వసూలు చేస్తారు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆన్-బోర్డ్ యూనిట్ అమర్చిన వాహనాల కోసం ప్రత్యేకమైన లేన్‌ను కేటాయిస్తారు. ఇతర వాహనాలు ఈ లేన్‌లోకి ప్రవేశించినట్లయితే రెండు రెట్ల రుసుమును చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: టోల్ ఫీజు మినహాయింపు ఉంటుందా?ఎంపిక చేసిన జాతీయ రహదారులలో ఫాస్ట్‌ట్యాగ్‌తో పాటు జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని పైలట్ ప్రాతిపదికన అమలు చేయాలని నిర్ణయించినట్లు జూలైలో హైవే మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటకలోని ఎన్‌హెచ్-275లోని బెంగళూరు-మైసూర్ సెక్షన్, హర్యానాలోని ఎన్‌హెచ్-709లోని పానిపట్-హిసార్ సెక్షన్లో జీఎన్ఎస్ఎస్ ఆధారిత వినియోగదారు రుసుము వసూలు వ్యవస్థకు సంబంధించి పైలట్ అధ్యయనం జరిగిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. -
టోల్‌గేట్స్ గాయబ్.. వసూళ్లు మాత్రం ఆగవు
టోల్ గేట్స్ వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గిందడానికి ఫాస్ట్‌ట్యాగ్ విధానం తీసుకువచ్చారు. ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ విధానానికి స్వస్తి పలికి శాటిలైట్ విధానం తీసుకురావడానికి కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే పలు సందర్భాల్లో పేర్కొన్నారు.మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి హైవేల మీద టోల్ గేట్స్ లేకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. టోల్ గేట్స్ మొత్తం తొలగించి.. శాటిలైట్ విధానం ద్వారా టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వాహనదారులు హైవే మీద ఎక్కడా ఆగాల్సిన పనిలేదు.గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ద్వారా టోల్ కలెక్షన్ చాలా సులభం. ఈ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ నేషనల్ హైవే275 & హర్యానాలోని పానిపట్-హిసార్ నేషనల్ హైవే709 మధ్యలో శాటిలైట్ విధానం ద్వారా టోల్ వసూలు చేయడానికి సంబంధించిన ట్రైల్ కూడా విజయవంతంగా పూర్తయిందని గడ్కరీ పేర్కొన్నారు.ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన శాటిలైట్ టోల్ కలెక్షన్ విజయవంతమవ్వడంతో.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఈ సిస్టమ్ అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం గురించి వాహన వినియోగదారులలో అవగాహన కల్పించడానికి ఓ వర్క్‌షాప్ కూడా ఏర్పాటు చేసినట్లు గడ్కరీ పేర్కొన్నారు. మొత్తం మీద దేశంలో టోల్ గేట్స్ త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.శాటిలైట్ విధానం ద్వారా టోల్ కలెక్షన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా.. వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ లెక్కగట్టి వ్యాలెట్ నుంచి అమౌట్ కట్ చేసుకుంటుంది. అయితే ఈ సిస్టమ్ కోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కల్గిన ఫాస్ట్‌ట్యాగ్‌ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రయాణించిన దూరానికి అయ్యే మొత్తాన్ని ఆటోమాటిక్‌గా చెల్లించడానికి సాధ్యమవుతుంది. -
నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ల్యాబ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ సెంటర్ ఫర్ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ప్రయోగశాలను వైస్‌చాన్స్‌లర్ వేణుగోపాల్‌రెడ్డి, నోవాటెల్ సాఫ్ట్వేర్ డైరెక్టర్ మైఖెల్ కినాహాన్‌లు గురువారం ప్రారంభించారు. జేఎన్టీయూహెచ్, హెక్సాగన్ కేపబిలిటీ సెంటర్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ప్రకృతి వనరుల నిర్వహణలో ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌లో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించేందుకు నూతన ప్రయోగ శాల ఉపయోగపడుతుందని వీసీ అన్నారు. సహాజ వనరుల డేటా ప్రాసెసింగ్, విశ్లేషణతో పాటు వాటిని సద్వినియోగం చేసుకునే దిశగా మెరుగైన పరిశోధనలకు ఊతమిస్తుందన్నారు. విద్యార్థులకు శిక్షణ, ఇంటర్న్‌షిప్‌తో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జేఎన్టీయూహెచ్లోని స్పేషియల్ ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ విభాగం విద్యా ర్థులతో పాటు జియో ఇన్ఫ ర్మాటిక్స్ విభాగాలకు చెందిన విద్యార్థులందరూ కొత్త ల్యాబ్ సేవలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ హెచ్ రెక్టార్ ఎన్వీ రమణరావు, రిజిస్ట్రార్ ఎన్.యాదయ్య, నోవాటెల్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ బల్లవ్ ముంద్రా, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ శ్రీనివాస్, ఐఎస్టీ విభాగం అధిపతి జయశ్రీ, సీఎస్‌ఐటీ విభాగం డైరెక్టర్ రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో జీఎన్ఎస్ఎస్ ఉద్యోగిని
కడప అర్బన్: కడప నగరం శంకరాపురంలో ఉన్న గాలేరు-నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) పథకం కింద మంజూరైన పరిహారాన్ని ఆన్లైన్లో జమ చేసేందుకు రూ.4వేలు లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ నాగరాజు కథనం మేరకు.. చింతకొమ్మదిన్నె మండలం గుర్రంగుంపు తాండాకు చెందిన ఇస్లావత్ కిశోర్‌నాయక్, అతని అమ్మమ్మ లక్షుమ్మకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటిని, గుడిసెను నిర్మించుకున్నారు. మొత్తం స్థలం, వారు ఆశ్రయం పొందుతున్న ఇల్లు, గుడిసె కెనాల్ కింద ముంపునకు గురవుతుందని ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మొత్తం రూ. 4,22,000 వారికి పన్నుల మినహాయింపు తర్వాత రావాల్సి ఉంది. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఈ మొత్తాన్ని మంజూరు చేశారు. ఆ మొత్తాన్ని ఆన్లైన్లో జమ చేసేందుకు దాదాపు నెలన్నర రోజుల నుంచి జీఎన్ఎస్ఎస్ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ప్రమీలమ్మ ఇస్లావత్ కిశోర్నాయక్ను తిప్పుకుంటోంది. ఆ మొత్తాన్ని జమ చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను కలిసి తన పరిస్థితిని వివరించాడు. వారి సూచన మేరకు రూ. 4 వేలను మంగళవారం కార్యాలయంలోనే బాధితుడు జూనియర్ అసిస్టెంట్‌కు ఇస్తుండగా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.4 వేలు స్వాధీనం చేసుకున్నారు. ప్రమీలమ్మను అరెస్టు చేసి బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐ శివశంకర్, సిబ్బంది పాల్గొన్నారు.