ఫంక్షనల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్‌ఎస్‌ఎస్) ఉన్న వాహనాలు హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో రోజుకు 20 కిలోమీటర్ల వరకు టోల్ ఫీజు లేకుండా ప్రయాణించడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈ మేరకు జాతీయ రహదారుల రుసుము (రేట్ల నిర్ణయం, వసూళ్లు) నిబంధనలు- 2008ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సవరించింది. కొత్త నిబంధనలు మంగళవారం నుండి అమలులోకి వచ్చినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో తెలిపింది.
కొత్త నిబంధనల ప్రకారం.. జీఎన్‌ఎస్‌ఎస్ వాహనాలు 20 కిలోమీటర్లు దాటి ఎంత దూరం ప్రయాణిస్తాయో అంత దూరంపై మాత్రమే ఇప్పుడు రుసుము వసూలు చేస్తారు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆన్-బోర్డ్ యూనిట్ అమర్చిన వాహనాల కోసం ప్రత్యేకమైన లేన్‌ను కేటాయిస్తారు. ఇతర వాహనాలు ఈ లేన్‌లోకి ప్రవేశించినట్లయితే రెండు రెట్ల రుసుమును చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: టోల్ ఫీజు మినహాయింపు ఉంటుందా?
ఎంపిక చేసిన జాతీయ రహదారులలో ఫాస్ట్‌ట్యాగ్‌తో పాటు జీఎన్‌ఎస్‌ఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని పైలట్ ప్రాతిపదికన అమలు చేయాలని నిర్ణయించినట్లు జూలైలో హైవే మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటకలోని ఎన్‌హెచ్-275లోని బెంగళూరు-మైసూర్ సెక్షన్, హర్యానాలోని ఎన్‌హెచ్-709లోని పానిపట్-హిసార్ సెక్షన్‌లో జీఎన్‌ఎస్‌ఎస్ ఆధారిత వినియోగదారు రుసుము వసూలు వ్యవస్థకు సంబంధించి పైలట్ అధ్యయనం జరిగిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment