కార్పొరేట్ కంపెనీల్లోనూ లంచాలు
లండన్ : కార్పొరేట్, ప్రముఖ కంపెనీల్లో లంచగొండితనం, అవినీతి పెరుగుతున్నాయి. ఈ నిజాన్ని ఆ కంపెనీల్లో పనిచేసే 80శాతం మంది ఎగ్జిక్యూటివ్ లే ఒప్పుకున్నారని యూకే న్యాయసంస్థ ఎవర్ సెడ్స్ సర్వే వెల్లడించింది. కంపెనీల్లో అవినీతి నిరోధక విధానాల అమలును పట్టించుకునే దిక్కే లేదని ఈ సర్వే పేర్కొంది. మొత్తం 12 దేశాల్లో 500 మంది బోర్డు లెవల్ ఎగ్జిక్యూటివ్ లపై జరిపిన సర్వేలో కంపెనీల్లో అవినీతికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడైయ్యాయి. కంపెనీల్లో ఏర్పాటు చేసిన లంచం వ్యతిరేక విధానాలు సరిగ్గా పనిచేయడం లేదని 59శాతం మంది ఎగ్జిక్యూటివ్ లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఒక కంపెనీలో మరో కంపెనీ విలీనం చేసేటప్పుడు, ఒక కంపెనీని మరో కంపెనీ స్వాధీనం చేసుకునేప్పుడు అవినీతి వ్యతిరేక విధానాలపై అసలు శ్రద్ధ వహించడం లేదని 33శాతం మంది ఎగ్జిక్యూటివ్ లు చెప్పినట్టు సర్వే వెల్లడించింది. లంచం తీసుకోవడం, అవినీతికి పాల్పడటం వంటివి యూకేలో రాజకీయ సమస్యగా మారాయి. ఇవి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని చట్టసభ సభ్యులు గుర్తించారు. ఈ సమస్యను రూపుమాపడానికి, ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న స్పందనలపై చర్చించడానికి ఆ దేశ ప్రధాని డేవిడ్ కెమెరూన్ వచ్చే వారంలో అవినీతి వ్యతిరేక సమావేశం నిర్వహించనున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా పేరొందిన ప్రముఖులు, వ్యాపారస్తులు ప్రభుత్వాలకు చట్టబద్ధంగా చెల్లించాల్సిన పన్నులు ఎగొట్టి, మనీ లాండరింగ్ కు పాల్పడుతూ బిలియన్ ధనాన్ని దొంగ ఖాతాల్లో దాచుకున్నారని పనామా పేపర్ల కుంభకోణంతో బయటపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిపిన సర్వేలో అసలు కంపెనీల్లో ఈ లంచగొండి వ్యతిరేక విధానాలు అమలుకావడం లేదని వెల్లడైంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు యూకే, ఇటలీ, బ్రెజిల్, హాంగ్ కాంగ్, చైనా కంపెనీల్లో 500 ఉద్యోగులపై ఈ సర్వే చేపట్టారు.