వాల్తేరు డీఆర్‌ఎం లంచం కేసులో నాలుగో రోజూ విచారణ
డీఆర్‌ఎం అనధికార వ్యవహారాలు చూసే ఇద్దరు ఉద్యోగుల ప్రమేయంపై ఆరా
27 తర్వాత మరోసారి వచ్చి దర్యాప్తు చేస్తామని వెల్లడి
అప్పటి వరకు ఫైళ్లను ఎవరూ టచ్ చేయవద్దని ఆదేశం
సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డీఆర్‌ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ కాంట్రాక్టు సంస్థల నుంచి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. వరుసగా నాలుగో రోజు శనివారం ఏడీఆర్‌ఎం పేషీలో ఉద్యోగులు, అధికారులను సీబీఐ బృందం విచారించింది. డీఆర్‌ఎం అనధికార వ్యవహారాలను పర్యవేక్షించే ఇద్దరు ఉద్యోగులపై సీబీఐ ఆరా తీసింది. ప్రొటోకాల్–స్పోర్ట్స్ విభాగంలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి ఒకరు డీఆర్‌ఎం వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఫైళ్ల లావాదేవీలు పూర్తి చేసే విషయంలో ముందుగా సదరు ఉద్యోగితో సంప్రదింపులు జరిగేవి.
ఎవరైనా విదేశీ కరెన్సీ లంచంగా ఇస్తే అతనే వాటిని మార్పిడి చేసేవారని సమాచారం. ఈ విషయాలపైనా సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అదేవిధంగా డీఆర్‌ఎం అక్రమ వ్యవహారాలను దగ్గరుండి చక్కబెట్టే ఒక గ్రూప్–4 ఉద్యోగి పాత్రపైనా సీబీఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేసి విచారించారు. మొత్తం మెకానికల్, ఇంజినీరింగ్, మెడికల్‌తోపాటు 8 విభాగాల ఉద్యోగులను ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించారు. అనంతరం ‘కేసు దర్యాప్తులో ఉంది.
గత డీఆర్‌ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ ఆమోదించిన, ఆమోదించబోయే ఫైళ్లను ఎవరూ కదిలించొద్దు. మేం ఈ నెల 27 తర్వాత వచ్చి పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం చెబుతాం’ అని సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డీఆర్‌ఎం లంచాల వ్యవహారంలో ఓ సీనియర్ అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు అధికారిని కూడా విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది.
కొన్ని ఫైళ్లు స్వాదీనం
ఈ కేసులో ఇప్పటికే డీఆర్‌ఎం కార్యాలయంతోపాటు విశాఖ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న డీఆర్‌ఎం బంగ్లాలోను సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలక ఫైళ్లు స్వా«దీనం చేసుకున్నారు. డీఆర్‌ఎం లంచం తీసుకుంటూ దొరకడానికి కారణమైన సంస్థలతోపాటు ఇంకా ఏ సంస్థలకైనా అనుకూలంగా టెండర్లలో మార్పులు చేయడం, పెనాల్టీ తగ్గించడం వంటి వ్యవహారాలకు పాల్పడి ఉండవచ్చని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతి టెండర్ ఫైల్‌ను పరిశీలించాలని నిర్ణయించారు. సౌరభ్‌కుమార్ వాల్తేరు డీఆర్‌ఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏయే ఫైళ్లపై సంతకాలు చేశారన్న విషయాలపై పూర్తిస్థాయిలో ఈ నెల 27వ తేదీ తర్వాత దర్యాప్తు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment