ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్
♦ రూ.6వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
♦ బిల్ కలెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు
ఖమ్మం : కార్పొరేషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న బిల్ కలెక్టర్‌ను ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాయిబాబా బృందం శుక్రవారం వల వేసి పట్టుకుంది. అనంతరం నగరంలోని శ్రీనివాస్ ఇంటిపై దాడులు చేయడంతోపాటు ఆస్తులను సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. నగరంలోని విలీన పంచాయతీ దానవాయిగూడెం ప్రాంతానికి చెందిన షేక్ ఖాసీం తన అత్తమామల నుంచి పొందిన 80 గజాల స్థలంలో రేకుల షెడ్ వేసుకున్నాడు. విలీన పంచాయతీ కావడంతో కార్పొరేషన్ రికార్డుల్లో నమోదు చేసి.. ఇంటి నంబర్ ఇస్తేనే నీటి పంపు, విద్యుత్ కనెక్షన్ వస్తుంది. దీంతో తనకు ఇంటి నంబర్ ఇవ్వాలని బిల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని కోరగా.. దీనికోసం రూ.22వేలు లంచం డిమాండ్ చేశాడు.
అంత మొత్తంలో ఇవ్వలేని ఖాసీం బతిమిలాడటంతో.. చివరకు రూ.12వేలకు అంగీకారం కుదుర్చుకొని.. మూడు నెలల క్రితం రూ.6వేలు లంచం తీసుకున్నాడు. అయినా నంబర్, పంపు కనెక్షన్ ఇచ్చేందుకు జాప్యం చేయడంతో ఖాసీం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు ప్రణాళిక ప్రకారం శుక్రవారం రూ.6వేలు ఖాసీంకు ఇచ్చి.. శ్రీనివాస్‌రెడ్డికి లంచంగా ఇచ్చేందుకు ఫోన్ చేశారు. రెండు బృందాలుగా ఏసీబీ అధికారులు విడిపోయి.. ఒక బృందం ముస్తఫా నగర్, మరో బృందం శ్రీరాంనగర్‌లోని శ్రీనివాస్‌రెడ్డి ఇంటి వద్ద పాగా వేసింది.
ఈ క్రమంలో లంచం డబ్బుల కోసం ముస్తఫా నగర్ పెట్రోల్ బంక్ వద్దకు రమ్మని చెప్పడంతో.. ఖాసీం అక్కడికి వెళ్లి శ్రీనివాస్‌రెడ్డికి డబ్బులు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. అనంతరం నగరంలో శ్రీరాం నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, కేసు నమోదు చేస్తామని డీఎస్పీ సాయిబాబా తెలిపారు. దాడుల్లో ఏసీబీ ఖమ్మం ఎస్సై జి.వెంకటేశ్వర్లు, వరంగల్ ఎస్సైలు సాంబయ్య, శ్రీనివాసరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.