సాక్షి,వైఎస్‌ఆర్‌జిల్లా: కడపలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి మళ్లీ దౌర్జన్యానికి దిగారు. సోమవారం(డిసెంబర్23) జరుగుతున్న కడప మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో అనుచరులతో కలిసి వీరంగం సృష్టించారు. మేయర్‌తో పాటు తనకూ కుర్చీ వేయాలని మళ్లీ హంగామా చేశారు. దీంతో ఎమ్మెల్యే,మేయర్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది.
టీడీపీ నేతలతో కలిసి ఎమ్మెల్యే మాధవీరెడ్డి సమావేశ మందిరంలో గొడవకు దిగారు. ఇందుకు ప్రతిగా మేయర్‌కు మద్దతుగా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఆయన సీటు ముందే బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్పొరేటర్లకు మధ్య తోపులాట జరిగింది. దీంతో సమావేశానికి ఆటంకం కలిగిస్తున్నారంటూ మేయర్ సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఏడుగురు కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు వేశారు.
సమావేశానికి సభ్యులు మినహా ఎవరికీ అనుమతి లేదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎమ్మెల్యే ఖాతరు చేయలేదు. డబ్బులిచ్చి మరీ మహిళలను నగరపాలక సంస్థ సమావేశానికి తీసుకువచ్చి కవ్వింపు చర్యలకు దిగారు. కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.
గతంలోనూ నగరపాలక సంస్థ సమావేశంలో మాధవీరెడ్డి కుర్చీ కోసం హంగామా చేశారు.ప్రజా సమస్యలపై చర్చించండన్నా వినకుండా గొడవ చేశారు. దీంతో ప్రస్తుతం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సమావేశానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కార్యాలయం సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఎవరూ గుమికూడవద్దని,ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: గుంటూరులో టీడీపీ నేత దాష్టీకం
Comments
Please login to add a commentAdd a comment