corporation office
-
కష్టాలను గుర్తించిన కమిషనర్
నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం నిత్యం వందలాది మంది ప్రజలు వస్తుంటారు. వారిలో వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు, మహిళలు ఉంటారు. మెయిన్ రోడ్డు నుంచి లోనికి వచ్చేందుకు వారు ఇబ్బందులు పడేవారు. వారి కష్టాలను గమనించిన కమిషనర్ మూర్తి బ్యాటరీ వాహనాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కమిషనర్ మూర్తి వాహనంలో కొంతసేపు ప్రయాణం చేశారు. ఈ వాహనం చాలా సౌకర్యంగా ఉందని, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే కోటంరెడ్డి కమిషనర్‌ను ప్రశంసించారు. -
మహిళా అధికారికి బెదిరింపులు: ఇద్దరు అరెస్ట్
తిరువొత్తియూరు : కార్పొరేషన్ కార్యాలయ మహిళా అధికారిని బెదిరించి నగదు ఇవ్వమని కోరిన ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆవడి కార్పొరేషన్ పట్టణాభివృద్ధి కార్యాలయ అధికారిణి సుబ్బుతాయి. ఆమె శుక్రవారం తన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో గదిలోకి చొరబడిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తాము ఏసీబీ విభాగం ఉద్యోగులమని పరిచయం చేసుకున్నారు. ఎందుకు వచ్చారని ఆమె ప్రశ్నించగా మీరు లంచం తీసుకుంటున్నట్టు ఫిర్యాదులు అందాయని మీపై చర్యలు తీసుకోకుండా ఉండాలంటే నగదు ఇవ్వవలసి ఉంటుందని బెదిరించారు. దీంతో సుబ్బుతాయి సిబ్బందిని పిలిచి ఆ ఇద్దరిని ఆవడి పోలీసులకు అప్పగించారు. ఆవడి పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. విచారణలో వారు అంబత్తూరు అయప్పాక్కంకు చెందిన మోహన్‌రాజ్, విజయలక్ష్మి పురంకు చెందిన వేలాయుధం అని తెలిసింది. -
నెల్లూరు కార్పొరేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ ధర్నా
నెల్లూరు: షెడ్యూల్డ్ కులాల సబ్‌ప్లాన్ కింద మంజూరైన నిధులను ఖర్చుచేయకపోవడంపై నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. సబ్‌ప్లాన్ కింద మంజూరైన నిధులను ఖర్చు చేయకపోవడం పట్ల కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చివరకు కమిషనర్ హామీతో వారు ఆందోళన విరమించారు. -
సర్వం సర్వేమయం
స్మార్ట్ సర్వేలో ఉద్యోగులు స్తంభించిన పాలన బోసిపోయిన కార్పొరేషన్ కార్యాలయం అయోమయంలో నగర వాసులు తిరుపతి శివజ్యోతి నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటిపై బ్యాంక్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రూ.5 లక్షలు మంజూరైంది. అయితే టౌన్ బ్యాంక్ అధికారులు కార్పొరేషన్ నుంచి ఇన్ కార్పొరేషన్ సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పారు. అతను 20 రోజుల క్రితం ఆ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సంబంధిత అధికారులు, ఉద్యోగులు సర్వేలో ఉండడంతో ఇబ్బంది పడుతున్నాడు. బ్యాంక్ అధికారులు ఫోన్ చేసి 28లోపు సర్టిఫికెట్ ఇవ్వకుంటే లోన్ రద్దవుతుందని చెప్పడంతో ఏం చేయాలో తెలియక కుమిలిపోతున్నాడు. తిరుపతి తుడా: కార్పొరేషన్ కార్యాలయం వెలవెలాబోతోంది. రెవెన్యూ, హెల్త్, టౌన్‌ప్లానింగ్, ఇజినీరింగ్, పరిపాలన, అకౌంట్స్ శాఖల్లోని ఉద్యోగులందరూ ప్రజాసాధికార సర్వేలో ఉండడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వివిధ విభాగాలకు సబంధించిన ఫైళ్లు టేబుళ్లపై ఎవరెస్ట్ శిఖరంలా పేరుకుపోతున్నాయి. అత్యవసర ఫైళ్ల పరిస్థితీ అంతే. జనన, మరణ ధ్రువీకరణ, పన్నుల చెల్లింపులు, భవన నిర్మాణ అనుమతులు ఇలా ఒక్కటేంటి అన్ని ఫైళ్లూ ముందుకు కదలడంలేదు. వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చిన ప్రజానీకానికి కనీస సమాచారం ఇచ్చేనాథుడూ లేకుండా పోయారు. అందరూ సర్వేకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే మున్సిపల్ కార్పొరేషన్లో ఈ నెల 8 నుంచి ప్రారంభమైంది. మొదటి 14 రోజులు సర్వర్ డౌన్, నెట్వర్క్ సమస్యలతో సర్వే సక్రమంగా ముందుకు సాగలేదు. అయితే మొదటి విడత సర్వేను ఈనెల 31 లోపు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో స్థానిక పాలకుల్లో కదలిక వచ్చింది. ఎన్యూమరేటర్లతోపాటు కార్పొరేషన్ అధికారులను సూపర్వైజర్లుగా.. ఉద్యోగులను అసిస్టెంట్లుగా నియమించారు. ఇందులో చాలామందికి ట్యాబ్‌లు, బయోమెట్రిక్‌ల వినియోగం తెలియకపోవడంతో కార్పొరేషన్‌లోని అన్ని విభాగాల్లోని దాదాపు 90 శాతం మంది ఉద్యోగులను సర్వేకు కేటాయించారు. -
ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్
♦ రూ.6వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం ♦ బిల్ కలెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు ఖమ్మం : కార్పొరేషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న బిల్ కలెక్టర్‌ను ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాయిబాబా బృందం శుక్రవారం వల వేసి పట్టుకుంది. అనంతరం నగరంలోని శ్రీనివాస్ ఇంటిపై దాడులు చేయడంతోపాటు ఆస్తులను సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. నగరంలోని విలీన పంచాయతీ దానవాయిగూడెం ప్రాంతానికి చెందిన షేక్ ఖాసీం తన అత్తమామల నుంచి పొందిన 80 గజాల స్థలంలో రేకుల షెడ్ వేసుకున్నాడు. విలీన పంచాయతీ కావడంతో కార్పొరేషన్ రికార్డుల్లో నమోదు చేసి.. ఇంటి నంబర్ ఇస్తేనే నీటి పంపు, విద్యుత్ కనెక్షన్ వస్తుంది. దీంతో తనకు ఇంటి నంబర్ ఇవ్వాలని బిల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని కోరగా.. దీనికోసం రూ.22వేలు లంచం డిమాండ్ చేశాడు. అంత మొత్తంలో ఇవ్వలేని ఖాసీం బతిమిలాడటంతో.. చివరకు రూ.12వేలకు అంగీకారం కుదుర్చుకొని.. మూడు నెలల క్రితం రూ.6వేలు లంచం తీసుకున్నాడు. అయినా నంబర్, పంపు కనెక్షన్ ఇచ్చేందుకు జాప్యం చేయడంతో ఖాసీం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు ప్రణాళిక ప్రకారం శుక్రవారం రూ.6వేలు ఖాసీంకు ఇచ్చి.. శ్రీనివాస్‌రెడ్డికి లంచంగా ఇచ్చేందుకు ఫోన్ చేశారు. రెండు బృందాలుగా ఏసీబీ అధికారులు విడిపోయి.. ఒక బృందం ముస్తఫా నగర్, మరో బృందం శ్రీరాంనగర్‌లోని శ్రీనివాస్‌రెడ్డి ఇంటి వద్ద పాగా వేసింది. ఈ క్రమంలో లంచం డబ్బుల కోసం ముస్తఫా నగర్ పెట్రోల్ బంక్ వద్దకు రమ్మని చెప్పడంతో.. ఖాసీం అక్కడికి వెళ్లి శ్రీనివాస్‌రెడ్డికి డబ్బులు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. అనంతరం నగరంలో శ్రీరాం నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, కేసు నమోదు చేస్తామని డీఎస్పీ సాయిబాబా తెలిపారు. దాడుల్లో ఏసీబీ ఖమ్మం ఎస్సై జి.వెంకటేశ్వర్లు, వరంగల్ ఎస్సైలు సాంబయ్య, శ్రీనివాసరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
దద్దరిల్లిన ధర్నాలు
విజయవాడ సెంట్రల్ : బుడమేరు ప్రాంతంలో ఫ్లైఓవర్ ర్యాంప్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాంటూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆ ప్రాంత పేదలు బుధవారం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పార్టీ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, జె.శ్యాం మాట్లాడుతూ మధ్యకట్టలో బుడమేరు ఒడ్డున వందలాది కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. ర్యాంప్ నిర్మాణానికి అడ్డు వస్తాయని సుమారు 200 ఇళ్లను కూలగొట్టేందుకు అధికారులు నిర్ణయించడం దారుణమన్నారు. ర్యాంప్ నిర్మాణానికి బదులు పిల్లర్లతో వంతెన నిర్మాణం చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. ఈ మేరకు వినతి పత్రాన్ని కమిషనర్ జి.వీరపాండియన్‌కు అందించారు. వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల, కార్పొరేటర్లు అవుతు శ్రీశైలజ, సుభాషిణి, మల్లీశ్వరి, పాల ఝాన్సీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చార్జీలు తగ్గించాల్సిందే.. డ్రెయినేజీ, వాటర్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. కౌన్సిల్ ముందు ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ నుంచి భవానీపురం కరకట్ట వరకు ఉన్న ఆక్రమణల్ని తొలగించాలన్న ఆలోచనను విరమించుకోవాలని సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంతాపం, సన్మానం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, గోదావరి పుష్కరాల సందర్భంగా మృతిచెందిన 25 మంది భక్తులు, విద్యుత్ షాక్‌తో ఉర్మిళా నగర్లో మృతిచెందిన వారికి కౌన్సిల్ సంతాపం ప్రకటించింది. మేయర్ కోనేరు శ్రీధర్, వివిధ పార్టీల ఫ్లోర్‌లీడర్లు జి.హరిబాబు, బిఎన్.పుణ్యశీల, ఆదిలక్ష్మి, ఉత్తమ్‌చంద్ బండారీ సంతాపం తెలిపారు. గోదావరి పుష్కరాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన ఈఈ ఓంప్రకాష్‌ను మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్లు దుశ్శాలువాతో సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఉత్తమ సేవా పత్రాన్ని అందించారు. -
ఖజానాలో మామూళ్ల పండగ!
‘గంగవరం మండలంలో వైద్యశాఖ పరిధిలో 800కు పైగా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. జూలైకి సంబంధించి వీరికి 43 శాతం పీఆర్సీ పెరగడంతో కొత్త వేతనాలు వస్తాయి. ఇందుకోసం సర్వీసు రిజిస్టరు, ఇతర ఫారాలను ఉప ఖజానా శాఖకు అందజేయాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగి ఫైలుకు రూ.300 ఇస్తేనే కొత్త పీఆర్సీ వేతన బిల్లులు మంజూరు చేస్తామని ఖజానా శాఖకు సంబంధించిన అధికారులు వసూళ్లకు తెరలేపారు.’ - రూ.కోట్లు కురిపిస్తున్న కొత్త పీఆర్సీ - ఫైలుకు రూ.300 నుంచి రూ.500 చెల్లించాల్సిందే - వసూల్ రాజాలుగా ఉద్యోగ సంఘ నాయకులు ‘చిత్తూరు నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో 350 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఫిట్మెంట్తో ఇక్కడి ఉద్యోగుల జీతంలో కనిష్టంగా రూ.4 వేల నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు ఒకేసారి పెరుగుతుంది. ఒక్కో ఉద్యోగి ఫైలుకు రూ.500 ఇస్తేనే జిల్లా ఖజానాశాఖలో బిల్లులు పాస్ చేస్తారని ఓ అధికారి కుండబద్దలు కొట్టారు.’ అందుకుంటారు. ఉద్యోగుల ఆశల్ని బలహీనతగా భావిస్తున్న కొందరు ఉద్యోగ సంఘ నాయకులు ఇప్పటికే పెద్ద మొత్తంలో నగదు వసూలు చేయగా.. మరికొన్ని చోట్ల ఖజానాశాఖ అధికారులే బహిరంగంగా వసూళ్లకు దిగారు. జిల్లాలో దాదాపు 38వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుంటే వీరిలో రోడ్లపై చెత్తను తీసే కార్మికుడి నుంచి ఉపాధ్యాయులు, వైద్యశాఖ ఉద్యోగులు, రెవెన్యూ, పోలీసు శాఖ లాంటి ప్రధాన శాఖలకు చెందిన సిబ్బంది ఉన్నతాధికారులు ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి సగటున రూ.700 చొప్పున రూ.2.66 కోట్లు లంచాల రూపంలో వసూలు చేస్తున్నారు. ఇందులో కొందరు ఉన్నతాధికారులు తమ వాటాను తగ్గించకుండా ఇవ్వాలని ఆదేశిస్తున్నారే తప్ప లంచాలు వద్దని చెప్పకపోవడం గమనార్హం. ఇలా వసూళ్లు కొత్త పీఆర్సీ ప్రకారం 2013 జూలై నుంచి 2015 ఏప్రిల్ వరకు పెరిగిన వేతనాలను పీఎఫ్, సీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ఏడాది మే నుంచి జూలై వరకు ఉన్న పీఆర్సీ బకాయిలను ఆయా ఉప ఖజానాశాఖ అధికారులు ఆమోదించిన తరువాత ఉద్యోగులకు అందుతుంది. అయితే కొందరు ఏటీవోలు, ఎస్టీవోలు ఉద్యోగ సంఘ నాయకుల వద్ద బేరసారాలు చేసుకుని ఇక్కడ తమకు జిరాక్స్ కాపీలు, ఇతర స్టేషనరీ అవసరమవుతుందని, అందు కోసం ఒక్కో ఫైలుకు నగదు ఇవ్వాల్సిందేనని దుకాణాలు పెట్టారు. ఈ మామూళ్లు రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటోంది. ఇదే అదునుగా కొన్ని చోట్ల ఉద్యోగ సంఘ నాయకులు ఒక్కో ఫైలుకు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు కూడా వసూలు చేస్తున్నారు. ఇక ఉమ్మడి బిల్లులు కాకుండా ఎవరైనా వ్యక్తిగతంగా బిల్లుల్ని నేరుగా తీసుకెళితే ఆడిట్ అభ్యంతరాల పేరిట ఫైళ్లను పక్కన పడేస్తున్నారు. మరికొన్ని చోట్ల రోజులు తరబడి ఫైళ్లను ఖజానాశాఖ అధికారులే ఉంచేసుకుంటున్నారు. -
కమిషనర్‌గా ఐఏఎస్ వచ్చేనా!
ఐఏఎస్ వస్తే తమకు గుర్తింపు తగ్గుతుందన్న ధోరణిలో మేయర్ ఐఏఎస్ రాకుండా ప్రయత్నం కార్పొరేషన్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి మూణ్ణాల ముచ్చటగానే మారింది. ప్రభుత్వం హుటాహుటిన రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లలో ఐఏఎస్‌లను నియమించే విధంగా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ స్థానంలో ఐఏఎస్‌ను నియమించారు. అయితే టీడీపీ నాయకులు వారి రాజకీయ మనుగడకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని ఐఏఎస్ కమిషనర్‌ను బదిలీ చేశారు. నగర పాలక సంస్థ కమిషనర్‌గా ఈ సారి ఐఏఎస్ రావడం కష్టమేనని తెలుస్తోంది. నెల్లూరు, సిటీ : నెల్లూరు నగరపాలక సంస్థకు ఐఏఎస్ కమిషనర్‌గా వస్తే తమకు ప్రాధాన్యం తగ్గుతుందని మేయర్ అబ్దుల్ అజీజ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మేయర్ ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా రాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. గత కమిషనర్ ఐఏఎస్ చక్రధర్‌బాబు, మేయర్ అబ్దుల్ అజీజ్‌కు మధ్య సయోధ్య కుదరలేదు. తనను సంప్రదించకుండానే కమిషనర్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం పలు అంశాలతో మేయర్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ఓ సమావేశంలో అధికారులనుద్దేశించి మేయర్‌తో కలిసి పనిచేయకపోతే బదిలీపై వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గత నెల 12న కమిషనర్ చక్రధర్‌బాబు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవం ఐటీడీఏ పీడీగా బదిలీపై వెళ్లారు. ఈ బదిలీ వెనుక మేయర్ ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. చక్రధర్‌బాబు బదిలీ అయి నెలకు పైగా గడుస్తున్నా కొత్త కమిషనర్‌ను నియమించలేదు. జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్‌ను ఇన్చార్జి కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే ఆయనకు జిల్లా అదనపు బాధ్యతలు కూడా ఉండడంతో కార్పొరేషన్‌పై శ్రద్ధ చూపట్లేదనే ఆరోపణలున్నాయి. అప్పుడప్పుడు మాత్రమే ఇంతియాజ్ కార్పొరేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కార్పొరేషన్ పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. మంత్రి నారాయణ వచ్చే నెల ఆరో తేదీన రాజధాని నిర్మాణ కార్యక్రమం పూర్తయిన తరువాత కమిషనర్ల బదిలీలు ఉంటాయని తెలిసింది. నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కార్పొరేషన్ కమిషనర్‌గా ఐఏఎస్‌ను నియమించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. అయితే తమ మాట వినలేదనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు బదిలీ చేయడం ఎంతవరకు సబబు అని పలు పార్టీ నాయకులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేయర్ నిరంకుశ ధోరణికి ఈ బదిలీ నిదర్శనంగా నిలుస్తుందంటున్నారు. అస్తవ్యస్తంగా పారిశుధ్యం నగర పాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌బాబు ఉన్న సమయంలో కొంత గాడిలో పడుతున్న సమయంలో టీడీపీ రాజకీయ క్రీడలో ఆయన బదిలీపై వెళ్లారు. దీంతో అవినీతి పరులకు రెక్కలొచ్చాయి. కార్పొరేషన్లో ఏ పని జరగాలన్నా చేయి తడపాల్సి వస్తోంది. లేకపోతే ఫైళ్లు కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. నగరంలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే కనిపిస్తోంది. అధికారులకు ఆదేశాలు జారీ చేసే వారు లేకపోవడంతో వారి ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారు. సమయానికి కార్యాలయానికి రాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతి సోమవారం ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు గత కమిషనర్ చక్రధర్‌బాబు గ్రీవెన్స్‌ను ప్రారంభించారు. ఆయన బదిలీపై వెళ్లినప్పటి నుంచి కార్పొరేషన్లో గ్రీవెన్స్‌ను నిర్వహించే అధికారులు లేకుండా పోయారు. ప్రజలు కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మొత్తం మీద కార్పొరేషన్ గాడి తప్పిందనే ఆరోపణలున్నాయి. -
కార్పొరేషన్‌కు రూ.995 కోట్లు మంజూరు
నెల్లూరు, సిటీ: నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా పథకాల కింద రూ.995 కోట్లు మంజూరైనట్లు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఇన్చార్జ్ కమిషనర్ ఇంతియాజ్‌తో కలిసి కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీకి రూ.520 కోట్లు, తాగునీటి పథకం కింద రూ.475 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ నిధులు మంజూరుకు కీలకపాత్ర వహించిన సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మంత్రి నారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో నెల్లూరు నగరం స్మార్ట్‌సిటీని తలదన్నే విధంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు అబ్దుల్ జలీల్, బాలకోటేశ్వరరావు, వహిద, మామిడాల మధు, జహీర్, షంషుద్దీన్ ఉన్నారు. -
‘కోత’లు కోస్తే తెలిసిపోతుంది !
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, కోతల విషయంలో విద్యుత్ సిబ్బంది గానీ, అధికారులు గానీ అవాస్తవాలు చెప్పేందుకు ఇక అవకాశం ఉండదు. కంప్యూటర్ ముందు కూర్చుంటే ఎన్ని గంటల పాటు కోత విధిస్తున్నారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అంతరాయం ఏర్పడిందా, సరఫరా నిలిచిపోడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా... అనే విషయాలను ఇట్టే తెలుసుకోవచ్చు. దీని కోసం ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో విద్యుత్ కోతల సమాచారం ఇకపై వినియోగదారులే నేరుగా తెలుసుకోవచ్చు. వానరాకడ, ప్రాణం పోకడా తెలియనట్టుగానే, ఇప్పటి వరకు విద్యుత్ రాక, పోక తెలియని అయోమయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎప్పుడు సరఫరా తీస్తారో.. ఎప్పుడు మళ్లీ పునరుద్ధరిస్తారో ఎవరికీ తెలియదు. దీనికి ఫుల్స్టాప్ పెట్టి, భవిష్యత్‌లో వినియోగదారులే నేరుగా సమాచారం తెలుసుకునే విధంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం గృహ, పారిశ్రామిక రంగాలకు అవసరం మేరకు 24 గంటలూ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటనలు చేస్తున్న నేపధ్యంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా.. అందుకు గల కారణాలు, ఏ సమయంలో సరఫరా నిలిచిపోయింది, ఎప్పుడు పునరుద్ధరించారు తదితర విషయాలు సంబంధిత సబ్‌స్టేషన్‌లో అమర్చిన కంప్యూటర్లో నిక్షిప్తమవుతాయి. దీంతో ఆన్లైన్లో జిల్లాలో పరిస్థితిని తెలుసుకుని చక్కదిద్దే అవకాశం అధికారులకు లభిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఇకపై విద్యుత్ కోతలపై మాకేం తెలియదు అనే సమాధానం విద్యుత్ శాఖ సిబ్బంది నుంచి వినిపించదు. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 5లక్షల 70వేల వరకు విద్యుత్ సర్వీసులున్నాయి. వీటన్నింటికీ అక్టోబర్ 2 నుంచి 24 గంటల విద్యుత్ అందించాలన్నది సర్కారు లక్ష్యం. ప్రధానంగా జిల్లాలో గల సుమారు 25 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏడు గంటల పాటు సరఫరా అందించాలన్నది ఉద్ధేశ్యం. ఇది వరకు సాంకేతిక లోపాలు, మరమ్మతుల పేరిట ఎడాపెడా కోతలు విధించే వారు. ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చుకోవలన్న నెపంతో వీటిలో కొన్నింటిని మాత్రమే ఉపకేంద్రం వద్ద నున్న రిజిస్టర్లో నమోదు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి ఉండదు. సిబ్బంది సేవల్లో లోపాల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోతే అందుకు గల కారణం కచ్చితంగా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉపకేంద్రాల్లో ప్రత్యేక మీటర్లతో పాటు సిమ్కార్డులున్న మోడెంలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేయనున్నారు. దీంతో ఎంత సమయం సరఫరా ఉంది. ఎంతసేపు నిలిచిపోయింది..? అన్న సమాచారం ఉపకేంద్రాల వారీగా కంప్యూటర్ ముందు కూర్చుంటే తెలిసిపోతుంది. కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న సర్వర్‌కు మోడెం కనె క్ట్ అవటం ద్వారా రాష్ట్ర వ్యాప్త నెట్వర్క్ అనుసంధానమై ఉంటుంది. విద్యుత్ సరఫరా ఉన్న సమయం పచ్చగా, విద్యుత్ లేని సమయం ఎర్రటి చారతో నిమిషాలు, సెక్షన్ లతో సహా కంప్యూటర్లో చూపుతుంది. కింద స్థాయి అధికారి నుంచి ఉన్నతాధికారుల వరకు, ముఖ్యమంత్రి కూడా ఆన్లైన్లో గ్రామంలో విద్యుత్ సరఫరా 24 గంటలు ఇచ్చారా..? లేదా..? అనే విషయం తెలుసుకోవచ్చు. జిల్లాలో 83 సబ్స్టేషన్ల పరిధిలో.... ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో మొత్తం 83 సబ్స్టేషన్లు ఉండగా.. అందులో 299 ఫీడర్ల ద్వారా వ్యవసాయ, గృహావసర విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీల్లో 54 ఫీడర్లు ఉండగా వాటి ద్వారా వినియోగదారులకు అందించే సేవలను ఇప్పటికే ఆన్‌లైన్‌కు అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మరో 245 ఫీడర్లకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేస్తున్నారు. దాదాపు అన్ని ఫీడర్లకు ఈ ప్రక్రియను అనుసంధానం చేయడం పూర్తయింది. ఇప్పుడు చిన్నపాటి లోపాలను సరిదిద్దే పనిలో ఉన్నారు. -
మూన్నెళ్ల నుంచి తిరుగుతున్నాం..
అనంతపురం కార్పొరేషన్ : మూడు నెలలుగా తమకు పింఛన్ అందడం లేదని అనంతపురం నగరంలోని 41వ డివిజన్ జనశక్తినగర్‌కు చెందిన వృద్ధులు, వితంతువులు గురువారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. రూ.200 పింఛను ఉన్నప్పుడు నెలనెలా కచ్చితంగా అందుకునేవారమని అన్నారు. జన్మభూమి అంటూ వచ్చి ఐదుగురికి పింఛను ఇచ్చి వెళ్లారని, మిగిలిన వారికి ఇవ్వలేదన్నారు. తమను ఇంతలా గోడాడించిన వారికి మా ఉసురు తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. దాదాపు రెండు గంటల పాటు అక్కడ వేచి చూసినా మేయర్ స్వరూప రాకపోవడంతో ఊసురోమంటూ వృద్ధులు వెనుతిరిగారు. మమ్మలి గోడాడిస్తున్నారు : పెద్దక్క మూడు నెలలుగా పింఛను ఇవ్వకుండా మమ్మలి గోడాడిస్తున్నారు. జన్మభూమి జరిగిన రోజున వచ్చి ఐదుగురికి ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎవరిని అడగాలో తెలియడం లేదు. మాలాంటి ముసలివారిని ఇలా ఇబ్బంది పెట్టడం తగదు. రూ.200 సక్రమంగా అందేది : మోహన్ మాకు రూ.200 పింఛను వచ్చేప్పుడే బాగుంది. ప్రతి నెలా సక్రమంగా వచ్చేది. వెయ్యి రూపాయలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకోలేదు. పింఛను కోసం పడిగాపులు కాస్తున్నాము. జన్మభూమిలో ఓ ఐదుగురికి ఇచ్చి, మళ్ళీ వచ్చి ఇస్తామని చెప్పి రాలేదు. మొన్న సోమవారం మరో ఐదుగురికి ఇచ్చి వెళ్ళారు. మళ్లీ ఇప్పటి వరకు రాలేదు. వేలిముద్ర వేయించుకుని ఇవ్వలేదు : జైనబీ పింఛను ఇస్తామని చెప్పి మా పింఛను కార్డులో తొమ్మిదో నెలలో వేలి ముద్ర వేయించుకుని పింఛను ఇవ్వకుండా వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛను ఇవ్వలేదు. ఎన్నిమార్లు ఎవరి చుట్టూ తిరగాలో అర్థం కావడం లేదు.