అనంతపురం కార్పొరేషన్ : మూడు నెలలుగా తమకు పింఛన్ అందడం లేదని అనంతపురం నగరంలోని 41వ డివిజన్ జనశక్తినగర్‌కు చెందిన వృద్ధులు, వితంతువులు గురువారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. రూ.200 పింఛను ఉన్నప్పుడు నెలనెలా కచ్చితంగా అందుకునేవారమని అన్నారు. జన్మభూమి అంటూ వచ్చి ఐదుగురికి పింఛను ఇచ్చి వెళ్లారని, మిగిలిన వారికి ఇవ్వలేదన్నారు. తమను ఇంతలా గోడాడించిన వారికి మా ఉసురు తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. దాదాపు రెండు గంటల పాటు అక్కడ వేచి చూసినా మేయర్ స్వరూప రాకపోవడంతో ఊసురోమంటూ వృద్ధులు వెనుతిరిగారు.
మమ్మలి గోడాడిస్తున్నారు : పెద్దక్క
మూడు నెలలుగా పింఛను ఇవ్వకుండా మమ్మలి గోడాడిస్తున్నారు. జన్మభూమి జరిగిన రోజున వచ్చి ఐదుగురికి ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎవరిని అడగాలో తెలియడం లేదు. మాలాంటి ముసలివారిని ఇలా ఇబ్బంది పెట్టడం తగదు.
రూ.200 సక్రమంగా అందేది : మోహన్
మాకు రూ.200 పింఛను వచ్చేప్పుడే బాగుంది. ప్రతి నెలా సక్రమంగా వచ్చేది. వెయ్యి రూపాయలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకోలేదు. పింఛను కోసం పడిగాపులు కాస్తున్నాము. జన్మభూమిలో ఓ ఐదుగురికి ఇచ్చి, మళ్ళీ వచ్చి ఇస్తామని చెప్పి రాలేదు. మొన్న సోమవారం మరో ఐదుగురికి ఇచ్చి వెళ్ళారు. మళ్లీ ఇప్పటి వరకు రాలేదు.
వేలిముద్ర వేయించుకుని ఇవ్వలేదు : జైనబీ
పింఛను ఇస్తామని చెప్పి మా పింఛను కార్డులో తొమ్మిదో నెలలో వేలి ముద్ర వేయించుకుని పింఛను ఇవ్వకుండా వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛను ఇవ్వలేదు. ఎన్నిమార్లు ఎవరి చుట్టూ తిరగాలో అర్థం కావడం లేదు.
మూన్నెళ్ల నుంచి తిరుగుతున్నాం..
Published Fri, Dec 19 2014 4:05 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement