‘కోత’లు కోస్తే తెలిసిపోతుంది !
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, కోతల విషయంలో విద్యుత్ సిబ్బంది గానీ, అధికారులు గానీ అవాస్తవాలు చెప్పేందుకు ఇక అవకాశం ఉండదు. కంప్యూటర్ ముందు కూర్చుంటే ఎన్ని గంటల పాటు కోత విధిస్తున్నారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అంతరాయం ఏర్పడిందా, సరఫరా నిలిచిపోడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా... అనే విషయాలను ఇట్టే తెలుసుకోవచ్చు. దీని కోసం ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో విద్యుత్ కోతల సమాచారం ఇకపై వినియోగదారులే నేరుగా తెలుసుకోవచ్చు. వానరాకడ, ప్రాణం పోకడా తెలియనట్టుగానే, ఇప్పటి వరకు విద్యుత్ రాక, పోక తెలియని అయోమయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎప్పుడు సరఫరా తీస్తారో.. ఎప్పుడు మళ్లీ పునరుద్ధరిస్తారో ఎవరికీ తెలియదు. దీనికి ఫుల్‌స్టాప్ పెట్టి, భవిష్యత్‌లో వినియోగదారులే నేరుగా సమాచారం తెలుసుకునే విధంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం గృహ, పారిశ్రామిక రంగాలకు అవసరం మేరకు 24 గంటలూ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటనలు చేస్తున్న నేపధ్యంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా.. అందుకు గల కారణాలు, ఏ సమయంలో సరఫరా నిలిచిపోయింది, ఎప్పుడు పునరుద్ధరించారు తదితర విషయాలు సంబంధిత సబ్‌స్టేషన్‌లో అమర్చిన కంప్యూటర్‌లో నిక్షిప్తమవుతాయి. దీంతో ఆన్‌లైన్‌లో జిల్లాలో పరిస్థితిని తెలుసుకుని చక్కదిద్దే అవకాశం అధికారులకు లభిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఇకపై విద్యుత్ కోతలపై మాకేం తెలియదు అనే సమాధానం విద్యుత్ శాఖ సిబ్బంది నుంచి వినిపించదు.
జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 5లక్షల 70వేల వరకు విద్యుత్ సర్వీసులున్నాయి. వీటన్నింటికీ అక్టోబర్ 2 నుంచి 24 గంటల విద్యుత్ అందించాలన్నది సర్కారు లక్ష్యం. ప్రధానంగా జిల్లాలో గల సుమారు 25 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు ఏడు గంటల పాటు సరఫరా అందించాలన్నది ఉద్ధేశ్యం. ఇది వరకు సాంకేతిక లోపాలు, మరమ్మతుల పేరిట ఎడాపెడా కోతలు విధించే వారు. ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చుకోవలన్న నెపంతో వీటిలో కొన్నింటిని మాత్రమే ఉపకేంద్రం వద్ద నున్న రిజిస్టర్‌లో నమోదు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి ఉండదు. సిబ్బంది సేవల్లో లోపాల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోతే అందుకు గల కారణం కచ్చితంగా చెప్పాలి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉపకేంద్రాల్లో ప్రత్యేక మీటర్లతో పాటు సిమ్‌కార్డులున్న మోడెంలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేయనున్నారు. దీంతో ఎంత సమయం సరఫరా ఉంది. ఎంతసేపు నిలిచిపోయింది..? అన్న సమాచారం ఉపకేంద్రాల వారీగా కంప్యూటర్ ముందు కూర్చుంటే తెలిసిపోతుంది. కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న సర్వర్‌కు మోడెం కనె క్ట్ అవటం ద్వారా రాష్ట్ర వ్యాప్త నెట్‌వర్క్ అనుసంధానమై ఉంటుంది. విద్యుత్ సరఫరా ఉన్న సమయం పచ్చగా, విద్యుత్ లేని సమయం ఎర్రటి చారతో నిమిషాలు, సెక్షన్ లతో సహా కంప్యూటర్‌లో చూపుతుంది. కింద స్థాయి అధికారి నుంచి ఉన్నతాధికారుల వరకు, ముఖ్యమంత్రి కూడా ఆన్‌లైన్‌లో గ్రామంలో విద్యుత్ సరఫరా 24 గంటలు ఇచ్చారా..? లేదా..? అనే విషయం తెలుసుకోవచ్చు.
జిల్లాలో 83 సబ్‌స్టేషన్‌ల పరిధిలో....
ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో మొత్తం 83 సబ్‌స్టేషన్‌లు ఉండగా.. అందులో 299 ఫీడర్‌ల ద్వారా వ్యవసాయ, గృహావసర విద్యుత్ కనెక్షన్‌లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీల్లో 54 ఫీడర్‌లు ఉండగా వాటి ద్వారా వినియోగదారులకు అందించే సేవలను ఇప్పటికే ఆన్‌లైన్‌కు అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మరో 245 ఫీడర్‌లకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేస్తున్నారు. దాదాపు అన్ని ఫీడర్‌లకు ఈ ప్రక్రియను అనుసంధానం చేయడం పూర్తయింది. ఇప్పుడు చిన్నపాటి లోపాలను సరిదిద్దే పనిలో ఉన్నారు.