ఏపీఈపీడీసీఎల్ జిల్లా కార్యాలయం
కావలసినంత విద్యుత్ సరఫరా అవుతున్నా... వినియోగదారులకు కోతలు తప్పడంలేదు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా... ఎక్కడ లోపం ఉన్నదో తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. మొత్తమ్మీద విద్యుత్ అధికారుల తీరు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. చిన్నపాటి గాలివాన వస్తే చాలు గంటలకొద్దీ సరఫరా నిలిచిపోతోంది. ఫలితంగా జిల్లావాసులు పగలనకా... రాత్రనకా... అవస్థలు పడాల్సిన దుస్థితి దాపురిస్తోంది. అసలే మండువేసవి... దానికి తోడు విద్యుత్‌సరఫరా నిలిచిపోవడంవల్ల ఎదురవుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.
సాక్షి, విజయనగరం : జిల్లాలో 6లక్షల 30వేల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరికి సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 358 మంది క్షేత్ర స్థాయిలోనూ, 280 మంది కార్యాలయాల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యుత్ కేటాయింపుల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతిజిల్లాకు నిర్ధిష్ట కోటాను నిర్ణయిస్తారు. అలా జిల్లాకు రోజుకు 6.35 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోటా ఉంది. అవసరాన్ని బట్టి కోటాను మించి కూడా ఇస్తుంటారు. అలా జిల్లాలో రోజుకు 7.40 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. అంటే కోటా కంటే 1.04 మిలియన్ యూనిట్లు అధికంగా జిల్లాకు వస్తోంది.
రెండు రోజుల క్రితం అంటే ఆదివారం రాత్రి జిల్లాలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదు. ఆ రోజు రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకూ కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అందకుమించి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అది కూడా గంటో రెండు గంటలో కాదు. ఏకంగా నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ. రాత్రంతా జిల్లా ప్రజలు ఉక్కపోతతో అవస్థలు పడుతూ నిద్రలేకుండానే గడిపారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 7.30 గంటలకు పోయిన కరెంట్ తెల్లవారుజాము 3గంటల వరకూ రాలేదు. ఆ రోజే కాదు ఏ రోజు ఏ చిన్న గాలివాన వచ్చినా ఇదే పరిస్థితి. ఇంత ఘోరంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారంటే చాలా పెద్ద సమస్యే వచ్చి ఉంటుందనుకుంటాం. కానీ దీనికి అధికారులు చెప్పిన కారణం చూస్తే ఔరా అనిపించకమానదు.
అదేమిటంటే విజయనగరం పట్టణంలోని ధర్మపురి వద్ద 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పిన్ ఇన్సులేటర్ కాలిపోయిందట. విద్యుత్ సబ్‌స్టేషన్లలో గుండ్రని ఆకారంలో పింగాణీతో చేసినవి కొన్ని ట్రాన్స్‌ఫార్మర్లపైన, విద్యుత్ తీగల మధ్య కనిపిస్తూ ఉంటాయి. వాటినే పిన్ ఇన్సులేటర్లుగా పిలుస్తుంటారు. జిల్లాలో మరో రెండు చోట్ల కూడా ఇదే సమస్య ఏర్పడింది. సాధారణంగా ఇలాంటి సమస్య వస్తే కాలిపోయిన పిన్ ఇన్సులేటర్‌ను మార్చడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. అయితే ఈ పని చేయడానికి విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుంది. దీనికి ఇంచుమించు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. అంతకు మించి సమయం పట్టనవసరం లేదు. కానీ జిల్లాలో ఇదే సమస్యకు ఏడెనిమిది గంటలు పట్టడం విచిత్రం. దీనికి అధికారులు చెబుతున్న కారణమేమిటంటే అసలు ఎక్కడ పిన్ ఇన్సులేటర్‌కాలిపోయిందో, మరేదైనా సమస్య వచ్చిందో తెలియడం లేదట.
సమస్య ఎక్కడో తెలుసుకోవడానికే సమయం పడుతోందట. అత్యధిక సాంకేతిక ప్రమాణాలు కలిగిన సంస్థగా దేశ స్థాయిలోనే గుర్తింపుతో పాటు అవార్డులు తీసుకున్న ఏపీఈపీడీసీఎల్‌లో ఉద్యోగుల అ« ద్వాన పనితీరుకు ఇదొక్కటే నిదర్శనం. చిన్న చిన్న సమస్యలకే ఇన్నేసి గంటలు విద్యుత్ కోత విధిస్తే నిజంగా పెద్ద సమస్య ఏదైనా వస్తే పరిస్థితిని ఊహించడానికే భయంగా ఉంది. ఇంత జరుగుతున్నా ఏపీఈపీడీసీఎల్ సీఎండీగానీ, జిల్లా కలెక్టర్‌గానీ దీని గురించి పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ విద్యుత్ శాఖ అధికారులతో వీరిద్దరూ ఒక్క సమీక్ష కూడా చేయకపోవడంతో కింది స్థాయి సిబ్బంది నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment