చదును చేసిన వెంటనే ఇలా కౌంటర్ పెట్టి స్థలాలను విక్రయించేయడమే!
విజయనగరం, బొబ్బిలి: పంచాయతీలు, మున్సిపాలిటీలకు పన్నులు ఎగ్గొట్టి.. నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్న లే అవుట్లపై కొరడా ఝుళిపించేందుకు కలెక్టర్ వివేక్‌యాదవ్ రంగంలోకి దిగారు. జిల్లాలోని లే అవుట్లపై నివేదిక ఇవ్వాలని జిల్లా పం చాయతీ అధికారి బి.సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డీపీవో ఆధ్వర్యం లోని కమిటీలు అక్రమ లే అవుట్లు గుర్తించే పనిలో పడ్డాయి. జిల్లాలో అక్రమంగా ఉన్నవెన్ని? సక్రమ లే అవుట్లు ఎన్ని అన్న అంశాలపై కమిటీ సభ్యులు, అధికారులు పరిశీలిస్తున్నారు.
జిల్లాలో 746 అవుట్ల పరిశీలనలోకమిటీలు..
జిల్లాలో ఉన్న అక్రమ రియల్ ఎస్టేట్లపై అటు ఉడా అధికారుల సూచనలతో జిల్లా పంచాయ తీ అధికారులు ఓ నివేదిక సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,100కు పైబడి రియల్ ఎస్టేట్లు ఉన్నట్టు గుర్తించారు. అయితే, కొత్తగా కలెక్టర్ ఆదేశించిన మీదట జిల్లాలోని 29 మండలాల్లో 746 రియల్ వెంచర్లు వెలసినట్టు నిర్ధారించారు. వీటిని ఆయా మండలాల్లోని కమిటీలు పరిశీలించనున్నాయి. ఇందులో 364 అధికార లే అవుట్లు కాగా, 382 అనధికార లే అవుట్లు ఉన్నట్టు ప్రాథమిక అంచనాకొచ్చినట్టు సమాచారం.
భూ బదలాయింపు ఫీజు తగ్గినా రూ.కోట్లలో దోపిడీ..
ఇటీవల వాణిజ్యపరంగా ఇంటి స్థలాలుగా మార్చే వ్యవసాయ భూములకు మార్పిడి ఫీజు తగ్గింది. సుమారు 12 శాతం ఉండే ఈ పీజు ఇప్పుడు పదిలోపే చెల్లించాల్సి ఉంటుంది. అయినా రియల్టర్లు క్రమబద్ధీకరణకు ముందుకు రావడం లేదు. దీంతో ఏటా ఈ అక్రమ రియల్ ఎస్టేట్ల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండి పడుతోంది.
పరిశీలన ఇలా...
కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశాలతో డీపీవో సత్యనారాయణ ఆధ్వర్యంలో వేసిన కమిటీలు లే అవుట్లను పరిశీలిస్తాయి. కమిటీ సభ్యులుగా స్థానిక పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, ఈవోపీఆర్‌డీలు ఉంటారు. వారు లే అవుట్లను గుర్తించి అందజేసిన నివేదికను తహసీల్దార్, సర్వేయర్లు పరిశీలించి డీపీవోకు అందజేస్తారు. వాటిని సరిపోల్చిన డీపీవో కలెక్టర్‌కు నివేదిస్తారు. అనంతరం వాటిపై చర్యలకు కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడా కమిటీలు పరిశీలనలకు దిగాయి.
అంటకాగుతున్న క్షేత్రస్థాయి ప్రభుత్వ సిబ్బంది..
క్షేత్ర స్థాయిలో రియల్టర్లతో కొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు అంటకాగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేని రియల్ ఎస్టేట్‌లలో కొనుగోలుచేసిన ప్లాట్లలో వాస్తవానికి ఇళ్లను నిర్మించే అవకాశం లేదు. వాటిని కూడా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రభుత్వ సిబ్బంది మేనేజ్ చేసి ఇళ్ల నిర్మాణానికి కూడా లంచాలు గుంజి అనుమతులు ఇచ్చేస్తున్నట్టు భోగట్టా! ఇది అందరికీ తెల్సిన విషయమే అయినా ఏ ఒక్క అధికారీ పట్టించుకోవడం లేదన్నది సుస్పష్టం.
చర్యలుంటాయా?
అక్రమ రియల్ ఎస్టేట్లతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అటు వినియోగదారులకు జెల్ల కొడుతున్న రియల్టర్ల ఘరానా మోసాలకు ఇకనయినా చెక్ పడే అవకాశం ఉంటుందానని వినియోగదారులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా కలెక్టర్ వీటిపై నివేదిక కోరడంతో కాస్తయినా లైన్‌లో పడే పరిస్థితులు ఉంటే మంచిదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
శనివారం నాటికినివేదిక సిద్ధం చేస్తాం!
జిల్లాలో 29 మండలాల్లో 746 లే అవుట్లు ఉన్నట్టు గుర్తించాం. వీటిని కొత్తగా నియమిం చిన కమిటీలు గుర్తిస్తాయి. అవి ఇచ్చిన నివేదికను తహసీల్దార్లు, సర్వేయర్లు పరిశీలిస్తా రు. ఈ నివేదికను వారం రోజుల్లో కలెక్టర్‌కు నివేదిస్తాం. తదుపరి చర్యలు కలెక్టర్ తీసుకుంటారు. – బలివాడ సత్యనారాయణ,జిల్లా పంచాయతీ అధికారి, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment