APEPDCL Unit
-
ప్రభుత్వ శాఖలే శాపం
విద్యుత్తు శాఖకు బకాయిలు షాక్ కొడుతున్నాయి. ప్రజలు ఠంఛన్‌గా బిల్లులు జమ చేస్తున్నా ప్రభుత్వ శాఖలు మాత్రం పైసా చెల్లించకుండా వాయిదా మంత్రాన్ని జపిస్తున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్తు శాఖకు ఆయా శాఖల నుంచి బిల్లులు జమచేయకపోవడంతో బకాయిలు గుదిబండగా మారాయి. ఈ రకంగా కోట్ల రూపాయల్లోనే బకాయిలు వసూలు కాకుండా ఉన్నాయి. ఫలితంగా ఏటేటా విద్యుత్తుశాఖ రెవెన్యూ లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి. సాక్షి, తూర్పు గోదావరి: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోకి వచ్చే జిల్లాలోని ఆరు విద్యుత్తు డివిజన్లలో గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ శాఖల వద్ద పేరుకుపోయిన బకాయిలు రూ.342.58 కోట్లు పైమాటే ఉన్నాయి గత జూన్ నెలలో బకాయిలు రూ.216.04 కోట్లుంటే తాజాగా జూలై నెలకు వచ్చేసరికి బకాయిలు రూ.230.83 కోట్లకు చేరుకుంది. గత చంద్రబాబు సర్కార్ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇందుకు జిల్లాలో ఉన్న 1072 గ్రామ పంచాయతీలు కూడా మినహాయింపు కాదు. గత సర్కార్ గ్రామాలకు వచ్చిన నిధులను వంది మాగధుల స్వప్రయోజనాల కోసం దారిమళ్లించడంతో గడచిన ఐదేళ్లుగా పంచాయతీల పాలకవర్గాలు చిల్లిగవ్వ కూడా విద్యుత్తు బిల్లులు చెల్లించలేకపోయాయి. ఈ కారణంగానే విద్యుత్తు శాఖకు బకాయి పడిన వాటిలో అత్యధికంగా గ్రామ పంచాయతీల వద్దనే ఉండిపోయాయి. జిల్లాలో 17 లక్షల మంది వినియోగదారుల్లో 90 శాతంపైనే నెలనెలా ఏపీఈపీడీసీఎల్‌కు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించేస్తున్నారు. కానీ ప్రభుత్వ శాఖల నుంచి మాత్రం బకాయిలు ఊడిపడటం లేదు. అందులోను బకాయిలు గుదిబండగా మారిన విభాగాల్లో గ్రామ పంచాయతీలదే ఎక్కువగా ఉంది. గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు గడచిన మూడు నెలల లెక్కలు తీస్తే రూ.14.22 కోట్లు ఉంటే అందులో వసూలైంది కేవలం రూ.4.22 కోట్లు మాత్రమే. అంటే ఒక్క గ్రామ పంచాయతీల నుంచి మూడు నెలల బకాయిలు రూ.10 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ శాఖలు, గ్రామ పంచాయతీలన్నీ కలిపితే ఉన్న బకాయిలు రూ.342.58 కోట్లు. ఇందులో గ్రామ పంచాయతీల నుంచే అత్యధికంగా రూ.201.34 కోట్లు విద్యుత్ బిల్లుల రూపంలో పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామ పంచాయతీల తరువాత రెండో స్థానంలో నీటిపారుదల, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ శాఖ నుంచి రూ.97.87 కోట్లు బకాయిలు ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖల నుంచి రూ.20.98 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఈ బకాయిలు వసూలు కాకపోవడంతో విద్యుత్తు శాఖ తలపట్టుకుంటోంది. ఉన్నత స్థాయి నుంచి ఇచ్చే రెవెన్యూ వసూళ్ల లక్ష్యాలను అధిగమించేందుకు ఈ బకాయిలు ప్రతిబంధకమవుతున్నాయని ఏపీఈపీడీసీఎల్ అధికారులు పేర్కొంటున్నారు. రెవెన్యూ లక్ష్యాలు పడిపోతున్నాయి బకాయిలు వసూలు కాకపోవడంతో ఏటా రెవెన్యూ లక్ష్యాలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా కావడంతో బకాయిలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో మరే జిల్లాలో లేని విధంగా అత్యధికంగా 17 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరు సకాలంలో బిల్లులు చెల్లిస్తుండడంతో రెవెన్యూ బాగానే వస్తున్నా, ప్రభుత్వ శాఖల నుంచి బకాయిలు వల్ల లక్ష్యాన్ని అందుకోలేక పోతున్నాం. సీహెచ్ సత్యనారాయణరెడ్డి,సూపరింటెండింగ్ ఇంజినీర్, ఏపీఈపీడీసీఎల్ -
అధికారులు పరువు తీస్తున్నారు!
కావలసినంత విద్యుత్ సరఫరా అవుతున్నా... వినియోగదారులకు కోతలు తప్పడంలేదు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా... ఎక్కడ లోపం ఉన్నదో తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. మొత్తమ్మీద విద్యుత్ అధికారుల తీరు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. చిన్నపాటి గాలివాన వస్తే చాలు గంటలకొద్దీ సరఫరా నిలిచిపోతోంది. ఫలితంగా జిల్లావాసులు పగలనకా... రాత్రనకా... అవస్థలు పడాల్సిన దుస్థితి దాపురిస్తోంది. అసలే మండువేసవి... దానికి తోడు విద్యుత్‌సరఫరా నిలిచిపోవడంవల్ల ఎదురవుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. సాక్షి, విజయనగరం : జిల్లాలో 6లక్షల 30వేల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరికి సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 358 మంది క్షేత్ర స్థాయిలోనూ, 280 మంది కార్యాలయాల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యుత్ కేటాయింపుల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతిజిల్లాకు నిర్ధిష్ట కోటాను నిర్ణయిస్తారు. అలా జిల్లాకు రోజుకు 6.35 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోటా ఉంది. అవసరాన్ని బట్టి కోటాను మించి కూడా ఇస్తుంటారు. అలా జిల్లాలో రోజుకు 7.40 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. అంటే కోటా కంటే 1.04 మిలియన్ యూనిట్లు అధికంగా జిల్లాకు వస్తోంది. రెండు రోజుల క్రితం అంటే ఆదివారం రాత్రి జిల్లాలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదు. ఆ రోజు రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకూ కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అందకుమించి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అది కూడా గంటో రెండు గంటలో కాదు. ఏకంగా నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ. రాత్రంతా జిల్లా ప్రజలు ఉక్కపోతతో అవస్థలు పడుతూ నిద్రలేకుండానే గడిపారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 7.30 గంటలకు పోయిన కరెంట్ తెల్లవారుజాము 3గంటల వరకూ రాలేదు. ఆ రోజే కాదు ఏ రోజు ఏ చిన్న గాలివాన వచ్చినా ఇదే పరిస్థితి. ఇంత ఘోరంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారంటే చాలా పెద్ద సమస్యే వచ్చి ఉంటుందనుకుంటాం. కానీ దీనికి అధికారులు చెప్పిన కారణం చూస్తే ఔరా అనిపించకమానదు. అదేమిటంటే విజయనగరం పట్టణంలోని ధర్మపురి వద్ద 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పిన్ ఇన్సులేటర్ కాలిపోయిందట. విద్యుత్ సబ్స్టేషన్లలో గుండ్రని ఆకారంలో పింగాణీతో చేసినవి కొన్ని ట్రాన్స్ఫార్మర్లపైన, విద్యుత్ తీగల మధ్య కనిపిస్తూ ఉంటాయి. వాటినే పిన్ ఇన్సులేటర్లుగా పిలుస్తుంటారు. జిల్లాలో మరో రెండు చోట్ల కూడా ఇదే సమస్య ఏర్పడింది. సాధారణంగా ఇలాంటి సమస్య వస్తే కాలిపోయిన పిన్ ఇన్సులేటర్‌ను మార్చడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. అయితే ఈ పని చేయడానికి విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుంది. దీనికి ఇంచుమించు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. అంతకు మించి సమయం పట్టనవసరం లేదు. కానీ జిల్లాలో ఇదే సమస్యకు ఏడెనిమిది గంటలు పట్టడం విచిత్రం. దీనికి అధికారులు చెబుతున్న కారణమేమిటంటే అసలు ఎక్కడ పిన్ ఇన్సులేటర్‌కాలిపోయిందో, మరేదైనా సమస్య వచ్చిందో తెలియడం లేదట. సమస్య ఎక్కడో తెలుసుకోవడానికే సమయం పడుతోందట. అత్యధిక సాంకేతిక ప్రమాణాలు కలిగిన సంస్థగా దేశ స్థాయిలోనే గుర్తింపుతో పాటు అవార్డులు తీసుకున్న ఏపీఈపీడీసీఎల్‌లో ఉద్యోగుల అ« ద్వాన పనితీరుకు ఇదొక్కటే నిదర్శనం. చిన్న చిన్న సమస్యలకే ఇన్నేసి గంటలు విద్యుత్ కోత విధిస్తే నిజంగా పెద్ద సమస్య ఏదైనా వస్తే పరిస్థితిని ఊహించడానికే భయంగా ఉంది. ఇంత జరుగుతున్నా ఏపీఈపీడీసీఎల్ సీఎండీగానీ, జిల్లా కలెక్టర్‌గానీ దీని గురించి పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ విద్యుత్ శాఖ అధికారులతో వీరిద్దరూ ఒక్క సమీక్ష కూడా చేయకపోవడంతో కింది స్థాయి సిబ్బంది నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
ఈ గడ్డ కరెంటు ఈ గడ్డకే
కొత్తపేట: సీమాంధ్రలో ఉత్పత్తి అయిన విద్యుత్ అంతా ఈ ప్రాంతానికే దక్కాలని ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఈపీడీసీఎల్ యూనిట్ చైర్మన్ వీఎస్ఆర్కే గణపతి అన్నారు. ఆదివారం రాత్రి కొత్తపేటలో ట్రాన్స్‌కో రిటైర్డ్ ఎల్ఐ, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మిద్దే సత్యనారాయణమూర్తి ఇంట ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014లో విద్యుత్ రంగానికి సంబంధించి కీలక అంశం చోటుచేసుకుందన్నారు. విద్యుదుత్పత్తి కేంద్రాలను భౌగోళికంగా విభజించినా వాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రెండు రాష్ట్రాల పంపిణీ సంస్థలకు ఇప్పటి మాదిరిగానే వర్తిస్తాయని ప్రభుత్వం గత నెల 8న జీఓ-20 జారీ చేయడం శోచనీయమన్నారు. ఈ విధానాన్ని తమ యూనియన్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. సీమాంధ్రలో విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 60.5 శాతం కాగా.. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం 46.11 శాతం మాత్రమే కేటాయించడం, తెలంగాణ లో ఉత్పాదక సామర్థ్యం 39.5 శాతం కాగా ఆ రాష్ట్రానికి 53.89 శాతం కేటాయించడం దుర్మార్గమన్నారు. సీమాంధ్ర ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తక్షణమే స్పందించి ఈ జీవోను రద్దు చేయించి, సీమాంధ్రలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఈ ప్రాంతానికే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. సీమాంధ్రులకు జరగబోతున్న అన్యాయాన్ని వినియోగదారుల సంఘాలు, పారిశ్రామిక, రైతు సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో దీనిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ అవసరాలు తీరాకే మిగిలిన విద్యుత్‌ను మాత్రమే తెలంగాణ కు ఇవ్వాలన్నారు.