అధికారులను నిలదీస్తున్న కళ్లేపల్లి గ్రామస్తులు
విజయనగరం , లక్కవరపుకోట : మండలంలోని లక్కవరపుకోట, కళ్లేపల్లి గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ డుమ్మకొట్టారు. ఆయన రాకకోసం మండల స్థాయి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. తీరా కలెక్టర్ రాకపోవడంతో అధికారులకు ప్రయాసే మిగిలింది. ముందుగా మండలంలోని కళ్లేపల్లి గ్రామంలో సర్పంచ్ గోకాడ ముసలనాయుడు అధ్యక్షతన జిల్లా స్థాయి అధికారులు గ్రామ సభ నిర్వహించారు. విద్య, ఆరోగ్యం, అంగన్‌వాడీ, వ్యవసాయం, పౌరసరఫరాల వ్యవస్థ తదితర 18 శాఖలకు సంబంధించిన అంశాలపై గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు అందలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌టీఆర్ జలసిరిలో తీసుకున్న బోర్లకు నేటికీ సోలార్ పవర్‌ను అందించలేదని పలువురు అధికారులను నిలదీశారు.
వీటిపై అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు కేవలం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకే అందుతున్నాయని కోన ఈశ్వరరావు, తూర్పాటి అప్పలరాజు తదితరులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ టి.వెంకటేశ్వరరావు, మండల ప్రత్యేకధికారిణి గాయత్రీదేవి, జిల్లా పంచాయతీ అధికారి బి.సత్యనారయణ, డీఆర్‌డీఈ పీడీ సునీల్‌రాజుకుమార్, వ్యవసాయశాఖ జేడీ లీలావతి తదితర జిల్లా స్థాయి అధికారులు, ఎమ్పీడీఓ జి.వి.రమణమ్మ, తహసీల్దార్ జె.రాములమ్మ తదితర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఒక్కరే మిగిలారు
గ్రామ సభ అనంతరం మండల కేంద్రంలో గల ఎస్సీ హాస్టల్లో బస చేయాల్సి ఉంది. కాగా రాత్రి 9గంటలకు అక్కడికి డీఆర్‌డీఎ పీడీ సునీల్‌రాజ్‌కుమార్, మండల ప్రత్యేకాధికారిణి గాయిత్రీదేవి, తహసీల్దార్ రాములమ్మ, ఎమ్పీడీఓ జి.వి.రమణమ్మ చేరుకొని హాస్టల్ విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. రాత్రి నిద్రకు మాత్రం సునీల్‌రాజ్‌కుమార్ మాత్రమే మిగిలారు.
Comments
Please login to add a commentAdd a comment