ఖజానాలో మామూళ్ల పండగ!
‘గంగవరం మండలంలో వైద్యశాఖ పరిధిలో 800కు పైగా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. జూలైకి సంబంధించి వీరికి 43 శాతం పీఆర్సీ పెరగడంతో కొత్త వేతనాలు వస్తాయి. ఇందుకోసం సర్వీసు రిజిస్టరు, ఇతర ఫారాలను ఉప ఖజానా శాఖకు అందజేయాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగి ఫైలుకు రూ.300 ఇస్తేనే కొత్త పీఆర్సీ వేతన బిల్లులు మంజూరు చేస్తామని ఖజానా శాఖకు సంబంధించిన అధికారులు వసూళ్లకు తెరలేపారు.’
- రూ.కోట్లు కురిపిస్తున్న కొత్త పీఆర్సీ
- ఫైలుకు రూ.300 నుంచి రూ.500 చెల్లించాల్సిందే
- వసూల్ రాజాలుగా ఉద్యోగ సంఘ నాయకులు
‘చిత్తూరు నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో 350 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఫిట్‌మెంట్‌తో ఇక్కడి ఉద్యోగుల జీతంలో కనిష్టంగా రూ.4 వేల నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు ఒకేసారి పెరుగుతుంది. ఒక్కో ఉద్యోగి ఫైలుకు రూ.500 ఇస్తేనే జిల్లా ఖజానాశాఖలో బిల్లులు పాస్ చేస్తారని ఓ అధికారి కుండబద్దలు కొట్టారు.’
అందుకుంటారు. ఉద్యోగుల ఆశల్ని బలహీనతగా భావిస్తున్న కొందరు ఉద్యోగ సంఘ నాయకులు ఇప్పటికే పెద్ద మొత్తంలో నగదు వసూలు చేయగా.. మరికొన్ని చోట్ల ఖజానాశాఖ అధికారులే బహిరంగంగా వసూళ్లకు దిగారు. జిల్లాలో దాదాపు 38వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుంటే వీరిలో రోడ్లపై చెత్తను తీసే కార్మికుడి నుంచి ఉపాధ్యాయులు, వైద్యశాఖ ఉద్యోగులు, రెవెన్యూ, పోలీసు శాఖ లాంటి ప్రధాన శాఖలకు చెందిన సిబ్బంది ఉన్నతాధికారులు ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి సగటున రూ.700 చొప్పున రూ.2.66 కోట్లు లంచాల రూపంలో వసూలు చేస్తున్నారు. ఇందులో కొందరు ఉన్నతాధికారులు తమ వాటాను తగ్గించకుండా ఇవ్వాలని ఆదేశిస్తున్నారే తప్ప లంచాలు వద్దని చెప్పకపోవడం గమనార్హం.
ఇలా వసూళ్లు
కొత్త పీఆర్సీ ప్రకారం 2013 జూలై నుంచి 2015 ఏప్రిల్ వరకు పెరిగిన వేతనాలను పీఎఫ్, సీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ఏడాది మే నుంచి జూలై వరకు ఉన్న పీఆర్సీ బకాయిలను ఆయా ఉప ఖజానాశాఖ అధికారులు ఆమోదించిన తరువాత ఉద్యోగులకు అందుతుంది. అయితే కొందరు ఏటీవోలు, ఎస్టీవోలు ఉద్యోగ సంఘ నాయకుల వద్ద బేరసారాలు చేసుకుని ఇక్కడ తమకు జిరాక్స్ కాపీలు, ఇతర స్టేషనరీ అవసరమవుతుందని, అందు కోసం ఒక్కో ఫైలుకు నగదు ఇవ్వాల్సిందేనని దుకాణాలు పెట్టారు.
ఈ మామూళ్లు రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటోంది. ఇదే అదునుగా కొన్ని చోట్ల ఉద్యోగ సంఘ నాయకులు ఒక్కో ఫైలుకు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు కూడా వసూలు చేస్తున్నారు. ఇక ఉమ్మడి బిల్లులు కాకుండా ఎవరైనా వ్యక్తిగతంగా బిల్లుల్ని నేరుగా తీసుకెళితే ఆడిట్ అభ్యంతరాల పేరిట ఫైళ్లను పక్కన పడేస్తున్నారు. మరికొన్ని చోట్ల రోజులు తరబడి ఫైళ్లను ఖజానాశాఖ అధికారులే ఉంచేసుకుంటున్నారు.