‘సన్యాసులు’ అవుతున్న టెకీలు | Dopamine Fasting New Trend In Health Fitness | Sakshi
Sakshi News home page

‘సన్యాసులు’ అవుతున్న టెకీలు

Published Sat, Nov 23 2019 9:05 AM | Last Updated on Sat, Nov 23 2019 9:05 AM

Dopamine Fasting New Trend In Health Fitness - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో నగరం పేరు వినగానే ‘సిలికాన్‌ వ్యాలీ’ గుర్తుకు వస్తోంది. అది టెకీలుండే ప్రాంతం. టెకీలంటే రోజంతా కష్టపడి రాత్రంతా, తాగి తందనాలు ఆడుతారని, ముఖ్యంగా వారాంతంలో గర్ల్‌ ఫ్రెండ్స్‌తో బార్లకు, పబ్‌లకు వెళ్లి కులుకుతారని మిగతా సమాజం కుళ్లు పడేది. అందుకు విరుద్ధంగా సిలికాన్‌ వాలీ టెకీ (ఐటీ నిపుణులు)ల్లో ఓ సరికొత్త ట్రెండ్‌ మొదలయింది. అదే ‘డొపోమైన్‌ ఫాస్టింగ్‌’. ‘డొపోమైన్‌’ అనేది మెదడులో ఆనందానుభూతికి కల్గించే హార్మోన్‌. దీన్ని ‘ఆనంద రసాయనం’ అని కూడా వ్యవహరిస్తున్నారు. ఈ హార్మోన్‌ ఆనందం అనుభూతిని కలిగించడమే కాకుండా ఆ ఆనందానికి బానిసను కూడా చేస్తుంది. మద్యం, ఇతర మత్తులకు అలాగే బానిసలవుతారు. వ్యాయామం చేయడం వల్ల, ముఖ్యంగా వెయిట్‌ లిఫ్టింగ్, జాగింగ్, స్విమ్మింగ్‌ల వల్ల, ఇష్టమైన ఆహారం తినడం వల్ల నరాల ప్రేరణ ద్వారా ఏ హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్‌ కారణంగానే మొబైల్‌ ఫోన్లకు, వాట్సాప్, ట్విట్టర్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సోషల్‌ మీడియాకు బానిసలవుతున్నామని కూడా టెకీలు భావించారు. గ్రహించారు. మెదడు నరాల్లో ‘డొపోమైన్‌’ అనే హార్మోన్‌ను ఉత్పత్తి కాకుండా అడ్డుకోవడం ద్వారా ఇలాంటి వ్యసనాలకు కొంతకాలం విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 

అందుకోసం ‘డొపోమైన్‌ ఫాస్టింగ్‌’ను మొదలు పెట్టారు. జిమ్ములు, క్లబ్బులు, పబ్బులు, ఫుడ్‌కోర్టులకు వెళ్లడం మానేశారు. గర్ల్‌ ఫ్రెండ్స్‌తో ముద్దూ ముచ్చట్లకు గుడ్‌బై చెప్పారు. మొబైల్‌ ఫోన్లను, సోషల్‌ మీడియాను ముట్టుకోవడం లేదు. మ్యూజిక్‌తోపాటు మిత్రులకు దూరంగా ఉంటున్నారు. ఆఫీసులకు పోవడానికి సైకిళ్లను, అత్యవసర ఫోన్ల కోసం మాత్రమే మొబైల ఫోన్లను వాడుతున్నారు. మాంసాహారం, శాకాహారాలను కూడా పక్కన పెట్టి పండ్లతోని పచ్చి మంచి నీళ్లతోని పత్తెం ఉంటున్నారు. కొందరైతే విద్యుత్‌ లైట్లను కూడా ఉపయోగించకుండా చీకట్లో, వెన్నెల్లో గడుపుతున్నారు. కొకైన్‌ అనే మాదక ద్రవ్యం తీసుకోవడం వల్ల మెదడు మొద్దు బారినట్లయ్యి, సహనం పెరుగుతుందని, అలాగే డొపోమైన్‌ హార్మోన్‌ ఉత్పత్తి ఆగిపోయినట్లయితే సహనం పెరగడంతోపాటు చేసే పనిమీద దష్టి కేంద్రీకతం అవడమే కాకుండా, అదేంటో స్పష్టంగా అవగతమవుతుందని ప్రస్తుతం ఈ ఫాస్టింగ్‌లో ఉన్న సిలికాన్‌ వాలీ టెకీ, 24 ఏళ్ల జేమ్స్‌ సింకా తెలిపారు. ఉపవాసం వదిలేశాక మళ్లీ డొపొమైన ఉత్పత్తి పెరుగుతుందని ఆయన చెప్పారు. అప్పుడు మళ్లీ యథావిధి జీవితాన్ని కొనసాగించవచ్చని చెప్పారు. 

ఈ ఫాస్టింగ్‌ వల్ల ఓ అధ్యాత్మిక స్థితి మనస్సుకు ఆవరిస్తుందని, అందువల్ల మనస్సు పరిపరి విధాల పోకుండా, చేసే వత్తిపై కేంద్రీకతం అవుతుందని, తద్వారా కంపెనీల్లో ఉత్పత్తి పెరిగి ప్రశంసల వర్షం కురుస్తుందని, మరోపక్క మానసిక ప్రశాంతత లభించి మనిషి ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందని భావించడం వల్ల ఎక్కువ మంది టెకీలు ఈ ఫాస్టింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా సిలికాన్‌ వాలీలో మొదలైన ఈ ఫాస్టింగ్‌ ట్రెండ్, భారత సిలికాన్‌ వ్యాలీగా వ్యవహరించే బెంగుళూరుకు పాకి, ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌కు తాకింది. ఈ ‘డొపోమైన్‌ ఫాస్టింగ్‌’కు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని సిలికాన్‌ వ్యాలీ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ కమెరాన్‌ సిపా కొట్టివేశారు.

పోషక పదార్థాలు కలిగిన ఆహారం, వ్యాయామం వల్ల డొపోమైన్‌ హార్మోన్‌ పెరుగుతుందనడంలో సందేహం లేదని, ఈ రెండింటికి దూరంగా ఉండడం వల్ల, సామాజిక మీడియాకు, సామాజిక సంబంధాలకు దూరంగా ఉండడం వల్ల తగ్గుతుందనడం తప్పని ఆయన చెప్పారు. కాలిఫోర్నియా యూనివర్శిటీలోని న్యూరాలోజీ, సైకాలోజీ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ జోష్‌ బెర్క్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొద్దికాలం అన్నింటికి దూరంగా ఉండి, మళ్లీ వాటిని ఆస్వాదించినప్పుడు ఎక్కువ ఆనందానుభూతి కలిగే అవకాశం మానసికంగా ఉందని వారు చెప్పారు. ఏదీ శతి మించి రాగాన పడనీయ రాదని, అలవాట్లు అదుపులో ఉంటే అంతకన్నా మంచి మరోటి ఉండదని, ఇలాంటి ఫాస్టింగ్‌ల వల్ల ఆరోగ్యం నశించే అవకాశమే ఎక్కువగా ఉందని వారు హెచ్చరించారు. శ్రమ, శ్రమకు తగ్గ విశ్రాంతి, ఆ తర్వాత మిగిలే సమయాన్ని సామాజిక సంబంధాలకు, ఇతర అభిరుచులకు కేటియిస్తే మానసికంగా ప్రశాంత జీవితాన్ని గడపవచ్చని వారు సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement