హూప్ డాన్సర్ ఈష్నా కుట్టి
ఆ సన్నటి పెద్ద రింగును ‘హూప్’ అంటారు. పిల్లలు సరదాగా నడుము చుట్టూ దానిని తిప్పుతారు. సర్కస్‌లో హూప్‌తో చేసే ఫీట్లు ఉండేవి. కాని ఇప్పుడు హూప్ డాన్స్ ఫిట్‌నెస్‌కు ఒక దారిగా ఉంది. సరదాగా ఉంటూనే శరీరాన్ని విపరీతంగా కదిలించే ఈ డాన్స్‌లో దేశంలోనే నంబర్1గా ఉంది ఈష్నా కుట్టి. ఆమె పరిచయం.
‘మూవ్‌మెంట్ థెరపీ గురించి ఇప్పుడు ఎక్కువమంది మాట్లాడుతున్నారు సైకాలజీలో. అంటే శరీర కదలికల వల్ల స్వస్థత పొందడం. హూపింగ్‌తో మూవ్‌మెంట్ థెరపీ చేయవచ్చు. హూపింగ్ వల్ల కండరాలు శక్తిమంతమవుతాయి. గుండె బాగవుతుంది. యాంగ్జయిటీ, స్ట్రెస్ మాయమవుతాయి. హూపింగ్‌లో ఆట ఉంది. వ్యాయామం ఉంది. నృత్యం ఉంది. మూడూ కలగలసిన హూపింగ్ స్త్రీల ఫిట్‌నెస్‌కు బాగా ఉపయోగం’ అంటుంది ఈష్న కుట్టి.
ఢిల్లీలో స్థిరపడ్డ మలయాళ కుటుంబంలో జన్మించిన 25 ఏళ్ల ఈష్న కుట్టి ఇప్పుడు భారతదేశంలో నెంబర్ 1 హూపర్‌గా గుర్తింపు పొందింది. హూప్ లేదా హులా హూప్ అని పిలిచే ‘టాయ్ రింగ్’తో విన్యాసాలు చేసేవారిని హూపర్స్ అంటారు. (20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!)
మన దేశంలో ఎప్పటినుంచో హూపింగ్ ఉన్నా 1950లలో ఆట వస్తువుగా దీని తయారీ మొదలయ్యాక వ్యాప్తిలోకి వచ్చింది. నడుమును తిప్పుతూ హూప్‌ను నడుము చుట్టూ తిప్పడంతో మొదలెట్టి మెరుపు వేగంతో హూప్‌ను కదిలిస్తూ ఎన్నో విన్యాసాలు చేయొచ్చు. ఇలా చేయడాన్ని ‘ఫ్లో ఆర్ట్’లో భాగంగా చూస్తారు. బంతులు ఎగరేయడం, జగ్లింగ్ చేయడం.. ఇవన్నీ ఫ్లో ఆర్ట్ కిందకే వస్తాయి. హూపింగ్ కూడా.
చిన్న వయసులోనే...
‘చిన్నప్పుడు మా బంధువు ఒకామె హూప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. కాసేపు ఆడుకోవడానికి ట్రై చేసి మానుకున్నాను. కాని ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు ప్రాక్టీసు చేశాను. మెల్లగా వచ్చేసింది. దాంతో ఎవరూ లేనప్పుడుప్రాక్టీసు కొనసాగించాను. మెల్లమెల్లగా హూప్ నా శరీరంలో భాగమైపోయింది’ అంటుంది ఈష్న. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సైకాలజీ చదివిన ఈష్న ‘టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’లో ‘డిప్లమా ఇన్ డాన్స్ మూవ్‌మెంట్ థెరపీ’ కూడా చేసింది.
‘సైకాలజీ, హూపింగ్ తెలియడం వల్ల మనిషికి ఉత్సాహం, ఆరోగ్యం కలిగించడానికి ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాను’ అంటుంది ఈష్న.
తిహార్ జైలులో...
తిహార్ మహిళా జైలులో ఖైదీలకు ఆరు నెలల పాటు హూపింగ్ నేర్పించడానికి వెళ్లింది ఈష్న. ‘జైలుకు వెళ్లి ఖైదీలను కలవడం ఎవరికైనా కష్టమే. కాని అక్కడ ముప్పై నుంచి 60 ఏళ్ల వరకూ ఉన్న మహిళా ఖైదీలకు హూపింగ్ నేర్పించాను. వారు హూప్ రింగ్‌తో రేయింబవళ్లు ప్రాక్టీసు చేసేవారు. నేను వెళ్లినప్పుడల్లా ఆ ముందుసారి కన్నా మరింత ఉత్సాహంగా, హుషారుగా కనిపించారు’ అంది ఈష్న.
ఇలా చేయాలి
‘సౌకర్యవంతమైన బట్టలు, సరైన ఫ్లోర్ ఉంటే హూప్‌తో మీరు ఎన్ని విన్యాసాలైనా సాధన చేయొచ్చు. మార్కెట్‌లో హూప్ రింగ్‌లు 28 ఇంచ్‌ల నుంచి 39 ఇంచ్‌ల వరకూ దొరుకుతాయి. వాటితోప్రాక్టీసు చేయడమే. ఈ ఆటలో పోటీలేదు పోలిక లేదు. అందుకే మన ఇష్టం వచ్చినట్టు ఆడవచ్చు. ఒకరకంగా బయటకు రాని స్త్రీలకు బెస్ట్ ఆటవిడుపు’ అంటుంది ఈష్న.
మన దేశంలో హూపింగ్ నేర్పించే టీచర్లు తక్కువ కనుక ఆమె తరచూ నగరాలు తిరుగుతూ స్త్రీలకు క్యాంప్స్ నిర్వహిస్తూ నేర్పిస్తూ ఉంటుంది. ‘హూప్ రింగ్ మీ బెస్ట్ ఫ్రెండ్ కాగలదు. మీ మంచి చెడుల్లో అది పక్కనే ఉంటే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి’ అంటున్న ఈష్నకు ఇటీవల కార్పొరేట్ ఈవెంట్స్‌లో షో చేయమని ఆహ్వానాలు అందుతున్నాయి. డబ్బు కూడా బాగా వస్తోంది. షోలలో ఆమె చేసే హూపింగ్ నోరెళ్లబెట్టేలా ఉంటుంది. ఒక్క రింగు ఆమె జీవితాన్నే మార్చేసింది. మీ జీవితాన్ని కూడా మార్చొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment