I Was Not An Overnight Success, YouTube Creator For Change Sejal Kumar Success Story Inside - Sakshi
Sakshi News home page

YouTuber Sejal Kumar Success Story: టాప్‌ యూట్యూబ్‌ ‍స్టార్‌ సెజల్‌.. సక్సెస్‌ మంత్ర అదేనట

Published Fri, Jul 14 2023 12:26 AM | Last Updated on Fri, Jul 14 2023 4:42 PM

I Was Not An Overnight Success says YouTube Creator For Change Sejal Kumar - Sakshi

ఆరోగ్యం నుంచి బాలీవుడ్‌ వరకు రకరకాల వీడియోలు చేస్తూ డిజిటల్‌ క్రియేటర్‌గా దూసుకుపోతుంది దిల్లీకి చెందిన సెజల్‌ కుమార్‌. ‘ఫ్యాషన్‌–పాట–డ్యాన్స్‌’ ఆమె బలం. మన దేశంలోని టాప్‌ యూట్యూబ్‌ స్టార్‌లలో సెజల్‌ ఒకరు. దిల్లీలోని ‘ది మదర్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’లో చదువుకున్న సెజల్‌ కుమార్‌కు చిన్నప్పటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. తండ్రి ఆర్మీ మేజర్‌. దిల్లీలోని శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది. టర్కీకి వెళ్లినప్పుడు ‘సమ్మర్‌ స్టైల్‌’ పేరుతో తొలి వీడియో అప్‌లోడ్‌ చేసింది. ఆ తరువాత సొంతంగా యూట్యూబ్‌ చానల్‌ మొదలుపెట్టింది.చానల్‌ కోసం చేసిన అయిదు వందలకు పైగా వీడియోలు బాగా పాపులర్‌ అయ్యాయి.

‘ఇండియన్‌ గర్ల్‌ బ్యాక్‌ప్యాకింగ్‌ ఇన్‌ యూరప్‌’ సిరీస్‌కు మంచి స్పందన లభించింది. సెజల్‌ తల్లి  గైనకాలజిస్ట్‌. ‘ఒక గైనకాలజిస్ట్‌ను అమ్మాయిలు అడగాలనుకునే సందేహాలపై వీడియోలు చేయవచ్చు కదా’ అని చానల్‌ ప్రేక్షకులలో ఒకరు అడిగారు. ఆమె కోరిక మేరకు సెజల్‌ తల్లితో కలిసి చేసిన ‘మామ్‌ అండ్‌ మీ’ సిరీస్‌ బాగా పాపులర్‌ అయింది. ఎలాంటి ప్రశ్న అయినా స్వేచ్ఛగా, నిస్సంకోచంగా అడిగే వాతావరణాన్ని ‘మామ్‌ అండ్‌ మీ’  కల్పించింది.

సెజల్‌కు బాగా నచ్చే సబ్జెక్ట్‌లలో ఫ్యాషన్‌ ఒకటి. స్ట్రీట్‌ స్టైల్, స్ట్రీట్‌ వీడియోలపై మంచి పట్టు ఉంది. తన చానల్‌ 1 మిలియన్‌ ఫాలోవర్‌ మార్క్‌ను చేరుకున్నప్పుడు ‘ఓ మై గాడ్‌’ అనుకుంది ఆనందంగా. ‘ఇదంతా నేను సొంతంగా సాధించాను’ అనే ఆనందం సెజల్‌కు మరింత శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చింది. తన గొంతులోని ఛార్మింగ్‌ క్వాలిటీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. యూట్యూబర్‌గా సెజల్‌ విజయరహస్యం ఏమిటి? ఆమె మాటల్లో...‘మొదటి సూత్రం...గుడ్‌క్వాలిటీ కంటెంట్‌. గత వీడియో కంటే తాజా వీడియో ఎంతో కొంత బాగుండాలి. రెండో సూత్రం...ఎప్పుడో ఒకప్పుడు కాకుండా నిరంతరం ఏదో ఒక వీడియో పోస్ట్‌ చేస్తుండాలి.

మూడో సూత్రం...ప్రేక్షకులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలి. మనల్ని మనం అప్‌డేట్‌ చేసుకోవాలి. వారికి ఎలాంటి వీడియోలు కావాలో తెలుసుకోవాలి’  సెజల్‌ యూట్యూబ్‌ చానల్‌ ప్రేక్షకులలో మహిళలు ఎక్కువ. పద్దెనిమిది నుంచి ఇరవైనాలుగు ఏళ్ల వయసు మధ్య ఉన్న వారు ఉంటారు. ‘ఒక కాలేజీ స్టూడెంట్‌ నా దగ్గరకు వచ్చి మీ పేరుతో కనిపించే వీడియో కనిపిస్తే చాలు క్షణం ఆలస్యం చేయకుండా చూస్తాను అని చెప్పింది. ఆమె మాటలు విన్న తరువాత మరింత కష్టపడాలి అనిపించింది’ అంటుంది సెజల్‌.  ‘కాళీ కాళీ’ మ్యూజిక్‌ ట్రాక్‌ సింగర్‌గా ఆమె ప్రతిభకు అద్దం పట్టింది. ఎన్నో వ్యాపారప్రకటనల లో నటించిన సెజల్‌...‘కలలను నిజం చేసుకునే విషయంలో అధైర్యం వద్దు. మనపై మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి’ అంటుంది. జైపూర్‌లోని మణిపాల్‌ యూనివర్శిటీలో ‘హౌ టు మేక్‌ యూట్యూబ్‌ ఏ కెరీర్‌?’  అనే అంశంపై సెజల్‌ చేసిన ప్రసంగం ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తి ఇచ్చి ముందుకు నడిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement