సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీలో సమ్మె గంటలు మోగాయి. వేతన సవరణకు ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో సమ్మె చేపట్టనున్నట్టు గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రకటించింది. ఈనెల 11న తెల్లవారుజామున తొలి బస్సును నిలిపేయటం ద్వారా సమ్మె ప్రారంభిస్తామని వెల్లడించింది. దీనికి సన్నాహకంగా ఈ నెల 7 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని సంఘం ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి వెల్లడించారు. 7వ తేదీన అన్ని డిపోల ఎదుట ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన చేపడతామని, 8వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తామని చెప్పారు. వేతన సవరణ గడువు ముగిసి 14 నెలలు దాటినందున వెంటనే 50 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ జరపాలని డిమాండ్ చేశారు.
సీఎం ఆగ్రహంతో ఆగిన ప్రక్రియ..
గత వేతన సవరణ సమయంలో కార్మికులు డిమాండ్ చేసిన దానికంటే చాలా ఎక్కువగా 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆర్టీసీపై దాదాపు రూ.750 కోట్ల వార్షిక భారం పడింది. తొలి సంవత్సరం ఆ మేర బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత ఆర్టీసీకే వదిలేసింది. దీంతో ఆర్టీసీ మరింత నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు ఇదే అంశం సీఎం ఆగ్రహానికి కారణమైంది. కార్మికులు అడిగిన దానికంటే ఎక్కువ ఫిట్‌మెంట్ ప్రకటించినా.. ఆర్టీసీ తీవ్రనష్టాల్లో ఉన్న సమయంలో వేతనాలను భారీగా పెంచాలని చర్చలు జరపకముందే సమ్మె నోటీసు ఇవ్వడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెకు దిగితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మరోవైపు వేతన సవరణపై ఏర్పడ్డ మంత్రివర్గ ఉప సంఘం ఆర్టీసీ వేతన సవరణపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. దీంతో సోమవారం టీఎంయూ సెంట్రల్ కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమ్మెపై నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నందున సమ్మె అనివార్యమని స్పష్టం చేసింది.
కార్మిక సంఘాల ఐక్యతలో అయోమయం..
ఆర్టీసీలోని పలు కార్మిక సంఘాలతో కూడిన జేఏసీతో టీఎంయూ నేతలు సోమవారం భేటీ అయ్యారు. సమ్మెకు కలసి రావాలని ఆహ్వానించారు. అయితే టీఎంయూ సొంతంగా కాకుండా జేఏసీలో భాగంగా సమ్మెకు సిద్ధం కావాలని జేఏసీ నేతలు పేర్కొనగా, వారు సమ్మతించలేదు. స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తే మరోసారి చర్చించేందుకు సిద్ధమంటూ జేఏసీ నేతలు చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సమ్మె తేదీలను టీఎంయూ అధికారికంగా ప్రకటించింది. దీంతో మంగళవారం మిగతా జేఏసీ సంఘాలు అత్యవసరంగా సమావేశమై, చర్చించి కార్యాచరణ ప్రకటించనున్నట్లు జేఏసీ నేతలు రాజిరెడ్డి, హన్మంతు ప్రకటించారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ సొంతంగా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 6న సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణను ప్రకటించనున్నట్లు సంఘం నేత నాగేశ్వరరావు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment