దేవాలయ ఉద్యోగులకూ పీఆర్‌సీ
- ప్రభుత్వోద్యోగులతో సమంగా 43 శాతం ఫిట్‌మెంట్
- ఫైలుపై సీఎం సంతకం.. ఉత్తర్వు జారీ
- 5 వేల మంది సిబ్బందికి వర్తింపు
- ‘30 శాతం’ నిబంధనతో కొంత మందికే లబ్ధి
- ఆ నిబంధనను తోసిరాజని గతంలో వేతనాల పెంపు
- ఏకరూప వేతన విధానాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: దేవాదాయశాఖ పరిధిలోని దేవాలయ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వోద్యోగులతో సమంగా ప్రభుత్వం వారికి వేతన సవరణను (10వ పీఆర్‌సీ) అమలు చేయనుంది. 43 శాతం ఫిట్‌మెంట్ వర్తింపునకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గురువారం సంతకం చేయగా దానికి సంబంధించి దేవాదాయశాఖ రాత్రికి ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల మంది ఉద్యోగులకు ఇది వర్తించనుంది. రీజినల్ జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కేడర్ సహా ఇతర అన్ని ప్రధాన దేవాలయాలకు ఇది వర్తించనుంది.
అయితే దేవాదాయశాఖ ఉద్యోగులకు ప్రభుత్వోద్యోగుల తరహాలో ట్రెజరీ నుంచి వేతనాలు చెల్లించే వెసులుబాటు లేనందున ఆయా ఆలయాల్లోని ఆదాయంలో వేతనాల మొత్తం 30 శాతానికి మించకూడదే నిబంధన అమలులో ఉంది. ఇప్పుడు అంతకంటే తక్కువ వేతనాలు చెల్లిస్తున్న ఆలయాలకు మాత్రమే తాజా వేతన సవరణ అమలవుతుంది. ఇప్పటికే 30 శాతానికి మించి వేతన ఖర్చులు ఉన్న ఆలయాల్లో నిబంధనల ప్రకారం వేతన సవరణ అమలు కాదు. కానీ ఆర్‌జేసీ కేడర్‌లో ఉన్న యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ ఆలయాల్లో 30 శాతం నిబంధనను సడలిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు.
వేతన సవరణతో దాదాపు రూ.5 కోట్ల వరకు ఆ శాఖపై అదనపు భారం పడుతుందని సమాచారం. తమ డిమాండ్ మేరకు వేతన సవరణ చేసినందుకు దేవాలయ అర్చక, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రమేశ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు సీఎం కేసీఆర్, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలను కలసి కృతజ్ఞతలు తెలిపారు.
గత పీఆర్‌సీ తరహాలోనే..: ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా 43%
ఫిట్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో దాన్ని తమకూ వర్తింప చేయాలని ఆలయ అర్చకులు, ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ మేరకు ప్రతిపాదన ప్రభుత్వం ముందు పెండింగులో ఉంది. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ దానికి ఆమోదముద్ర వేశారు. 2010 పీఆర్‌సీని అప్పటి ప్రభుత్వోద్యోగులకు వర్తింపజేసినట్టుగానే దేవాలయ ఉద్యోగులకు కూడా వర్తింపజేశారు. ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించినట్టయింది.
అంతా గందరగోళం
ఏ ప్రభుత్వ విభాగంలో లేనంత అస్తవ్యస్థ పరిస్థితులతో కొనసాగుతున్న దేవాదాయశాఖలో వేతనాల విషయం కూడా అంతే గందరగోళంగా ఉంది. పీఆర్‌సీ తరుణంలో మరోసారి అది చర్చనీయాంశంగా మారింది. దేవాలయ సిబ్బందికి ఆ ఆలయ ఆదాయం నుంచే వేతనాలు చెల్లించాలి. ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకూ ఖర్చు చేయాల్సి ఉన్నం దున మొత్తం ఆదాయంలో ఎస్టాబ్లిష్‌మెంట్ ఖర్చులు 30 శాతానికి మించకూడదంటూ 1987లో ప్రభుత్వం సీలింగ్ విధిస్తూ చట్టం చేసింది. ధార్మిక కార్యక్రమాలకు 20%, ధార్మిక పరిషత్తు, అర్చక సంక్షేమ నిధి, ఆడిట్ ఫీజు తదితర డిపార్ట్‌మెంటల్ కంట్రిబ్యూషన్‌కు 20%, ఆలయ అభివృద్ధి పనులు, ఉత్సవ నిర్వహణకు 30% చొప్పున ఖరారు చేశారు.
ఈ లెక్కన రాష్ట్రంలోని చాలా ఆలయాల్లో ఎస్టాబ్లిష్‌మెంట్ మొత్తం ఇప్పటికే 30% దాటింది. నిబంధనల ప్రకారం ఆయా ఆలయాల్లో వేతనాల పెంపు సాధ్యం కాదు. కానీ 2010 వేతన సవరణ సమయంలో దాన్ని పట్టించుకోకుండా అమలు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్టాబ్లిష్‌మెంట్ వాటాను 40 శాతానికి పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది. అలాగే ఆలయాల నుంచి 30% చొప్పున వసూలు చేసి వేతన నిధిని ఏర్పాటు చేసి ఏకరూప వేతన విధానం అమలు చేయాలనే మరో అంశం అధ్యయనంలో ఉంది.