దద్దరిల్లిన ధర్నాలు
విజయవాడ సెంట్రల్ : బుడమేరు ప్రాంతంలో ఫ్లైఓవర్ ర్యాంప్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాంటూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆ ప్రాంత పేదలు బుధవారం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పార్టీ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, జె.శ్యాం మాట్లాడుతూ మధ్యకట్టలో బుడమేరు ఒడ్డున వందలాది కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. ర్యాంప్ నిర్మాణానికి అడ్డు వస్తాయని సుమారు 200 ఇళ్లను కూలగొట్టేందుకు అధికారులు నిర్ణయించడం దారుణమన్నారు. ర్యాంప్ నిర్మాణానికి బదులు పిల్లర్లతో వంతెన నిర్మాణం చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. ఈ మేరకు వినతి పత్రాన్ని కమిషనర్ జి.వీరపాండియన్‌కు అందించారు. వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల, కార్పొరేటర్లు అవుతు శ్రీశైలజ, సుభాషిణి, మల్లీశ్వరి, పాల ఝాన్సీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చార్జీలు తగ్గించాల్సిందే..
డ్రెయినేజీ, వాటర్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. కౌన్సిల్ ముందు ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ నుంచి భవానీపురం కరకట్ట వరకు ఉన్న ఆక్రమణల్ని తొలగించాలన్న ఆలోచనను విరమించుకోవాలని సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
సంతాపం, సన్మానం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, గోదావరి పుష్కరాల సందర్భంగా మృతిచెందిన 25 మంది భక్తులు, విద్యుత్ షాక్‌తో ఉర్మిళా నగర్‌లో మృతిచెందిన వారికి కౌన్సిల్ సంతాపం ప్రకటించింది. మేయర్ కోనేరు శ్రీధర్, వివిధ పార్టీల ఫ్లోర్‌లీడర్లు జి.హరిబాబు, బిఎన్.పుణ్యశీల, ఆదిలక్ష్మి, ఉత్తమ్‌చంద్ బండారీ సంతాపం తెలిపారు. గోదావరి పుష్కరాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన ఈఈ ఓంప్రకాష్‌ను మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్‌లు దుశ్శాలువాతో సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఉత్తమ సేవా పత్రాన్ని అందించారు.