
‘శివ' శివా..!
ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) : రాజమండ్రి నగర పాలక సంస్థ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ యార్లగడ్డ శివశంకరరావు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు.
ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) :
రాజమండ్రి నగర పాలక సంస్థ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ యార్లగడ్డ శివశంకరరావు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమ్మయ్య నాయుడు అనే మున్సిపల్ కాంట్రాక్టర్ గత మార్చి 30న జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల సందర్భంగా బారికేడ్ల ఎక్స్‌టెన్షన్ కాంట్రాక్టు పొందాడు. అందుకు సంబంధించిన రూ.4.64 లక్షల బిల్లు మంజూరు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఇతర అధికారులు సంతకాలు చేశారు. ఆ మొత్తాన్ని మంజూరు చేయాలంటే తనకు రూ.30 వేలు ఇవ్వాలని శివశంకరరావు డిమాండ్ చేశారు. రూ.20 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన తమ్మయ్యనాయుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏసీబీ అధికారులు పన్నిన పథకం ప్రకారం.. వారు రంగు పూసి ఇచ్చిన రూ.20 వేల నగదును తమ్మయ్యనాయుడు మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నగర పాలక సంస్థ కార్యాలయంలోని శివశంకరరావు చాంబర్‌కు వెళ్లి ఇచ్చాడు. ఆ సొమ్మును ప్యాంటు జేబులో పెట్టుకున్న శివశంకరరావు తన కార్యాలయం నుంచి బయటకు వచ్చి, తిరిగి లోపలికి వెళ్లి ఫైలు కింద పెట్టారు. వెంటనే ఏసీబీ అధికారులు లోపలికి వెళ్లి అతడి చేతులు పరిశీలించగా నోట్లకు పూసిన రంగు అంటుకుని ఉంది. దాంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తమ్మయ్యనాయుడికి మంజూరు చేయాల్సిన రూ.4.64 లక్షలకు సంబంధించి ఫైలును, శివశంకరరావు తీసుకున్న రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. శివశంకరరావును ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు.
లంచం ఇస్తేనే బిల్లు మంజూరు..
ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ శివశంకరరావు లంచం ఇస్తే తప్ప ఏ బిల్లూ మంజూరు చేయరని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపించారు. తనకు ఇవ్వాల్సిన బిల్లును మంజూరు చేయకుండా నాలుగు నెలలుగా తిప్పించుకుంటున్నారని, ఆయనకు లంచం ఇవ్వడం ఇష్టం లేకే ఏసీబీని ఆశ్రయించానని తమ్మయ్యనాయుడు చెప్పారు. తాను తనకు ఇవ్వాల్సిన రూ.60 వేల బిల్లును సంవత్సరకాలంగా మంజూరు చేయడం లేదని కాంట్రాక్టు పద్ధతిపై నగర పాలక సంస్థకు కార్లను సరఫరా చేసే కేపీఆర్ విఠల్ ఆరోపించారు. శివశంకర్ వల్ల తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని కోన కిషోర్‌కుమార్ గౌడ్ అనే మరో కాంట్రాక్టర్ చెప్పారు. నగరపాలక సంస్థ కాంట్రాక్టులు దక్కాలన్నా, బిల్లులు మంజూరు కావాలన్నా తన కుమార్తెను కారులో వివిధ ప్రాంతాల్లో జరిగే పరీక్షలకు తీసుకువెళ్లాలని రూట్ మ్యాప్‌తో సహా నిర్దేశించారని ఆరోపించారు. చేసేది లేక ఇండికా కారులో గుడివాడ, తెనాలి వంటి ప్రాంతాలకు ఆయన కుమార్తెను పరీక్షలకు తీసుకు వెళ్లినట్టు చెప్పారు. ప్రతి రూ.లక్ష బిల్లుకు రూ.250 చొప్పున ఇవ్వాల్సిందేనని శివశంకరరావు అందరు కాంట్రాక్టర్లనూ ఆదేశించారని ఆరోపించారు.