లంచం ఇస్తేనే మరుగుదొడ్డి బిల్లు?
మౌలిక వసతుల కోసం ఫిర్యాదులు
గ్రీవెన్స్‌సెల్‌లో దరఖాస్తులు స్వీకరించిన కమిషనర్
వరంగల్ అర్బన్ : స్వచ్ఛ భారత్ కింద వ్యక్తిగత మరుగుదొడ్డి బిల్లు రావాలంటే రూ. 2 వేల లంచం అడుగుతున్నారంటూ పైడిపల్లికి చెందిన పలువురు బాధితులు కమిషనర్ శృతిఓజాకు సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్ సెల్ కార్యక్రమం జరిగింది. కమిషనర్ శృతి ఓజా దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్, మహిళ సంఘాల లీడర్లు డబ్బుల కోసం ఒత్తిడి తెస్తున్నట్లు కమిషనర్‌కు వివరించడంతో అవాక్కయ్యారు. వెంటనే విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. కనీస వసతులైన సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, పైపులైన్లు కోసం ఫిర్యాదులు అందాయి. ఇంజినీరింగ్ విభాగం కోసం 25 ఫిర్యాదులు రాగా, టౌన్‌ప్లానింగ్‌కు 8, జనరల్ విభాగానికి 10, ప్రజారోగ్యంకు 3, పన్నుల విభాగానికి 3, అర్బన్ మలేరియాకు 1 చొప్పన ఫిర్యాదులు అందాయి. మడికొండ ఎంఎన్ నగర్‌లో మౌలిక వసతులు, 39వ డివిజన్‌లో శ్రీ సాయి రెసిడెన్సీ కాలనీలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఫిర్యాదు చేశారు. 52వ డివిజన్ మొయిన్ రోడ్డు బాపూజీ నగర్‌లో 30 వ డివిజన్‌లోని లోటస్ కాలనీలో డ్రైయినేజీలు దెబ్బతిని, మురుగు నీరు పారుతుందని, కొత్తగా నిర్మించాలని కోరారు. ఉర్సు డీకే నగర్‌లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించుకున్నా బిల్లులు రాలేదని ముగ్గురు లబ్ధిదారులు కమిషనర్ శృతి ఓజాను వేడుకున్నారు.
పింఛన్ ఇప్పించండి
నాకు రెండు కళ్లు కనబడవు. వందశాతం అంధుడిగా ఎంజీఎం వైద్యులు సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. గత ఏడాది 4వ నెలలో పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాను. విచారణ చేశారు. ఇంతవరకు పింఛన్ రాలేదు. ఎలాగైనా పింఛన్ డబ్బులు ఇప్పించండి. – గిరిబాబు, అంధుడు