అవినీతిని ‘కాల్‌’చేస్తున్నారు! | People Getting Awareness Against Corruption | Sakshi
Sakshi News home page

అవినీతిని ‘కాల్‌’చేస్తున్నారు!

Published Sat, Sep 21 2019 3:15 AM | Last Updated on Sat, Sep 21 2019 3:15 AM

People Getting Awareness Against Corruption - Sakshi

  • పెద్దపల్లిలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూ.2,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. 
  • కామారెడ్డికి చెందిన ఓ ఎక్సైజ్‌ సీఐ, ఎస్సై లంచం అడిగినందుకే క్రిమినల్‌ మిస్‌ కండక్ట్‌ కింద ఏసీబీ అధికారులు కేసులు బుక్‌ చేశారు. 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రజలు అవినీతిపై సమరశంఖం పూరిస్తున్నారు. లంచం డిమాండ్‌ చేస్తున్న ఒక్కో అధికారిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పట్టిస్తున్నారు. అవినీతిపై మీడియా ప్రచారం, ఇటు ఏసీబీ చర్యలు వెరసి ప్రజల్లో కదలిక వచ్చింది. ఫలితంగా బాధితులు ఒక్కొక్కరు ముందు కొస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయం మొదలుకుని మిగిలిన 33 జిల్లాల కార్యాలయాలకు ప్రతీరోజూ పలువురు బాధితులు ఫోన్లు చేస్తున్నారు. ప్రతీ కార్యాలయానికి రోజుకు ఐదు నుంచి 10 వరకు బాధితుల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ప్రజల్లో పెరిగిన చైతన్యంతో ఏసీబీ రెట్టింపు దూకుడుతో పనిచేస్తోంది. ఓ వైపు ప్రజలను వేధించే అవినీతి జలగలకు వల వేస్తూనే.. మరోవైపు అక్రమంగా దోచే సిన సొమ్ముతో ఆస్తులు కూడబెడుతున్న వారిపై దాడులు చేస్తోంది. 

వరంగల్‌ జోన్‌ నుంచే ఎక్కువగా.. 
ఏసీబీని ఉమ్మడి జిల్లాల ప్రకారంగా మూడు జోన్లుగా విభజించారు. వాటిలో వరంగల్‌ (కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్‌), హైదరాబాద్‌ (హైదరాబాద్, రంగారెడ్డి), రూరల్‌ హైదరాబాద్‌ (నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్‌) జోన్లుగా ఉన్నాయి. వీటికి డీఎస్పీ ర్యాంకు అధికారి చీఫ్‌గా వ్యవహరిస్తారు. కొత్త జిల్లాల అనంతరం కూడా వాటి బాధ్యతలను కూడా వారే చూసుకుంటున్నారు. ఈ మూడు జోన్లలో వరంగల్‌ నుంచి అంటే ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వాటిలో గ్రామీణ ప్రాం తాల్లో రెవెన్యూ, గ్రామ పంచాయతీ విభాగాలపై ఫిర్యాదులు అధికంగా ఉంటున్నాయి. ఇక హైదరాబాద్‌ జోన్‌లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు క్లియర్‌ చేసేందుకు అధికారులు లంచం అడుగుతున్నారు. ఇందులో పోలీసు, ఎక్సైజ్, జీఎస్టీ, రెవెన్యూ మొదలుకుని దాదాపుగా అన్ని విభాగాలున్నాయి. ఈ మూడు జోన్లలో తక్కువ ఫిర్యాదులతో హైదరాబాద్‌ రూరల్‌ నిలిచింది. ఏసీబీ కార్యాలయాలకు వస్తున్న ఫోన్‌ కాల్స్‌లో 50 శాతం మాత్రమే కేసుల వరకు వెళ్తున్నాయి. ఫిర్యాదు చేసిన తరువాత చాలామంది తర్వాత పరిణామాలకు భయపడి వెనకడుగు వేయడమే దీనికి కారణం. దీంతో అధికారులు రూట్‌ మార్చారు. 

ఆడియో, వీడియోలతో చెక్‌.. 
ప్రజల్లో పెరిగిన చైతన్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఏసీబీ అవినీతి అధికారులపై మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రజల్ని లంచాలడిగి పీడిస్తోన్న అధికారులను చాకచక్యంగా పట్టుకుంటోంది. ముందుగా లంచం అడిగే అధికారి సంభాషణలను ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేస్తున్నారు. ఒకవేళ అధికారి ఆఖరి నిమిషంలో లంచం తీసుకోవడానికి ఆసక్తి చూపకపోయినా, ఫిర్యాదుదారుడు వెనక్కు తగ్గినా.. లంచం అడిగిన అధికారిపై కేసులు నమోదు చేస్తున్నారు. విధుల్లో ఉన్న ప్రభుత్వాధికారి లంచం డిమాండ్‌ చేయడం నేరమే. అందుకు క్రిమినల్‌ మిస్‌ కండక్ట్‌ కింద సెక్షన్‌ 7ఏ/2018 పీసీ సవరణ చట్టం ప్రకారం కేసులు బుక్‌ చేస్తున్నారు. దీంతో లంచం అడిగేందుకు అధికారుల్లో చాలామంది వెనకడుగు వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement