సాక్షి, హైదరాబాద్ : ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 12 గంటలుగా ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అశోక్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసం, అదే అపార్ట్‌మెంట్లో ఉన్న మరో రెండు ఇళ్లు, సీసీఎస్ కార్యాలయం, నగరంలోని మరో ఇద్దరు స్నేహితుల ఇళ్లు, విశాఖపట్నంలోని బంధువులకు సంబంధించిన రెండు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.
సోదాల్లో భాగంగా ఉమామహేశ్వర ఇంట్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. బంగారు ఆభరణాలు, సిల్వర్ ఐటమ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ల్యాండ్ డాక్యుమెంట్లు సైతం పట్టుబడుతున్నాయి. ఉమామహేశ్వర్ రావు.. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఓ పోలీస్ అధికారితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. తన మామ ఇంట్లో భారీగా ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన సమయంలో అక్రమార్జనతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు ప్రస్తుతం పనిచేస్తున్న సీసీఎస్‌లో పలు కేసుల్లో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు మద్దతు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కాగా అశోక్ నగర్‌లో సోదాలు జరిగే ప్రాంతానికి ఏసీపీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర చేరుకున్నారు. ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంటితో పాటు 7చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని, తనిఖీలు పూర్తయిన తర్వాత మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment