
అడ్డంగా దొరికిన ఉన్నతాధికారి
గుంటూరు రూరల్ : జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కారు. ఉన్నత స్థానంలో ఉన్న విషయాన్ని మరచిన ఆయన లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
గుంటూరు రూరల్ :
జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కారు. ఉన్నత స్థానంలో ఉన్న విషయాన్ని మరచిన ఆయన లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. కొద్ది రోజుల కిందట జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు హనుమంతునాయక్ లంచం తీసుకుంటూ దొరికిపోగా, తాజాగా ఏసీబీ అధికారులు పన్నిన వ్యూహంలో మరో ఉన్నతాధికారి చిక్కుకోవడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గ్రావెల్ క్వారీ లీజు మంజూరుకు సంబంధించి లంచం తీసుకుంటున్న మైనింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్ వై.ఎన్.ఆర్.వి.ప్రసాద్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అమరేంద్ర(ఔట్ సోర్సింగ్)లను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విజయవాడ తరలించారు.
ఇదీ నేపథ్యం....
ఏసీబీ డిఎస్పీ ఎం.రాజారావు తెలిపిన వివరాల మేరకు..
గుంటూరు నగరంపాలెంకు చెందిన మాజీ కార్పొరేటర్ పాలపర్తి రాము భార్య వెంకటవిజయలక్ష్మి చేబ్రోలు మండలం పాతరెడ్డి పాలెంలోని 7.83 ఎకరాల భూమిలో గ్రావెల్ క్వారీ కోసం 2012 ఆగస్టు 25న మైనింగ్ శాఖకు దరఖాస్తు చేశారు. ఆ తరువాత ఆ శాఖకు సంబంధించి గుంటూరు, ైెహ దరాబాద్‌ల నుంచి ఎన్‌వోసీలు పొందారు.
చివరకు ఆ ఫైలు గుంటూరులోని మైనింగ్ డిప్యూటీ డెరైక్టర్ వై.ఎన్.ఆర్.వి.ప్రసాద్ వద్దకు చేరింది, ఆయనే గ్రావెల్ లీజు గ్రాంట్ మంజూరు చేయాలి.
ఈ సమయంలో ఉన్నతాధికారి ప్రసాద్ రూ.లక్ష రూపాయల లంచం డిమాండ్ చేయగా, చివరకు రూ.80 వేలకు ఒప్పందం కుదుర్చుకున్న విజయలక్ష్మి భర్త రాము ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
ఏసీబీ డీఎస్పీ సూచనల మేరకు రాము రూ. 80 వేలు తీసుకొని శుక్రవారం మధ్యాహ్నం రామన్నపేటలోని ైమైనింగ్ డీడీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ డబ్బును డిప్యూటీ డెరైక్టర్ వై.ఎన్.ఆర్.వి.ప్రసాద్‌కు అందజేశారు.
డబ్బు తీసుకున్న ప్రసాద్ లెక్కించమంటూ తన పక్కనే ఉన్న డేటా ఎంట్రీ అపరేటర్ అమరేంద్రకు (ఔట్ సోర్సింగ్) నగదు అందజేశారు. చివరకు డబ్బు ను ప్రసాద్ తన టేబుల్ సొరుగులో పెట్టుకున్నారు.
అప్పటికే కార్యాలయం బయట వేచి ఉన్న ఏసీబీ గుంటూరు డిఎస్పీ ఎమ్. రాజారావు, విజయవాడ డీఎస్పీ ఆర్.విజయపాల్, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, నాగరాజు, సీతారామ్, నరసింహారెడ్డి ఒక్కసారిగా డిప్యూటీ డెరైక్టర్ చాంబర్‌లోకి దూసుకు వచ్చి టేబుల్ సొరుగులో ఉన్న డబ్బు స్వాధీనం చేసుకోని ప్రసాద్, డేటా ఎంట్రీ అపరేటర్ (ఔట్‌సోర్సింగ్) అమరేంద్రలను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రాజారావు విలేకరులతో మాట్లాడుతూ...మాజీ కార్పొరేటర్ పాలపర్తి రాము ఫిర్యాదు మేరకు దాడి చేసినట్టు వివరించారు. అవినీతికి పాల్పడిన మైనింగ్ శాఖ డిప్యూటి డెరైక్టర్ వై.ఎన్.ఆర్.వి ప్రసాద్‌తో పాటు అతనికి భాగస్వామిగా వ్యవహరించిన డేటా ఎంట్రీ అపరేటర్‌ను అదుపులో తీసుకున్నామన్నారు. టేబుల్ సొరుగులోని రూ. 80 వేలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఇదిలావుండగా, అన్ని ప్రభుత్వ శాఖల నుంచి గ్రావెల్ క్వారీకి అనుమతులు వచ్చినా చివరకు మైనింగ్ శాఖ డిప్యూటి డెరైక్టర్ వై.ఎన్.ఆర్.వి ప్రసాద్ లంచం డిమాండ్ చేశారని మాజీ కార్పొరేటర్ పాలపర్తి రాము తెలిపారు. అందుకే ఏసీబీని ఆశ్రయించానన్నారు.