ఏసీబీ వలలో ఇద్దరు సర్వేయర్లు
* ఓ రైతు వద్ద పొలం కొలతలకు రూ.17 వేలు తీసుకుంటూ...
* ఎకరాకు రూ.2 వేలు డిమాండ్
ఒంగోలు క్రైం: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు సంతనూతలపాడు మండలానికి చెందిన ఇద్దరు సర్వేయర్లు చిక్కారు. ఓ రైతు నుంచి రూ.17 వేలు లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ డీఎస్పీ ఆర్‌విఎస్‌ఎన్ మూర్తి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి చేసిన దాడిలో సంతనూతలపాడు సర్వేయర్ ఒ.యలమందరాజు, సహాయ సర్వేయర్ శివరాజులు ఒకేసారి చిక్కారు. సంతనూతలపాడులో యలమందరాజు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఒంగోలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ కార్యాలయంలోనే అవినీతి కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో అక్కడే నిఘా పెట్టారు.
ఏసీబీ డీఎస్పీ ఆర్‌విఎస్‌ఎన్ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం... కొండపి మండలం ముప్పరాజుపాలేనికి చెందిన మురార్జీకి తన బావమరిదికి సంతనూతలపాడు మండలం మద్దులూరులోని సర్వే నెం.299, 300లో 14 ఎకరాల పొలం ఉంది. సంతనూతలపాడు మండలానికి యలమందరాజు సర్వేయర్ కావడంతో తన 14 ఎకరాల పొలం కొలిచేందుకుగాను రైతు కోటపాటి మురార్జీ గత వారం రోజుల క్రితం సంప్రదించాడు. కొన్ని రోజుల పాటు తిప్పుకున్న తర్వాత ఎకరాకు రూ.2 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అంత ఇచ్చుకోలేను, ఎకరాకు రూ.1,000 చొప్పున ఇచ్చుకుంటానని రైతు మురార్జీ అభ్యర్ధించినా అంగీకరించని సర్వేయర్ రూ.1,800 ఇస్తే సరే లేకపోతే వేరేవారిని చూసుకోవాలంటూ తెగేసి చెప్పాడు. చివరకు చేసేది లేక రూ.1,500 చొప్పున ఎకరాకు ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. తొలుత అడ్వాన్సుగా రూ.4 వేలు సర్వేయర్‌కు ఇచ్చారు. మిగతా రూ.17 వేలు కొలతలు పూర్తయిన తర్వాత ఇవ్వాల్సి ఉంది.
అయినా కొలతలు పూర్తి చేయకుండానే రూ.17 వేలు మొత్తం ఇవ్వాలని సర్వేయర్ రైతు మురార్జీపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఒంగోలు ఏసీబీ డీఎస్పీ మూర్తిని బాధిత రైతు ఆశ్రయించాడు. ముందుస్తు ప్రణాళిక ప్రకారం మురార్జీ ఆ మొత్తాన్ని తీసుకొని నేరుగా యలమందరాజు ప్రైవేట్ కార్యాలయానికి వెళ్లి సహాయ సర్వేయర్ శివరాజుకు రైతు అందజేశాడు. ఆ తర్వాత సహాయ సర్వేయర్ శివరాజు నుంచి ప్రధాన సర్వేయర్ యలమందరాజు తీసుకొని తను వేసుకున్న టీ-షర్టు జేబులో పెట్టుకున్నాడు.
అదే సమయంలో మాటు వేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ మూర్తి బృందం సర్వేయర్ యలమందరాజు ప్రైవేట్ కార్యాలయంపై దాడి చేశారు. అతని వద్దనున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేక కెమికల్స్ ద్వారా ఆ నోట్లను పరీక్షించారు. నగదు నోట్లపై ఉన్న వేలిముద్రలు, సర్వేయర్, సహాయ సర్వేయర్లవేనని నిర్ధారించి కేసు నమోదు చేశారు. దాడి చేసి పట్టుకున్న వారిలో ఏసీబీ డీఎస్పీ మూర్తితోపాటు నెల్లూరు సిఐ కె.కృపానందం, ఒంగోలు ఎస్సై ఎస్. వెంకటేశ్వర్లు, ఒంగోలు ఏసీబీ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.