అవినీతిపై పోరులో లంచగొండులకే గెలుపా? | briberies wins fight on Corruption | Sakshi
Sakshi News home page

అవినీతిపై పోరులో లంచగొండులకే గెలుపా?

Published Fri, Mar 11 2016 1:14 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

అవినీతిపై పోరులో లంచగొండులకే గెలుపా? - Sakshi

అవినీతిపై పోరులో లంచగొండులకే గెలుపా?

విశ్లేషణ:
లంచగొండితనంపై పోరాడ డానికి ప్రభుత్వాలకు ఇష్టం లేదేమోనని ఎన్నో సార్లు అను మానం వస్తూ ఉంటుంది.  తాము నీతివంతమైన ప్రభు త్వాన్ని ఇస్తామని అందరూ అనే వారే. తీరా ఫిర్యాదు ఇస్తే తీసుకునే వారుండరు. కనీసం ఫిర్యాదు ఎక్కడ చేయాలో చెప్పరు. లంచం తీసుకుంటూ పట్టుబడినా సరే న్యాయ పోరాటంలో వారే గెలిచే స్థితి ఉంటే దాన్ని ఏమనాలి?

నిజానికి సమాచార హక్కు కింద ప్రశ్నలకు సమా ధానం దొరకదు. ప్రభుత్వ రికార్డుల్లో దాగిన లేదా దాచిన సమాచారాన్ని దాని ప్రతి రూపంలో పొందడం అనే అత్యంత ప్రధాన హక్కును మాత్రమే ఈ చట్టం ఇస్తున్నదని చాలా మంది గమనించడం లేదు. ఢిల్లీలో ఎవరైనా లంచం తీసుకుంటూ ఉంటే మేం ఎక్కడ ఫిర్యాదు చేయాలండీ అని ఒక పౌరుడు సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించాడు. సమాచారం ఇవ్వన వసరం లేదని తిప్పి కొట్టొచ్చు. కొడతారు కూడా. కాని ఈ కేసులో అడిగిన వ్యక్తి ప్రశ్నించడం తెలిసిన న్యాయ వాది. అవినీతి ఆరోపణలు వస్తే విచారణ జరిపే అధి కారం ఫలానా అధికారికి ఉందని, ఎవరికి ఫిర్యాదు ఏ విధంగా చేయాలో వివరించే ఆఫీస్ మెమొరాండం ప్రతులు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్య మంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్,  కేంద్ర హోం మంత్రులలో ఎవరికి ఏయే అధికారాలున్నాయో తెలిపే పత్రాలు కావాలని అడిగారు. నిర్ణయాధికారాలు ఎవరికి ఉన్నా యనేది మరో ప్రశ్న. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమైనా, దానికి ఒక శాసనసభ, మంత్రి మండలి ఉండడం, భూములు, శాంతి భద్రతలపై అధికారాలు కేంద్రం పరిధిలో ఉండడం వల్ల ఈ సందేహాలు తలెత్తాయి.

 మీరడిగిన రూపంలో మా దగ్గర ఏ పత్రాలూ సేక రించి సిద్ధంగా లేవని విజిలెన్స్ విభాగం పీఐఓ సమా ధానం చెప్పారు. 38 రూపాయలు చెల్లించిన తర్వాత 19 పేజీల నియామక నియమాల సమాచారం ఇచ్చారు. మొత్తం ఏసీబీ కార్యాలయంలో 116 పోస్టులు ఉన్నా యని, అందులో 28 ఖాళీగా ఉన్నాయని వివరించారు. కానీ అధికారాలకు సంబంధించిన వివరాలేవీ లేవు. న్యాయవిభాగం నుంచి ఏ సమాచారమూ లేదు. వీకే గర్గ్ అనే న్యాయవాది మూడు ఫిర్యాదులు దాఖలు చేశారు. సమాధానం తెలిసి చెప్పకపోవడం, సమాచారం ఉన్నా ఇవ్వకపోవడం అనే తప్పిదాలకు మాత్రమే జరిమానా విధించవలసి ఉంటుంది. న్యాయవాదికే చట్టాల పరిధి, విచారణ పరిమితుల సమాచారం స్పష్టంగా లేనపుడు ఒక ిపీఐఓ సమాచారం ఇవ్వలేకపోయాడని తప్పు బట్టడం సరికాదు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మాకు ఏ అధికారాలున్నాయో చెప్పండి అని ఢిల్లీ హైకోర్టును వీరంతా అడుగుతున్నారు లేదా మాకే అధి కారాలున్నాయని, వాటిని మరొకరు తీసుకొనే ప్రయ త్నం చేస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేస్తున్నారు. న్యాయ వాది అయిన సమాచార అభ్యర్థి లేవనెత్తిన సందేహం చాలా సమంజసమైనదే. ఎందుకంటే ఢిల్లీ ప్రజలకు లంచగొండులపైన ఫిర్యాదు ఎవరికి చేయాలో అర్థం కావడం లేదు. పాపం సాధారణ అధికారి అయిన పీఐఓ గానీ, కొంత సీనియారిటీ ఉన్న మొదటి అప్పీలు అధికారి గానీ, సమాచార కమిషనర్ గానీ తేల్చేంత సామాన్య విషయం కాదిది.

 అయితే న్యాయవాది అభ్యర్థనలు అన్నీ పరిశీలించి  వారి ప్రశ్నలన్నీ క్రోడీకరించిన తరువాత కొంత అయో మయం ఉన్న విషయం స్పష్టమైంది. కానీ దానికి జవాబు పీఐఓ చెప్పడం సాధ్యం కాదు. ఒక కానిస్టేబుల్ ఢిల్లీలోని దుకాణదారుడినుంచి 20 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. అతను 10 వేలు మాత్రం ఇవ్వగలనని ఇచ్చాడు. కానిస్టేబుల్ మిగిలిన డబ్బు కోసం వేధించసాగాడు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే వారు వల పన్ని అతడిని అరెస్టు చేశారు. అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటూ తన అవినీతిని విచారణ చేసే అధికారం ఢిల్లీ ప్రభుత్వ ఏసీబీకి లేదని. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం తనపై వచ్చిన ఆరోపణలను పరిశోధించే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని వాదించాడు. దానిపై ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల మధ్య ఉన్నత స్థాయి న్యాయ వాదం సాగింది.

సంవిధానం, చట్టాలు, జీవోలు తమ తెలివితేటలు కలిపి బోలెడు వాదోపవాదాలు చేశారు. ఢిల్లీలో 40 ఏళ్ల నుంచి అవినీతి నిరోధక శాఖ పనిచేస్తున్నది. ఆప్ సర్కారు 49 రోజుల పాటు సాగిన దశలో, ఒక పెద్దాయన పైన ఏసీబీ కేసు నమోదుచేశారు. ఆ ప్రభుత్వం దిగిపోయిన తరువాత కేంద్ర అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపైన విచారణ జరిపే అధి కారం ఢిల్లీ ఏసీబీ అధికారులకు లేదంటూ కేంద్ర ప్రభు త్వం ఒక జీవో జారీ చేసింది. దాన్ని ఢిల్లీ ప్రభుత్వం సవాలు చేసింది. మే 25, 2015 న ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఇస్తూ ఢిల్లీ ఏసీబీ విచారణాధికారంలో కేంద్రం జోక్యం చేసుకోవడం సమంజసం కాదని ప్రకటించింది.

 పౌరులు తమను వేధించే లంచగొండి అధికారుల పైన ఫిర్యాదు చేయాలనుకుంటే ఎవరికి చేయాలో తెలియజేయవలసిన బాధ్యత ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర హోం మంత్రిలకు ఉంది, ఈ విషయాలు వివరంగా వారంతట వారే సెక్షన్ 4(1)(బి) కింద ఇవ్వవలసి ఉంటుంది, ఆర్టీఐ ద్వారా అడిగినా ఎవరూ సమాధానం చెప్పలేకపోవడం న్యాయం కాదు. అవినీతిపై పోరాట అధికార వివాదాన్ని నానబెడుతూ ఉంటే అవినీతి వర్ధిల్లుతుంది కనుక ఈ విషయాలు తెల పాలని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు, గవర్నర్ కార్యాల యానికి కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది.

 (సీఐసీఎస్‌ఏ, ఎ, 2015, 000238 వి.కె. గర్గ్ వర్సెస్ డెరైక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, డిపార్ట్ మెంట్ ఆఫ్ లా కేసులో 29 ఫిబ్రవరిన కమిషన్ ఇచ్చిన తీర్పు ఆధారంగా)

http://img.sakshi.net/images/cms/2015-05/51431028391_160x120.jpg
 వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్, మాడభూషి శ్రీధర్
 professorsridhar@gmail.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement