పక్షపాతం, లంచగొండితనం లేకుండా, అనవసర నియామకాలు లేకుండా వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి సమాచారాన్ని ఇవ్వాలనీ, పారదర్శక పాలనకు అవసరమైన సమాచారాన్ని తిరస్కరించరాదనీ హైకోర్టు చెప్పింది.
వాక్‌స్వాతంత్య్రంలో భాగ మైన సమాచార హక్కు పరి ధిని అర్థం చేసుకోవడం కష్టం. కొన్ని కేసుల ద్వారా ఈ హక్కు విస్తృతిని వివరిం చాయి హైకోర్టులు. ఆర్టీఐ సెక్షన్ 24 కింద మినహాయిం చిన సంస్థల విషయంలో ఈ తీర్పులు కీలకమైనవి. నిఘా, భద్రతా విధులు నిర్వర్తించే కొన్ని సంస్థలు తమ సమాచారాన్ని పూర్తిగా ఇవ్వకుండా ఉండేందుకు, ఆర్టీఐలో సెక్షన్ 24 కింద ప్రభుత్వం నోటిఫై చేసిన సంస్థలను ఆర్టీఐ నుంచి మినహాయించే వీలు కల్పించారు. అయితే అవినీతి, మానవ హక్కుల ఉల్లం ఘన ఆరోపణలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వ వలసి ఉంటుందని వీటికి మినహాయింపు ఇచ్చింది.
ఆ సమాచారాన్ని సమాచార కమిషన్ ఆమోదంతో, సెక్షన్ 7తో సంబంధం లేకుండా, అభ్యర్థన అందిన 45 రోజు లలో ఇవ్వాలని రెండో మినహాయింపు వివరిస్తుంది. నోటిఫికేషన్‌ను సవరించడం ద్వారా కొన్ని సంస్థలను చేర్చడానికీ, తొలగించడానికీ వీలుంది. ప్రతి నోటిఫి కేషన్‌ను పార్లమెంటు ఉభయ సభల ముందుంచాలి. రాష్ర్ట ప్రభుత్వాలు కూడా ఈ విధంగా నోటిఫికేషన్‌లు జారీ చేయవచ్చు. నిఘా లేదా భద్రతా సంస్థలను చేర్చడానికీ, మినహాయించడానికీ నోటిఫికేషన్‌లు జారీ చేయవచ్చు. వాటిని రాష్ర్ట ఉభయ సభల ముందుం చాలి. పై రెండు మినహాయింపులు వర్తిస్తాయి. అంటే అవినీతి మానవహక్కుల ఉల్లంఘన సంబంధమైన సమాచారాన్ని కమిషన్ అనుమతితో 45 రోజుల్లోగా ఇవ్వాలి.
‘అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన సంబం ధమైన’ అంటే ఏమిటి అనే వివరణ చట్టంలో లేదు. హైకోర్టులు ఈ వాక్యాన్ని వివరించాయి. ఈ వాక్యాన్ని నిర్వచించడం అసాధ్యం. హరియాణా అడిషనల్ డీజీపీ వర్సెస్ సీయస్‌ఐసీ కేసులో ఒక పౌరుడు అడిష నల్ డీజీపీ గారి అధీనంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఏయే వర్గాల వారితో భర్తీ చేయవలసి ఉంది? అనే సమాచారాన్ని అడిగారు.
ఇది అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన సంబంధ సమాచారం కాదనీ, తమ సంస్థను హరియాణా ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఆర్టీఐ నుంచి మినహా యించిందనీ ఆ అధికారులు వాదించారు. పంజాబ్ హరియాణా హైకోర్టు దాకా కేసు వెళ్లింది. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? వాటిని ఏ ప్రత్యేక వర్గానికి కేటాయించారనే సమాచారం ఇవ్వకపోతే ఆ నియా మకాలు అవినీతి పూరితంగా జరిగే అవకాశం ఉందనీ, ఆ సమాచారం ఇస్తే నియామకాలు పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా భర్తీ అయ్యే వీలుందనీ, కనుక, ఆ సమాచారం అవినీతి సంబంధ సమా చారమేనని హైకోర్టు నిర్ధారించింది. మినహాయింపు పొందిన సంస్థ అయినా సరే ఆ సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.
పక్షపాతం, లంచగొండితనం, బంధు ప్రీతి లేకుండా, కారణం లేని నియామకాలు లేకుండా ఉండే వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలనీ, పారదర్శక పాలనకు అవ సరమైన సమాచారాన్ని తిరస్కరించరాదనీ హైకోర్టు 2011లో వివరించింది.
సీఐడీ విభాగాన్ని ఆర్టీఐ నుంచి మినహాయిస్తూ హరియాణా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హరియాణా పోలీసు సీఐడీ విభాగం నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని నిరాకరించింది. ఎఎస్‌ఐ, ఎస్‌ఐ పోస్టులు ఎన్ని, 1989 నుంచి, 2003 వరకు ఆ పోస్టుల నియామకాల విషయంలో ఏ విధంగా వ్యవహ రించారో వివరాలు ఇవ్వాలని సీఐసీ ఆదేశించారు. దీని మీద పోలీసు ఉన్నతాధికారులు పంజాబ్ హరియాణా హైకోర్టుకు వెళ్లారు.
ఇది అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారమని హైకోర్టు 2009 తీర్పులో నిర్ణయించింది. పీఠిక, లక్ష్య వివరణ ప్రకటనతో కలిపి సమాచార హక్కు చట్టం చదివి, ముఖ్య ఉద్దేశం ఏమిటో గమనించి ఆ విధంగా నియ మాలకు అర్థం అన్వయించుకోవాలని హైకోర్టు వివరిం చింది. కేవలం సెక్షన్ 24 లోని పదాలను విడివిడిగా చదివి, డిక్షనరీ అర్థాలు తీసుకుని, సమాచారాన్ని నిరాక రించడం సరికాదు. అవినీతిని తొలగించడానికి పారద ర్శకతను సాధనంగా వాడుకోవడం, సమాచారాన్ని తీసుకునే మార్గాలను కల్పించడం ఈ చట్టం లక్ష్యం. సెక్షన్ 24 మినహాయింపు అంటే అసలు ఆ సంస్థలు ఏ విషయమూ చెప్పనవసరం లేని రహస్య సంస్థ అని అర్థం కాదు. నిఘా భద్రతలకు అవసరమైనంతవరకు సమాచారం ఇవ్వనవసరం లేదు. అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన సంబంధ సమాచారం అంటే నిఘా భద్రతకు సంబంధం లేని సమాచారం మొత్తం అనీ అర్థం చేసుకోవాలన్నారు.
మణిపూర్ రాష్ర్టం పోలీసు శాఖను సస్పెన్షన్, క్రమశిక్షణా చర్యల పత్రాలు, తొలగింపు పత్రాల కాపీలు ఇవ్వాలని ఫయిరంబన్ సుధేశ్ సింగ్ కోరారు. మణిపూర్ పోలీసు శాఖ ఇవ్వలేదు. ప్రభుత్వం పోలీసు శాఖను సెక్షన్ 24 కింద ఆర్టీఐ నుంచి మినహాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది, కనుక మేం ఇవ్వాల్సిన పనిలేదన్నారు.
సమాచార హక్కు రాజ్యాంగం ప్రసా దించిన వాక్‌స్వాతంత్య్రంలో ఒక భాగమనీ, అది ప్రజా స్వామ్యానికి పునాది వంటిదనీ, దానికి ఆర్టికల్ 19(2) ఉన్న పరిమితులు వర్తిస్తాయనీ, అటువంటి పరిమితులే ఆర్టీఐ చట్టం సెక్షన్ 8లో కూడా నిర్దేశించారనీ మణిపూర్ హైకోర్టు వివరించింది. కనుక పోలీసు శాఖకు చెందిన భద్రతా వ్యవహారాల సంబంధిత సమాచారం తప్ప ఇతర సాధారణ సమాచారం ఇవ్వ డంలో ఏ ఇబ్బందీ ఉండకూడదని మణిపూర్ హైకోర్టు 2015లో ఆదేశిం చింది.
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
- మాడభూషి శ్రీధర్
professorsridhar@gmail.com
అవినీతి సంబంధ సమాచారం ఇవ్వాల్సిందే!
Published Fri, May 20 2016 1:13 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement