Transparent Governance
-
పారదర్శక పాలనలో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: అవినీతి రహిత, పారదర్శక పాలన లక్ష్యంగా రిజిస్ట్రేషన్ శాఖ వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దళారుల ప్రమేయం లేకుండా సామాన్యులు సైతం సులువుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్న ఆలోచనతో అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అక్రమాలకు చెక్ పెట్టడమే ధ్యేయంగా రిజిస్ట్రేషన్ శాఖ.. న్యాయ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రంగాల నిపుణులతో సంప్రదించి ఏయే అంశాలు తప్పనిసరిగా ఉండాలో చర్చించి సులభమైన రీతిలో నమూనా దస్తావేజులను రూపొందించింది. దీంతో ఎవరి డాక్యుమెంట్లను వారే సులభంగా రూపొందించుకునేలా కసరత్తు ప్రారంభించింది. భూములు, స్థలాలు, భవనాలు స్థిరాస్తుల అమ్మకం, బహుమతి, భాగం (పార్టిషన్), తనఖా, విడుదల (రిలీజ్)కు సంబంధించిన రిజిస్ట్రేషన్లకు 16 రకాల నమూనా డాక్యుమెంట్లను తెలుగు, ఇంగ్లిష్‌లో రూపొందించి రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ దిశగా కొత్త విధానాన్ని రూపొందించి కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఇప్పటిదాకా దళారులే ఆధారం ప్రస్తుతం రిజిస్ట్రేషన్లకు డాక్యుమెంట్లు (దస్తావేజులను) రాయడం కోసం ఎంత చదువుకున్న వారైనా దస్తావేజు లేఖరులు/దళారులను ఆశ్రయిస్తున్నారు. సొంతంగా దస్తావేజులు రాసుకునే వారు ఒక శాతం కూడా లేరు. దస్తావేజులు రాయడం అనేది సంక్లిష్టంగా ఉండటమే ఇందుకు కారణం. అందువల్ల వివిధ రకాల రిజిస్ట్రేషన్లు చేసుకోదలచిన వారు లేఖరులను కలిసి దస్తావేజులను రాయించుకుంటున్నారు. ఒక్కో దస్తావేజు తయారీకి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ తీసుకుంటున్నారు. చాలాచోట్ల దస్తావేజు లేఖరులు/దళారులు తామే రిజిస్ట్రేషన్లు చేయిస్తామంటూ రిజిస్ట్రేషన్ అధికారులకు ముడుపులు ఇచ్చేందుకంటూ వేలల్లో డబ్బు వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఇలా.. అవసరం ఉన్న వారెవరైనా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లోకి వెళ్లి కావాల్సిన డాక్యుమెంట్లను (విక్రయం, బహుమతి, భాగం..) డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లోనే అమ్మకందారులు, కొనుగోలుదారులు, ఆస్తులు, సర్వే/ ఇంటి నంబరు, సాక్షులు, చిరునామాలు లాంటి ఖాళీలను పూరిస్తే సమగ్రమైన డాక్యుమెంట్ తయారవుతుంది. దానిని ప్రింటవుట్ తీసుకుని సబ్మిట్/అప్లోడ్ చేస్తే నమోదు చేసిన రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళుతుంది. ఆస్తి వివరాలు (సర్వే నంబరు, విస్తీర్ణం/ ప్లాట్ నంబరు విస్తీర్ణం) లాంటివి నమోదు చేయగానే ఆటోమేటిగ్గా రిజిస్ట్రేషన్ కోసం ఎంత రుసుం (రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ, బదిలీ సుంకం) చెల్లించాలో కూడా ఆన్లైన్లో కనిపిస్తుంది. ఆ మేరకు ఆన్లైన్లోనే చెల్లించే విధానం ఇప్పటికే ఉంది. ఏరోజు, ఏసమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోదలిచారో కూడా ఆన్లైన్లోనే నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నిర్ధిష్ట సమయానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అరగంటలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. డబ్బు , సమయం ఆదా నూతన విధానం వల్ల డాక్యుమెంట్ల (దస్తావేజుల) తయారీ కోసం దళారులను ఆశ్రయించి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. దీనివల్ల అటు డబ్బు, ఇటు సమయం ఆదా అవుతాయి. రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ వినూత్న విధానం వల్ల పూర్తిగా అవినీతికి చెక్ పడుతుందని, పారదర్శకత పెరుగుతుందని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఈ కొత్త విధానాన్ని ఇప్పటికే విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇక్కడ ఎదురయ్యే సాధకబాధకాలను పరిశీలించి తగు మార్పు చేర్పులతో నవంబర్ ఒకటో తేదీ నుంచి దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించింది. నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఈ శాఖ అధికారులు రెండు బృందాలుగా ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఒక్కో రోజు రెండు జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఈ సదస్సులకు విద్యావంతులు, పుర ప్రముఖులు, న్యాయవాదులు, వైద్యులు, రియల్టర్లు, బిల్డర్లు లాంటి వివిధ వర్గాల వారిని ఆహ్వానిస్తున్నారు. కొత్త విధానం గురించి వివరించడంతోపాటు అవసరమైన మార్పు చేర్పులకు సంబంధించి వీరి నుంచి సూచనలు, సలహాలు కూడా స్వీకరిస్తారు. ఇందులో విలువైన, ఆచరణాత్మక సూచనలు ఉంటే వీటిని కూడా చేర్చి నవంబర్ నుంచి రాష్ట్రమంతటా అమలు చేయనున్నారు. ఈ నెల 14న కర్నూలు, విజయనగరం, 15న అనంతపురం, శ్రీకాకుళం, 16న వైఎస్సార్, విశాఖపట్నం, 17న చిత్తూరు, తూర్పు గోదావరి, 18న నెల్లూరు, పశ్చిమ గోదావరి, 19న ప్రకాశం, కృష్ణా, 21వ తేదీన గుంటూరు జిల్లాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. దళారులకు బ్రేక్ ప్రస్తుతం ప్రజలు స్థిరాస్తుల విక్రయం, బహుమతి, తనఖా ఇతరత్రా ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా దస్తావేజులు రాయించుకోవడం కోసం లేఖరులు/దళారులను ఆశ్రయిస్తున్నారు. కొత్త విధానం వల్ల ఎవరూ ఎవరి వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు. దస్తావేజులను కంప్యూటర్లోనే రూపొందించి సంబంధిత సబ్ రిజిస్ట్రారు కార్యాలయానికి ఆన్లైన్లోనే పంపవచ్చు. ఆన్లైన్లోనే స్లాట్ బుకింగ్ చేసుకుని నిర్ధిష్ట సమయానికి వెళ్లి గంటలోగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని దస్తావేజు నకళ్లు కూడా తీసుకుని వెళ్లవచ్చు. చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే చేసుకునే వెసులుబాటు ఉన్నందున ఎవరికీ నయాపైసా లంచం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అవినీతి రహిత సుపరిపాలన అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆశయాల మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నాం. – పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందరి సమస్యా ఇదే.. విశాఖ నగరానికి చెందిన ఒక వ్యాపారి సబ్బవరంలో నాలుగెకరాల భూమి కొనుగోలు చేశారు. దీనిని తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దస్తావేజు రాయించుకోవడం కోసం దస్తావేజు లేఖరుడైన దళారీని సంప్రదించారు. దస్తావేజు రాయడం, రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని సిబ్బందికి ముడుపులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించడం కోసం ఆ దళారి రూ.60 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. దస్తావేజు రాసినందుకే రూ.6 వేలు తీసుకున్నాడు. ప్రస్తుతం రాష్ట్రమంతా దాదాపు ఇదే పరిస్థితి. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ సర్కారు ‘మీ దస్తావేజును మీరే తయారు చేసుకోండి..’ అనే వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. -
ఇక పంచాయతీల్లో పారదర్శకం
సాక్షి, వరంగల్/భీమదేవరపల్లి: తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో భాగంగా ఏర్పాటు కానున్న స్థాయీ సంఘాల(స్టాండింగ్ కమిటీ)తో గ్రామ పంచా యతీ పాలన పారదర్శకంగా సాగే అవకాశాలున్నాయి. స్థానిక సంస్థలకు గ్రామ పరిపాలన పగ్గాలు అప్పగించాలన్న ధ్యేయంతో 73, 74వ రాజ్యాంగ సవరణలతో పంచాయతీల స్థాయిలో అభివృద్ధి కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని పొందుపర్చారు. కానీ ఈ విషయాన్ని గతంలో పట్టించుకోలేదు. గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగాలంటే సర్పం చ్ స్థాయిలోనే పెనుమార్పులతోనే సాధ్యమని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేశారు. జల భాగస్వామ్యం కోసం... గ్రామపంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ప్రజలను అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొం దించింది. అందులో భాగంగానే ప్రతీ గ్రామపంచాయతీకి నాలుగు స్టాండింగ్ కమిటీలతో పాటుగా ఒక్కో గ్రామ పంచాయతీకి ముగ్గురు చొప్పున కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియను 29వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, జిల్లాలోని మొత్తం ఏడు మండలాల్లో ఉన్న 130 గ్రామాల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గ్రామానికి అన్ని కమిటీలు కలిపి 63 మంది సభ్యులుగా ఉండనున్నారు. దీంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో 8,190 మందికి కమిటీలో అవకాశం దక్కుతుంది. అభివృద్ధి వేగిరం గ్రామపంచాయతీ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల్లో మంజూరైన పనులు త్వరతగతిన పూర్తి అయ్యేందుకు ఈ కమిటీలు పరోక్షంగా దోహదం చేస్తాయి. ఇప్పటి వరకు పంచాయతీల నిధులతో చేపట్టిన పనులను పర్యవేక్షించేందుకే సర్పంచ్ల పూర్తి సమయం సరిపోయేది. ఈ కమిటీల ఏర్పాటుతో చేపట్టిన పనుల నాణ్యతపై కూడా దృష్టి సారించే అవకాశాలున్నాయి. ఈ కమిటీల్లో విషయ నిఫుణులు, అనుభవం గల వారికి ప్రాతినిధ్యం కల్పించనుండడంతో గ్రామాల అభివృద్ధి పరుగులు తీస్తుందని భా విస్తున్నారు. ఎన్నిక విధానం ప్రతీ కమిటీలో 15 మంది సభ్యులకు తక్కువ కాకుండా.. ఈఓ పీఆర్డీల సమక్షాన కమిటీలను ఏర్పాటుచేయాలి. ఇందులో ఒకరిని కన్వీనర్‌గా ఎన్నుకోవాలి. కమిటీ సభ్యులంతా గ్రామ నివాసితులై, ఆ గ్రామ ఓటరై ఉండాలి. వార్డు సభ్యులకు ఈ కమిటీల్లో స్థానం ఉండదు. ఇక కమిటీల వారీగా అవగాహన కలిగిన అనుభజ్ఞులైన, నిష్ణాతులైన వ్యక్తులను కమిటీల్లోకి తీసుకోవాలి. గ్రామపంచాయతీ తీర్మానం మేరకు కమిటీ ఎంపిక పూర్తిచేయాలి. ముగ్గురు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జిల్లా పరిషత్, మండల పరిషత్ మాదిరిగా గ్రామపంచాయతీల్లోనూ ముగ్గురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. జెడ్పీల్లో ఇద్దరు, మండలాల్లో ఒకరిని మాత్రమే కో–ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకోగా గ్రామపంచాయతీల్లో మాత్రం ముగ్గురిని ఎన్నుకునేలా నూతన చట్టంలో పేర్కొన్నారు. ఈ కోప్షన్ సభ్యుల్లో ఒకరు సీనియర్ సిటిజన్, ఒకరు విశ్రాంత ఉద్యోగి(గ్రామాభివృద్ధికి ఆర్థిక సాయం చేసిన దాత, పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ), మరొకరు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలై ఉండాలి. ఈ సంఘాలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న సంఘం అధ్యక్షురాలికి అవకాశం కల్పిస్తారు. వీరు పంచాయతీల అభివృద్ధి కోసం గ్రామ పాలకవర్గం, స్టాండింగ్ కమిటీలతో కలిసి పనిచేస్తారు. అధికారుల కసరత్తు జీపీల్లో స్థాయి సంఘాల ఏర్పాటును ఈనెల 29లోగా పూర్తిచేసి 31లోగా జిల్లా పంచాయతీ అధికారికి అందచేయాలని కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో అధికా రులు కసరత్తు ప్రారంభించారు. సర్పంచ్, ప.కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని, వీటి ఏర్పాటును ఎంపీడీఓలు పర్యవేక్షించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఎన్నికకు సంబంధించి నోటీస్ బోర్డు ద్వారా తెలియజేయాలి. స్థాయీ సంఘాలు ఇవే... కమిటీ – 1 : పారిశుధ్యం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక నిర్వహణ కమిటీ – 2 : వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కమిటీ – 3 : మొక్కల పెంపకం, పచ్చదనం పెంపు కమిటీ – 4 : పనులు, సంతల పర్యవేక్షణ -
అవినీతి సంబంధ సమాచారం ఇవ్వాల్సిందే!
పక్షపాతం, లంచగొండితనం లేకుండా, అనవసర నియామకాలు లేకుండా వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి సమాచారాన్ని ఇవ్వాలనీ, పారదర్శక పాలనకు అవసరమైన సమాచారాన్ని తిరస్కరించరాదనీ హైకోర్టు చెప్పింది. వాక్‌స్వాతంత్య్రంలో భాగ మైన సమాచార హక్కు పరి ధిని అర్థం చేసుకోవడం కష్టం. కొన్ని కేసుల ద్వారా ఈ హక్కు విస్తృతిని వివరిం చాయి హైకోర్టులు. ఆర్టీఐ సెక్షన్ 24 కింద మినహాయిం చిన సంస్థల విషయంలో ఈ తీర్పులు కీలకమైనవి. నిఘా, భద్రతా విధులు నిర్వర్తించే కొన్ని సంస్థలు తమ సమాచారాన్ని పూర్తిగా ఇవ్వకుండా ఉండేందుకు, ఆర్టీఐలో సెక్షన్ 24 కింద ప్రభుత్వం నోటిఫై చేసిన సంస్థలను ఆర్టీఐ నుంచి మినహాయించే వీలు కల్పించారు. అయితే అవినీతి, మానవ హక్కుల ఉల్లం ఘన ఆరోపణలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వ వలసి ఉంటుందని వీటికి మినహాయింపు ఇచ్చింది. ఆ సమాచారాన్ని సమాచార కమిషన్ ఆమోదంతో, సెక్షన్ 7తో సంబంధం లేకుండా, అభ్యర్థన అందిన 45 రోజు లలో ఇవ్వాలని రెండో మినహాయింపు వివరిస్తుంది. నోటిఫికేషన్‌ను సవరించడం ద్వారా కొన్ని సంస్థలను చేర్చడానికీ, తొలగించడానికీ వీలుంది. ప్రతి నోటిఫి కేషన్‌ను పార్లమెంటు ఉభయ సభల ముందుంచాలి. రాష్ర్ట ప్రభుత్వాలు కూడా ఈ విధంగా నోటిఫికేషన్లు జారీ చేయవచ్చు. నిఘా లేదా భద్రతా సంస్థలను చేర్చడానికీ, మినహాయించడానికీ నోటిఫికేషన్లు జారీ చేయవచ్చు. వాటిని రాష్ర్ట ఉభయ సభల ముందుం చాలి. పై రెండు మినహాయింపులు వర్తిస్తాయి. అంటే అవినీతి మానవహక్కుల ఉల్లంఘన సంబంధమైన సమాచారాన్ని కమిషన్ అనుమతితో 45 రోజుల్లోగా ఇవ్వాలి. ‘అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన సంబం ధమైన’ అంటే ఏమిటి అనే వివరణ చట్టంలో లేదు. హైకోర్టులు ఈ వాక్యాన్ని వివరించాయి. ఈ వాక్యాన్ని నిర్వచించడం అసాధ్యం. హరియాణా అడిషనల్ డీజీపీ వర్సెస్ సీయస్ఐసీ కేసులో ఒక పౌరుడు అడిష నల్ డీజీపీ గారి అధీనంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఏయే వర్గాల వారితో భర్తీ చేయవలసి ఉంది? అనే సమాచారాన్ని అడిగారు. ఇది అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన సంబంధ సమాచారం కాదనీ, తమ సంస్థను హరియాణా ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఆర్టీఐ నుంచి మినహా యించిందనీ ఆ అధికారులు వాదించారు. పంజాబ్ హరియాణా హైకోర్టు దాకా కేసు వెళ్లింది. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? వాటిని ఏ ప్రత్యేక వర్గానికి కేటాయించారనే సమాచారం ఇవ్వకపోతే ఆ నియా మకాలు అవినీతి పూరితంగా జరిగే అవకాశం ఉందనీ, ఆ సమాచారం ఇస్తే నియామకాలు పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా భర్తీ అయ్యే వీలుందనీ, కనుక, ఆ సమాచారం అవినీతి సంబంధ సమా చారమేనని హైకోర్టు నిర్ధారించింది. మినహాయింపు పొందిన సంస్థ అయినా సరే ఆ సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. పక్షపాతం, లంచగొండితనం, బంధు ప్రీతి లేకుండా, కారణం లేని నియామకాలు లేకుండా ఉండే వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలనీ, పారదర్శక పాలనకు అవ సరమైన సమాచారాన్ని తిరస్కరించరాదనీ హైకోర్టు 2011లో వివరించింది. సీఐడీ విభాగాన్ని ఆర్టీఐ నుంచి మినహాయిస్తూ హరియాణా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హరియాణా పోలీసు సీఐడీ విభాగం నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని నిరాకరించింది. ఎఎస్ఐ, ఎస్ఐ పోస్టులు ఎన్ని, 1989 నుంచి, 2003 వరకు ఆ పోస్టుల నియామకాల విషయంలో ఏ విధంగా వ్యవహ రించారో వివరాలు ఇవ్వాలని సీఐసీ ఆదేశించారు. దీని మీద పోలీసు ఉన్నతాధికారులు పంజాబ్ హరియాణా హైకోర్టుకు వెళ్లారు. ఇది అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారమని హైకోర్టు 2009 తీర్పులో నిర్ణయించింది. పీఠిక, లక్ష్య వివరణ ప్రకటనతో కలిపి సమాచార హక్కు చట్టం చదివి, ముఖ్య ఉద్దేశం ఏమిటో గమనించి ఆ విధంగా నియ మాలకు అర్థం అన్వయించుకోవాలని హైకోర్టు వివరిం చింది. కేవలం సెక్షన్ 24 లోని పదాలను విడివిడిగా చదివి, డిక్షనరీ అర్థాలు తీసుకుని, సమాచారాన్ని నిరాక రించడం సరికాదు. అవినీతిని తొలగించడానికి పారద ర్శకతను సాధనంగా వాడుకోవడం, సమాచారాన్ని తీసుకునే మార్గాలను కల్పించడం ఈ చట్టం లక్ష్యం. సెక్షన్ 24 మినహాయింపు అంటే అసలు ఆ సంస్థలు ఏ విషయమూ చెప్పనవసరం లేని రహస్య సంస్థ అని అర్థం కాదు. నిఘా భద్రతలకు అవసరమైనంతవరకు సమాచారం ఇవ్వనవసరం లేదు. అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన సంబంధ సమాచారం అంటే నిఘా భద్రతకు సంబంధం లేని సమాచారం మొత్తం అనీ అర్థం చేసుకోవాలన్నారు. మణిపూర్ రాష్ర్టం పోలీసు శాఖను సస్పెన్షన్, క్రమశిక్షణా చర్యల పత్రాలు, తొలగింపు పత్రాల కాపీలు ఇవ్వాలని ఫయిరంబన్ సుధేశ్ సింగ్ కోరారు. మణిపూర్ పోలీసు శాఖ ఇవ్వలేదు. ప్రభుత్వం పోలీసు శాఖను సెక్షన్ 24 కింద ఆర్టీఐ నుంచి మినహాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది, కనుక మేం ఇవ్వాల్సిన పనిలేదన్నారు. సమాచార హక్కు రాజ్యాంగం ప్రసా దించిన వాక్‌స్వాతంత్య్రంలో ఒక భాగమనీ, అది ప్రజా స్వామ్యానికి పునాది వంటిదనీ, దానికి ఆర్టికల్ 19(2) ఉన్న పరిమితులు వర్తిస్తాయనీ, అటువంటి పరిమితులే ఆర్టీఐ చట్టం సెక్షన్ 8లో కూడా నిర్దేశించారనీ మణిపూర్ హైకోర్టు వివరించింది. కనుక పోలీసు శాఖకు చెందిన భద్రతా వ్యవహారాల సంబంధిత సమాచారం తప్ప ఇతర సాధారణ సమాచారం ఇవ్వ డంలో ఏ ఇబ్బందీ ఉండకూడదని మణిపూర్ హైకోర్టు 2015లో ఆదేశిం చింది. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ - మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
పారదర్శక పాలన కోసం సీసీ కెమెరాల ఏర్పాటు
కలెక్టర్ త్రిలోక్‌చంద్ర కోలారు : పారదర్శక పాలన అందించడం, ఎలాంటి అవ్యవహారాలకు చోటులేకుండా చే యడానికి తమ కార్యాలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ త్రిలోక్‌చంద్ర తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిబ్బంది ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు కార్యాలయంలో 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కార్యాలయానికి అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు. దీనిపై నిఘా వహించడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనికి రూ.50 వేలు వెచ్చించినట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయానికి కొత్త హంగులు తీసుకురానున్నామన్నారు. నగర సమీపంలోని కెంబోడి వద్ద కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. మిని విధాన సౌధ పనులు పూర్తయిన తరువాత పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నగరంలో 13వ తేదీ సర్వే పనులు పూర్తయిన తరువాత రోడ్డు విస్తరణ పనులను ప్రారంభిస్తామన్నారు. ఎం.జి రోడ్డు, కాళమ్మ గుడివీధి, ఖాద్రిపుర, దొడ్డపేట, చిక్కబళ్లాపురం రోడ్లను విస్తరిస్తున్నట్లు తెలిపారు. దొడ్డపేటలో ఆరు మీటర్లు, అంతరగంగ రోడ్డు 9 మీటర్లు విస్తరిస్తున్నట్లు తెలిపారు. పోస్టు మార్టం రిపోర్టు వచ్చిన తరువాత చర్యలు తాలూకాలోని త్యావనహళ్లి గ్రామం వద్ద అనుమానాస్పదంగా మృ తి చెందిన తాత మనువల పోస్టు మార్టం రిపోర్టు ఈ నెల 12 వస్తుందని, తదనంతరం ఘటన హత్యనా? లేక చిరుత దాడిలో మరణించారా? నిర్ధారించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలి పారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఇప్పటికే త్యావనహళ్లి గ్రామ సమీపంలో ఉన్న కొండలలో గాలింపు చేపడుతున్నారన్నారు. ఆ ప్రాంతంలో చిరుతలు ఉన్నట్లు ఆధారాలు ఇంకా లభ్యం కాలేదన్నారు. -
ఇదేమి పారదర్శక పాలన?
సర్కార్‌పై స్పీకర్ గరం బెంగళూరు : ‘ పారదర్శక పాలనంటే ఇదేనా. ముందు అవినీతిపరులపై చర్యలు తీసుకోండి’ అంటూ మంత్రులపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప మండిపడ్డారు. ఇలా విపక్ష నాయకులపైనే కాక స్వపక్షమైన కాంగ్రెస్ మంత్రులపై కూడా స్పీకర్ కాగోడు తిమ్మప్ప గరం అయ్యారు. స్పీకర్ స్థానానికి తరతమ భేదం లేదని మరోసారి రుజువు చేశారు. వివరాలు... బుధవారం శాసనసభ సమావేశాల కార్యక్రమాల్లో భాగంగా శృంగేరి జిల్లా పంచాయిత్‌లో జరిగిన నిధుల దుర్వినియోగానికి సంబంధించి సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని నియోజక వర్గ ఎమ్మెల్యే జీవరాజ్ స్పీకర్ ద్వారా న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర దృష్టికి తీసుకువచ్చారు. పూర్వాపరాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సమాధానం ఇస్తుంటే మధ్యలో కలుగ జేసుకున్న స్పీకర్ కాగోడు తిమ్మప్ప ‘పారదర్శక పాలన అంటూ చెప్పుకుచ్చే మీరు ఆరోపణలు ఉన్న అధికారిని అదేస్థానంలో ఎలా కొనసాగిస్తారు. మొదట ఆయన్ను తొలగిస్తామని ఇప్పుడే చెప్పండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు మంత్రి ఆధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు అప్పటికప్పుడు ప్రకటన చేశారు. అంతేకాకుండా విపక్షాలు అడిగాన ఓ ప్రశ్నకు ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే సుదీర్ఘ జవాబు ఇస్తుండటం విని ‘సూటిగా చెప్పండి. సమయం వృథా చేయకండి’ అని సూచించారు. ఇదిలా ఉండగా విపక్ష శాసనసభ్యులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు ‘అందుకు అనుగుణమైన ప్రశ్న నేను అడుగుతాను... నేను కూడా’ అంటూ లేచినిలబడి సభలో గందరగోళ పరిస్థితులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సృష్టించడం మొదలు పెట్టారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ తిమ్మప్ప ‘మొదట మీరు మీ స్థానాల్లో కుర్చొండి. నా అనుమతి లేకుండా ప్రశ్నలు ఎలా అడుగుతారు. ఇలా చేయడం సరికాదు. విలువైన సభాసమయాన్ని వృథా చేయకండి’ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభలో పరిస్థితిని చక్కదిద్దారు. -
e-పంచాయతీలు
ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు గ్రామపంచాయతీలను ఈ- పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తద్వారా గ్రామపంచాయతీ ద్వారా అందే అన్ని సేవలు ఆన్లైన్ ద్వారా అందనున్నాయి. పంచాయతీ ఆదాయ, వ్యయాలు, మంజూరయ్యే నిధులు, చేపట్టే పనులన్నింటినీ కంప్యూటరీకరిస్తారు. ఇందుకోసం జిల్లాలో 474 క్లస్టర్లకు కంప్యూటర్లు మంజూరుచేసింది. - పంచాయతీల కంప్యూటరీకరణ క్లస్టర్లకు కంప్యూటర్లు - రెండు కంప్యూటర్లకు ఒక ఆపరేటర్ - 15 రోజుల్లో ప్రజల్లోకి ఆన్లైన్ సేవలు జోగిపేట, న్యూస్‌లైన్: కాలం మారుతోంది. పాలనలో సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా గ్రామపంచాయతీలు ఈ-పంచాయతీలుగా మారుతున్నాయి. ఇక సేవలన్నీ ఆన్‌లైన్‌గా అందనున్నాయి. గ్రామాల్లో పాలనను మెరుగు పర్చేందుకు ఈ పంచాయతీ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. జిల్లాలో 514 క్లస్టర్లకు 474 క్లస్టర్లకు ఇప్పటి వరకు కంప్యూటర్లను ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాల సమాచారం. మండలంలో డాకూర్, అన్నాసాగర్, చింతకుంట, అక్సాన్‌పల్లి, అల్మాయిపేట, కొడెకల్, కన్సాన్పల్లి, రాంసానిపల్లి, నేరడిగుంట, పోతిరెడ్డిపల్లి క్లస్టర్లకు కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లో చేపట్టే ప్రతి పనిని ఆన్లైన్లో పొందుపర్చి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మంజూరైన కంప్యూటర్లను ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అమర్చే పనులను కర్వే టెక్నికల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాంట్రాక్టుకు ప్రభుత్వం అప్పగించింది. గ్రామ పంచాయతీల్లో సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో 15 రోజుల్లో సేవలు అందుబాటులోకి రానున్నాయి. రెండు క్లస్టర్లకు కలిపి ఒక్కరిని ఆపరేటర్‌గా ప్రభుత్వం నియమిస్తుంది. ప్రయోజనాలు - గ్రామ పంచాయితీలను ఈ పంచాయతీలుగా మార్చడం వల్ల పాలనకు పారదర్శకత చేకూరుతుంది. - పంచాయితీ కార్యాలయం నుంచి చేపట్టే ప్రతి పనిని కంప్యూటర్లో పొందుపరచి ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. - జనన మరణ ధ్రువీకరణ పత్రాలు చేతి రాతతో కాకుండా కంప్యూటర్ ద్వారా జారీ చేస్తారు. - గ్రామ పంచాయతీ నుంచి జారీ చేసే ప్రతీ సర్టిఫికెట్ వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తారు. - గ్రామ పంచాయతీ వచ్చే ఆదాయ, వ్యయాలు సైతం ఆన్లైన్లోనే ఉంచుతారు. - గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థిర, చర ఆస్తుల వివరాలు కూడా ఆన్లైన్లోనే ఉంచుతారు.