అందోల్ క్లస్టర్ పరిధిలోని కంప్యూటర్
ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు గ్రామపంచాయతీలను ఈ- పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తద్వారా గ్రామపంచాయతీ ద్వారా అందే అన్ని సేవలు ఆన్‌లైన్ ద్వారా అందనున్నాయి.
పంచాయతీ ఆదాయ, వ్యయాలు, మంజూరయ్యే నిధులు, చేపట్టే పనులన్నింటినీ కంప్యూటరీకరిస్తారు.
ఇందుకోసం జిల్లాలో 474 క్లస్టర్లకు కంప్యూటర్లు మంజూరుచేసింది.
- పంచాయతీల కంప్యూటరీకరణ క్లస్టర్‌లకు కంప్యూటర్లు
- రెండు కంప్యూటర్లకు ఒక ఆపరేటర్
- 15 రోజుల్లో ప్రజల్లోకి ఆన్‌లైన్ సేవలు
జోగిపేట, న్యూస్‌లైన్: కాలం మారుతోంది. పాలనలో సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా గ్రామపంచాయతీలు ఈ-పంచాయతీలుగా మారుతున్నాయి. ఇక సేవలన్నీ ఆన్‌లైన్‌గా అందనున్నాయి. గ్రామాల్లో పాలనను మెరుగు పర్చేందుకు ఈ పంచాయతీ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. జిల్లాలో 514 క్లస్టర్‌లకు 474 క్లస్టర్‌లకు ఇప్పటి వరకు కంప్యూటర్‌లను ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాల సమాచారం.
మండలంలో డాకూర్, అన్నాసాగర్, చింతకుంట, అక్సాన్‌పల్లి, అల్మాయిపేట, కొడెకల్, కన్‌సాన్‌పల్లి, రాంసానిపల్లి, నేరడిగుంట, పోతిరెడ్డిపల్లి క్లస్టర్‌లకు కంప్యూటర్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లో చేపట్టే ప్రతి పనిని ఆన్‌లైన్‌లో పొందుపర్చి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మంజూరైన కంప్యూటర్లను ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అమర్చే పనులను కర్వే టెక్నికల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాంట్రాక్టుకు ప్రభుత్వం అప్పగించింది. గ్రామ పంచాయతీల్లో సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో 15 రోజుల్లో సేవలు అందుబాటులోకి రానున్నాయి. రెండు క్లస్టర్‌లకు కలిపి ఒక్కరిని ఆపరేటర్‌గా ప్రభుత్వం నియమిస్తుంది.
ప్రయోజనాలు
- గ్రామ పంచాయితీలను ఈ పంచాయతీలుగా మార్చడం వల్ల పాలనకు పారదర్శకత చేకూరుతుంది.
- పంచాయితీ కార్యాలయం నుంచి చేపట్టే ప్రతి పనిని కంప్యూటర్‌లో పొందుపరచి ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.
- జనన మరణ ధ్రువీకరణ పత్రాలు చేతి రాతతో కాకుండా కంప్యూటర్ ద్వారా జారీ చేస్తారు.
- గ్రామ పంచాయతీ నుంచి జారీ చేసే ప్రతీ సర్టిఫికెట్ వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.
- గ్రామ పంచాయతీ వచ్చే ఆదాయ, వ్యయాలు సైతం ఆన్‌లైన్‌లోనే ఉంచుతారు.
- గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థిర, చర ఆస్తుల వివరాలు కూడా ఆన్‌లైన్‌లోనే ఉంచుతారు.