సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలికి సంబంధించి కీలకమైన డేటా ఉన్నట్టు భావిస్తున్న కంప్యూటర్ కనిపించకుండాపోయింది. 2014 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్లు యథాతథంగా ఉంచాలని సీఎస్ ఆదేశించిన రోజే ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని మండలి వైస్‌చైర్మన్(వీసీ) అహ్మద్ తెలిపారు.
ఏం జరిగిందో పరిశీలిస్తున్నామని మండలి కార్యదర్శి శ్రీనివాస్ చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. వైస్ చైర్మన్ వెంకటరమణ బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జ్ వీసీగా కూడా ఉన్నారు. ఈ కారణంగా ఆయన మండలి కార్యాలయానికి వచ్చి పోతున్నట్టు సిబ్బంది చెబుతున్నారు.
అందులో ఏముందో...?
కీలకమైన ఫైళ్లు స్టోర్ చేసేందుకు అత్యాధునిక సాంకేతిక సామర్థ్యమున్న కంప్యూటర్‌ను 2017లో కొనుగోలు చేశారు. అయితే, గత ఏడాది నుంచి అది పనిచేయడం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే దీనిని స్క్రాప్‌గా నమోదు చేసి, స్టోర్ రూంలో ఉంచామంటున్నారు. దీని స్థానంలో వేరే కంప్యూటర్ కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే ఫైళ్లు భద్రపరచాలన్న ఆదేశాలొచ్చిన రోజు కంప్యూటర్ కనిపించడం లేదని అధికారులు వీసీ అహ్మద్ దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో ఆయన హడావిడిగా సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసలు అందులో ఏముంది? పనిచేయకపోయినా పాత డేటా హార్డ్ డిస్‌్కలో ఉండే అవకాశం లేదా? హార్డ్‌డిస్క్ ఎక్కడుంది? అందులో డేటాను ఏం చేశారు? పనికి రాని కంప్యూటర్ తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సిబ్బందిని కోరారు. అయితే, ఈ సమావేశానికి మండలి కార్యదర్శి హాజరుకాలేదని చెబుతున్నారు.
దోస్త్ డేటా ఉన్నట్టేనా?
ఆన్‌లైన్ ద్వారానే ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలను భర్తీ చేస్తుంది. ఈ డేటా అంతా కంప్యూటర్‌లో పొందుపరుస్తారు. దీంతోపాటు మండలి ఆదేశాలు, డిగ్రీ కాలేజీల అనుమతులు ఇందులో ఉంటాయి. ప్రొఫెసర్ లింబాద్రి వీసీ–1గా ఉన్నప్పుడు, వెంకటరమణ వీసీ–2గా ఉన్నారు. లింబాద్రి మండలి చైర్మన్ అయిన తర్వాత అహ్మద్‌ను మండలి వైస్‌చైర్మన్‌గా నియమించారు.
ఈ నేపథ్యంలో వెంకటరమణ వీసీ–2 నుంచి వీసీ–1 మారుస్తూ అప్పటి విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ఇది మండలిలో తీవ్ర వివాదానికి దారి తీసింది. వీసీ–1, వీసీ–2 మధ్య రగడ తారస్థాయికి చేరింది. ఈ సమయంలోనే దోస్త్ వ్యవహారాలపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారడం, వీసీ–1గా ఉన్న వెంకటరమణను తీసేయడం, ఇదే సమయంలో దోస్త్‌కు సంబంధించిన కంప్యూటర్ మాయం కావడం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇంతకీ దోస్త్ మొదలైనప్పట్నుంచీ డేటా ఉందా? అనే సందేహం మండలివర్గాల నుంచే వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment