gram panchayati
-
ఏపీలోని 27 గ్రామా పంచాయతీలకు రాష్ట్రస్థాయి అవార్డ్స్
-
హరితహారం మొక్కలు తిన్న మేకలకు రూ.5వేలు జరిమానా
సాక్షి, భూదాన్ పోచంపల్లి : హరితహారంలో నాటిన మొక్కలు తిన్నందుకు మేకలకు రూ.5వేలు జరిమానా విధించిన సంఘటన సోమవారం నల్గొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలో చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హరితహారంలో భాగంగా గ్రామపరిధిలో రోడ్డు వెంట, అలాగే పల్లెప్రకృతి వనాల్లో మొక్కలు నాటారు. అయితే పలువురి మేకలు తరుచూ మొక్కలను తింటుండటంతో గతేడాది సెప్టెంబర్‌లో గ్రామసభ నిర్వహించి పశువులు, మేకలు మొక్కలు తిన్నా, లేదా ఏదేని కారణంతో తొలగించినా మొక్కకు రూ.500 చొప్పున జరిమానా విధించాలని తీర్మానించారు. కాగా.. సోమవారం గ్రామానికి చెందిన శాపాక జంగమ్మకు చెందిన మేకలు రోడ్డు వెంట నాటిన మొక్కలతో పాటు, పల్లెప్రకృతి వనంలోనివి కలిపి మొత్తం 10 మొక్కలు తిన్నాయి. దాంతో సిబ్బంది వాటిని పట్టుకొని గ్రామపంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చి బంధించారు. 10 మొక్కలకు గాను రూ. 5000వేల జరిమానా విధించి రసీదును మేకల మెడలో వేశారు. జరిమానా చెల్లించి మేకలు తీసుకెళ్లాలని అధికారులు సదరు యజమానికి సమాచారం ఇచ్చారు. అంతేకాక గతంలో అనేక మార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో కేసు కూడా నమోదు చేయాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: ఆ దేశంలో యూనిట్ కరెంటు 14 పైసలే.. ఎక్కడో తెలుసా? చదవండి: ‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’ -
లక్షలు దిగమింగి.. అడ్డగోలు పోస్టింగ్‌లు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గత పాలకుల హయాంలో రూ.లక్షలకు లక్షలు దిగమింగి ఎటువంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా గ్రామ పంచాయతీల్లో పలువురికి పోస్టింగ్‌లు కట్టబెట్టేశారు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ముడుపులు మెక్కి పోస్టింగ్‌లు ఇచ్చారు. తొలుత పార్ట్‌టైమ్ ఉద్యోగానికి తీసుకున్నారు. వారంతా ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో బిల్లు కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్ హోదాల్లో ప్రభుత్వం నుంచి రూ.వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారు. ఈ రకంగా జిల్లాలో అడ్డగోలుగా ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య పలు పంచాయతీల్లో లెక్కలు తీయగా 40 మంది ఉన్నట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇటీవల విజిలెన్స్ అధికారులు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి కోరారు. ఎంతమంది ఉన్నారు, వారికి గ్రామ పంచాయతీల నుంచి ఎంతెంత జీతాలు చెల్లిస్తున్నారు. వారి సరి్టఫికెట్లు వంటి వివరాలు సేకరిస్తున్నారు. నిబంధనలు తుంగలోకి తొక్కి గ్రామ పంచాయతీల్లో ఉద్యోగాలు పొందిన వారి జాతకాలు బయట పెట్టేందుకు విజిలెన్స్ విభాగం కసరత్తు మొదలు పెట్టింది. విచారణ సాగకుండా ఎత్తుగడలు నెలకు రూ.12 వేల నుంచి రూ.15వేలు జీతాలుగా తీసుకుంటున్న పరిస్థితుల్లో విచారణ జరిపితే ఎదురయ్యే పరిస్థితులను అక్రమార్కులు ముందుగానే గుర్తించారు. విచారణ ముందుకు సాగకుండా అడ్డుపుల్లలు వేసేలా అడుగులు వేస్తున్నారు. అడ్డగోలుగా ఉద్యోగాలు పొందిన వారంతా ఏదో విధంగా రెగ్యులరైజ్ చేయించుకోవాలని విజిలెన్స్ విచారణతో సంబంధం లేకుండా పావులు కదుపుతున్నారు. ఇన్నేళ్లు నుంచి పార్టుటైమ్ ఉద్యోగులుగా పంచాయతీల్లో పని చేస్తున్నాం.. తమకు కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి 101 ఖాతా ద్వారా జీతాలు ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారులపై ఒత్తిళ్లు తీసుకు వస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. సంతకాలు ఫోర్జరీ చేసి పోస్టింగ్‌లు ఏడెనిమిదేళ్ల క్రితం అక్రమ పోస్టింగ్ ఆర్డర్లు ఎలా వచ్చాయి? ఎవరెవరి పాత్ర ఉంది, పలు గ్రామ పంచాయతీల్లో ఉద్యోగులుగా చెలామణి అవుతున్న వారు ఎందరున్నారు వంటి వివరాలను విజిలెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. 2009కి ముందు జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన పి.సుబ్రహ్మణ్యం, ఇన్చార్జి డీపీవోగా పనిచేసిన ఇస్మాయిల్ సంతకాలు ఫోర్జరీ చేసి ఈ ఉద్యోగాలు కొట్టేశారని సమాచారం. అనంతరం ఆ పోస్టులపై జిల్లా అధికారులు ఆరా తీసి చర్యలకు ఉపక్రమిస్తే కొందరు నాయకులు అడ్డుపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు ఆ వివరాలు కూడా రాబట్టే పనిలో ఉన్నారు. అటువంటి వారంతా ప్రస్తుతం ఉద్యోగాలు క్రమబదీ్ధకరించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో పైరవీలు సాగించడం కొసమెరుపు. ఈ పోస్టింగ్‌లపై అప్పటి ఇన్చార్జి కలెక్టర్ గోపాలకృష్ణ ద్వివేది ఆధ్వర్యంలో సమగ్ర విచారణ కూడా జరిగిందిÐ. నాటి విచారణలో ఆ 40 పోస్టులు అక్రమమార్గంలో ఆర్డర్లు పొందినవేనని నిగ్గు తేల్చారు. బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతుండగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో అప్పటి నుంచి ఈ ఫైల్ అటకెక్కింది. ప్రస్తుతం ఈ అక్రమ పోస్టింగ్‌లపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతుండడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి గతంలో జరిగిన విషయాలు నా దృష్టికి రాలేదు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతా«ధికారుల దృష్టికి తీసుకువెళతాం. బాధ్యులపై చర్యలకు వెనుకాడేది లేదు. –ఆర్.విక్టర్, ఇన్చార్జి డీపీఓ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అక్రమంగా పోస్టింగ్‌లు పొందిన విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పలు గ్రామ పంచాయతీల్లో అక్రమమార్గంలో పోస్టింగ్‌లు పొందిన విషయం నా దృష్టికి రాలేదు. ప్రభుత్వం నుంచి న్యాయపరంగా కూడా ముందుకు వెళతాం. – నాగేశ్వరనాయక్, డీపీఓ (సెలవుపై ఉన్నారు) -
గ్రామ పంచాయతీగా సున్నిపెంట
కర్నూలు(అర్బన్): రెవెన్యూ గ్రామంగా ఉన్న సున్నిపెంట ఇక గ్రామ పంచాయతీగా మారనుంది. మంగళవారం రాజధాని అమరావతిలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన హై లెవెల్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు గోపాలక్రిష్ణ ద్వివేది, ఆదిత్యనాథ్ దాస్, పీఆర్ కమిషనర్ గిరిజాశంకర్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్‌రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జె. హరిబాబుతో పాటు అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. ముందుగా నీటి పారుదల, అటవీ, పంచాయతీకి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా సున్నిపెంటను గ్రామ పంచాయతీగా గుర్తించేందుకు అడ్డంకిగా ఉన్న స్టేను ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నారని జిల్లా పంచాయితీ అధికారి కేఎల్ ప్రభాకర్‌రావు చెప్పారు. అలాగే ప్రాజెక్టు పరిధిలో ప్రస్తుతం ఉన్న జనవాసాలు 1468 ఎకరాలకు మించకుండా రెవెన్యూ, అటవీ శాఖలకు చెందిన అధికారులు సంయుక్తంగా సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారన్నారు. గ్రామ పంచాయతీ ఏర్పాటుకు సంబంధించి ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే ప్రతిపాదనల రూపంలో పంపాలని జిల్లా కలెక్టర్‌ను కోరారన్నారు. త్వరలోనే సున్నిపెంటను గ్రామ పంచాయతీగా గుర్తిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నట్లు డీపీఓ తెలిపారు. నాడు వైఎస్ఆర్ ప్రకటించారు 2006 వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీఓ నంబర్ 2 జారీ చేస్తూ సున్నిపెంటను గ్రామ పంచాయతీగా ప్రకటించారు. ఈ విషయాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి కమిటీ ముందు పెట్టారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో సున్నిపెంట గ్రామం ఉందని పంచాయతీగా మారిస్తే అటవీ శాఖ భూములు అన్యాక్రాంతమవుతాయని అభ్యంతరం తెలపగా అందుకు శిల్పా అటవీభూముల సరిహద్దుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేందుకు రూ. 25 లక్షల నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. ఇందుకు అటవీ అధికారులు సమ్మతించడంతో గ్రామ పంచాయతీ ప్రకటనకు లైన్ క్లియర్ అయింది. ఈ విషయం తెలియగానే సున్నిపెంటలోని పార్టీ కార్యాలయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు శిల్పాభువనేశ్వరరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వట్టి వెంకటరెడ్డి , ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ రజాక్, మండల నాయకులు భరత్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలు బాణ సంచాపేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చా సున్నిపెంటను గ్రామపంచాయతీ చేయిస్తానని ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నాను. ఇందు కోసం ముఖ్యమంత్రిని పలుమార్లు కలిశాను. ఎల్టకేలకు గ్రామ పంచాయతీ కావడంతో గ్రామవలంటీర్ల నియామకాలతో పాటు గ్రామ సచివాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక నుంచి సున్నిపెంట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తా. భవిష్యత్‌లో నగర పంచాయతీగా మార్చేందుకు నా వంతు కృషి చేస్తా. – ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
పల్లె పంచాయతీ
సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.. దీనికి సంబంధించి ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి.. ఆ వెంటనే పల్లె ‘పంచాయతీ’ మొదలుకానుంది. హైకోర్టు కొద్దిరోజుల క్రితం ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ ఎన్నికలను 2019 జనవరి 11వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రారంభించారు. దీనిలో భాగంగా బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్లకు ఈనెల 5న ఆదేశాలు అందాయి. దీంతో వారు ఆదివారం ముసాయిదా జాబితా విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రిజర్వేషన్లపై నిరాశ గత ఆగస్టు 2వ తేదీ నాటికి పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియడంతో అంతకు నెల ముందే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇక నోటిఫికేషన్ విడుదలే తరువాయి అనుకున్న నేపథ్యంలో రిజర్వేషన్లపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలకు జరగలేదు. అయితే, బీసీ రిజర్వేషన్లను పెంచేది లేదని సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పులో వెల్లడించింది. అలాగే, మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ అక్టోబర్‌లో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తప్పనిసరి ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ మేరకు నవంబర్ మొదటి వారం నుంచే పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. నేడు ముసాయిదా.. 15న తుది జాబితా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అధికారులు ఈనెల 5వ తేదీ నుంచి బీసీ ఓటర్ల చేపడుతున్నారు. ఇంటింటికీ తిరిగి బీసీ ఓటర్లను గుర్తించేందుకు చేపట్టిన సర్వే శనివారం ముగిసింది. ఈ సర్వేకు సంబంధించి ముసాయిదా జాబితాను ఆదివారం వెల్లడించాల్సి ఉంది. ఈ జాబితాను అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శిస్తారు. అనంతరం ముసాయిదాపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్వీకరించి ఈనెల 12వ తేదీలోగా వాటిని పరిష్కరించాలి. ఇక ఈనెల 13, 14వ తేదీల్లో అన్ని గ్రామాల్లో ఓటర్ల జాబితాపై గ్రామసభలు ఏర్పాటుచేసి 15న తుది ఓటర్ల జాబితా వెల్లడించనున్నారు. జిల్లాలో 7,45,659 మంది ఓటర్లు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఓటరు జాబితాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 11,18,823 మంది జనాభా ఉంది. ఇందులో ఎస్టీలు 1,26,851 మంది, ఎస్సీలు 1,86,914 మంది ఉండగా.. ఇతరుల జనాభా 8,05,058 గా వెల్లడించారు. ఇక ఇందులో 7,45,659 ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో 3,74,026 మంది పురుషులు కాగా, 3,71,604 మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక జిల్లాలో పాత పంచాయతీలు 468 ఉండగా.. కొత్తగా 265 పంచాయతీలు ఏర్పడ్డాయి. మొత్తం 733 పంచాయతీలు కాగా.. ఇందులో 12 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో 721 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం పంచాయతీల్లో కలిపి 6,382 వార్డులకు గాను 6,366 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఇందుకోసం 6,364 పోలింగ్ స్టేషన్లను ఇప్పటికే ఎంపిక చేసిన అధికారులు మరో 18 స్టేషన్లను రిజర్వ్‌లో ఉంచారు. రెండు విడతలుగా ఎన్నికలు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను రెండు విడతలుగా నిర్వహించాలని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో రెండు పంచాయతీ డివిజన్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్ డివిజన్లో 14 మండలాలు, 441 పంచాయతీలు ఉండగా.. నారాయణపేట డివిజన్లో 11 మండలాలు, 280 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు మొత్తం 4,685 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా.. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం నుంచి తెప్పించి జిల్లా కేంద్రంలోని కొత్తగంజ్‌లో గోదాంలో భద్రపరిచారు. ఈ బాక్సుల్లో 4,535 సరిగ్గానే ఉన్నాయని గుర్తించిన అధికారులు 150 బాక్సులకు అవసరమైన మరమ్మతు చేయించారు. ఇవేకాకుండా జిల్లాలో ఉన్న 3వేల బాక్సులకు మరమ్మతులు చేయించి పోలింగ్‌కు సిద్ధం చేశారు. రిజర్వేషన్లపై కసరత్తు గ్రామపంచాయతీ ఓటరు జాబితా ప్రచురించిన అనంతరం అధికారులు గ్రామపంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనే సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా రిజర్వేషన్లు కేటాయిస్తారు. అయితే, ఈ విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉందని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడగానే.. రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ముగిసింది. 11వ తేదీన ఓట్లు లెక్కించాక కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. ఆ వెంటనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని తెలుస్తోంది. మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడం.. రిజర్వేషన్లు పెంపును సుప్రీంకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎదురుకానుంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నిర్ణయం మేరకు రిజర్వేషన్లను ప్రకటిస్తాం. కొత్తగా ప్రభుత్వం కొలువుదీరగానే ఈ అంశంపై ఆదేశాలు వెలువడు అవకాశముంది. – వెంకటేశ్వర్లు, డీపీఓ -
కుంట నక్కలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు:అధికార పార్టీ నేతల అవినీతి దందా పరాకాష్టకు చేరింది. పంట పొలాల్లో తవ్వుతున్న కుంట(ఫాంపాండ్స్)లనూ వదలని పరిస్థితి. ఉపాధి కూలీలతో చేయించాల్సిన ఈ నిర్మాణాలను యంత్రాలతో చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నేతలు తమ పొక్లెయిన్లనే ఇందుకోసం వినియోగిస్తున్నారు. అయితే, మస్టర్లో మాత్రం కార్మికులు పనికి వచ్చినట్టు దొంగ హాజరు సృష్టిస్తున్నారు. అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి ఉపాధి హామీ ఫీల్డ్ సిబ్బంది కూడా అవినీతిలో పాలుపంచుకుంటున్నారు. సహకరించకపోతే ఉద్యోగం నుంచి తీసివేయిస్తామనే బెదిరింపుల నేపథ్యంలో ఏమీ చేయలేక తిలా పాపం తలా పిడికెడు చందంగా వీళ్లూ వంత పాడుతున్నారు. నేతల పాలిట ‘సంజీవని’ భూమిపై పడిన ప్రతి నీటిచుక్కనూ కాపాడుకుని భూగర్భ జలాలను పెంపొందించుకోవడంతో పాటు పంట కుంటల తవ్వకం ద్వారా కేవలం ఉపాధి కూలీలకు పనులు కల్పించాలనేది జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆలోచన. ఎట్టి పరిస్థితుల్లోనూ యంత్రాలను ఉపయోగించవద్దని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో గ్రామ పంచాయతీలో 100 నుంచి 150 చొప్పున లక్ష నీటి కుంటలు తవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఒక్కో నీటి కుంటకు సైజును బట్టి 200 నుంచి 500 పనిదినాలను కల్పించవచ్చనేది ఆలోచన. అయితే, సగటున 300 పనిదినాలు కల్పించవచ్చనని అంచనా వేశారు. తద్వారా జిల్లాలో నిర్మించనున్న లక్ష నీటి కుంటల వల్ల 3కోట్ల పనిదినాలను కల్పించే వీలుంది. ఈ కార్యక్రమానికి పంట ‘సంజీవని’గా నామకరణం కూడా చేశారు. ఇది కాస్తా అధికార పార్టీ నేతలకు సంజీవనిగా మారిపోయింది. తమ యంత్రాలతో పనులు చేయిస్తూ కూలీలకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. వాళ్ల నోట్లో మట్టి కొట్టి ఆ నగదును కాస్తా తమ అకౌంట్లలో జమ చేసుకుంటున్నారు. వలసబాటలో జనం జిల్లాలో ఉపాధి పనులను ప్రధానంగా పంట కుంటలను తవ్వేందుకే చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించుకుంది. కేవలం మూడు నెలల కాలం(జనవరి, ఫిబ్రవరి, మార్చి)లోనే వీటిని తవ్వించడం ద్వారా 3కోట్ల పనిదినాలను వేసవి కాలంలో కల్పించి వలసలు లేకుండా చూడాలని భావించారు. అయితే, ఈ పనులపై కన్నేసిన అధికార పార్టీ నేతలు యంత్రాలతో పని కానిచ్చేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో లక్షలాది మంది జనం వలసబాట పడుతున్నారు. -
పింఛన్ కోసం ట్యాంక్ ఎక్కిన వికలాంగులు
కేసముద్రం : అర్హులమైన తమకు పింఛన్ ఎందుకు మంజూరు చేయలేదంటూ ఆగ్రహించిన వికలాంగులు ఓవర్‌హెడ్ ట్యాంకు ఎక్కి ఆందోళనకు దిగారు. ఈ ఘటన మండలంలోని ఇనుగుర్తిలో గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఇనుగుర్తిలో నవంబర్ 24న పింఛన్‌దారుల జాబితాను చదివి వినిపించే క్రమంలో అర్హులంతా తమను గుర్తించలేదంటూ గ్రామసభను అడ్డుకున్నారు. వీఆర్వో తప్పిదంతోనే ఇలా జరిగిందంటూ సంబంధిత అధికారులను నిలదీయడంతో మళ్లీ విచారణ జరిపి, అర్హులకు న్యాయం చేస్తామన్నారు. సవరించిన జాబితాలో కూడా మరికొందరు అర్హుల పేర్లు రాకపోవడంతో పంపిణీ తేదీలను వాయిదా వేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే గురువారం గ్రామపంచాయతీలో ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టారు. గ్రామంలో మొత్తం 1156 మంది అర్హులు ఉండగా 578 మందిని మాత్రమే గుర్తించడంతో పింఛన్ రానివారు ఆందోళనకు దిగారు. అంతేగాక వీరిలో మరో 98 మంది పేర్లు ఉన్నప్పటికీ వారిపేరుమీద డబ్బులు మంజూరు కాకపోవడం గమనార్హం. దీంతో ఆగ్రహించిన పింఛన్‌దారులంతా రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పోలీసులు, అధికారులతోపాటు సర్పంచ్ విజయ్‌కుమార్ వారిని బుజ్జగించి ఆందోళన విరమింపజేసి పక్కకు పంపించారు. అనంతరం తాము వంద శాతం వికలాంగులమైనప్పటికీ కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే మాకు పింఛన్లు రాలేదంటూ ఆగ్రహించిన వికలాంగులు గ్రామపంచాయతీ వెనకున్న ఓవర్‌హెడ్ ట్యాంక్ మెట్ల మీదుగా మధ్య వరకు ఎక్కి నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయకపోతే దూకుతామని బెదిరించారు. మీకు న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సై రంజిత్‌రావు వారిని శాంతింపజేసేందుకు యత్నించినా వారు వినలేదు. తమకు అన్యాయం చేసిన వీఆర్వోను ఇక్కడికి పిలిపించాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఎంపీడీఓ అరుణాదేవి మీకు ఎలాగైన రెండు నెలల పింఛన్ డబ్బులను వచ్చే జనవరిలో ఇప్పిస్తామంటూ నచ్చజెప్పారు. దీంతో వారు శాంతించి కిందకు దిగారు. -
e-పంచాయతీలు
ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు గ్రామపంచాయతీలను ఈ- పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తద్వారా గ్రామపంచాయతీ ద్వారా అందే అన్ని సేవలు ఆన్లైన్ ద్వారా అందనున్నాయి. పంచాయతీ ఆదాయ, వ్యయాలు, మంజూరయ్యే నిధులు, చేపట్టే పనులన్నింటినీ కంప్యూటరీకరిస్తారు. ఇందుకోసం జిల్లాలో 474 క్లస్టర్లకు కంప్యూటర్లు మంజూరుచేసింది. - పంచాయతీల కంప్యూటరీకరణ క్లస్టర్లకు కంప్యూటర్లు - రెండు కంప్యూటర్లకు ఒక ఆపరేటర్ - 15 రోజుల్లో ప్రజల్లోకి ఆన్లైన్ సేవలు జోగిపేట, న్యూస్‌లైన్: కాలం మారుతోంది. పాలనలో సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా గ్రామపంచాయతీలు ఈ-పంచాయతీలుగా మారుతున్నాయి. ఇక సేవలన్నీ ఆన్‌లైన్‌గా అందనున్నాయి. గ్రామాల్లో పాలనను మెరుగు పర్చేందుకు ఈ పంచాయతీ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. జిల్లాలో 514 క్లస్టర్లకు 474 క్లస్టర్లకు ఇప్పటి వరకు కంప్యూటర్లను ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాల సమాచారం. మండలంలో డాకూర్, అన్నాసాగర్, చింతకుంట, అక్సాన్‌పల్లి, అల్మాయిపేట, కొడెకల్, కన్సాన్పల్లి, రాంసానిపల్లి, నేరడిగుంట, పోతిరెడ్డిపల్లి క్లస్టర్లకు కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లో చేపట్టే ప్రతి పనిని ఆన్లైన్లో పొందుపర్చి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మంజూరైన కంప్యూటర్లను ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అమర్చే పనులను కర్వే టెక్నికల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాంట్రాక్టుకు ప్రభుత్వం అప్పగించింది. గ్రామ పంచాయతీల్లో సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో 15 రోజుల్లో సేవలు అందుబాటులోకి రానున్నాయి. రెండు క్లస్టర్లకు కలిపి ఒక్కరిని ఆపరేటర్‌గా ప్రభుత్వం నియమిస్తుంది. ప్రయోజనాలు - గ్రామ పంచాయితీలను ఈ పంచాయతీలుగా మార్చడం వల్ల పాలనకు పారదర్శకత చేకూరుతుంది. - పంచాయితీ కార్యాలయం నుంచి చేపట్టే ప్రతి పనిని కంప్యూటర్లో పొందుపరచి ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. - జనన మరణ ధ్రువీకరణ పత్రాలు చేతి రాతతో కాకుండా కంప్యూటర్ ద్వారా జారీ చేస్తారు. - గ్రామ పంచాయతీ నుంచి జారీ చేసే ప్రతీ సర్టిఫికెట్ వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తారు. - గ్రామ పంచాయతీ వచ్చే ఆదాయ, వ్యయాలు సైతం ఆన్లైన్లోనే ఉంచుతారు. - గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థిర, చర ఆస్తుల వివరాలు కూడా ఆన్లైన్లోనే ఉంచుతారు.