పింఛన్ కోసం ట్యాంక్ ఎక్కిన వికలాంగులు
కేసముద్రం : అర్హులమైన తమకు పింఛన్ ఎందుకు మంజూరు చేయలేదంటూ ఆగ్రహించిన వికలాంగులు ఓవర్‌హెడ్ ట్యాంకు ఎక్కి ఆందోళనకు దిగారు. ఈ ఘటన మండలంలోని ఇనుగుర్తిలో గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఇనుగుర్తిలో నవంబర్ 24న పింఛన్‌దారుల జాబితాను చదివి వినిపించే క్రమంలో అర్హులంతా తమను గుర్తించలేదంటూ గ్రామసభను అడ్డుకున్నారు. వీఆర్వో తప్పిదంతోనే ఇలా జరిగిందంటూ సంబంధిత అధికారులను నిలదీయడంతో మళ్లీ విచారణ జరిపి, అర్హులకు న్యాయం చేస్తామన్నారు. సవరించిన జాబితాలో కూడా మరికొందరు అర్హుల పేర్లు రాకపోవడంతో పంపిణీ తేదీలను వాయిదా వేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే గురువారం గ్రామపంచాయతీలో ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టారు.
గ్రామంలో మొత్తం 1156 మంది అర్హులు ఉండగా 578 మందిని మాత్రమే గుర్తించడంతో పింఛన్ రానివారు ఆందోళనకు దిగారు. అంతేగాక వీరిలో మరో 98 మంది పేర్లు ఉన్నప్పటికీ వారిపేరుమీద డబ్బులు మంజూరు కాకపోవడం గమనార్హం. దీంతో ఆగ్రహించిన పింఛన్‌దారులంతా రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పోలీసులు, అధికారులతోపాటు సర్పంచ్ విజయ్‌కుమార్ వారిని బుజ్జగించి ఆందోళన విరమింపజేసి పక్కకు పంపించారు.
అనంతరం తాము వంద శాతం వికలాంగులమైనప్పటికీ కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే మాకు పింఛన్లు రాలేదంటూ ఆగ్రహించిన వికలాంగులు గ్రామపంచాయతీ వెనకున్న ఓవర్‌హెడ్ ట్యాంక్ మెట్ల మీదుగా మధ్య వరకు ఎక్కి నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయకపోతే దూకుతామని బెదిరించారు. మీకు న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సై రంజిత్‌రావు వారిని శాంతింపజేసేందుకు యత్నించినా వారు వినలేదు. తమకు అన్యాయం చేసిన వీఆర్వోను ఇక్కడికి పిలిపించాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఎంపీడీఓ అరుణాదేవి మీకు ఎలాగైన రెండు నెలల పింఛన్ డబ్బులను వచ్చే జనవరిలో ఇప్పిస్తామంటూ నచ్చజెప్పారు. దీంతో వారు శాంతించి కిందకు దిగారు.