Handicaps
-
ఒకరికి ఒకరు ఊతమిచ్చుకున్నారు
వాళ్లిద్దరూ వికలాంగులు. పుట్టుకతోనే పోలియోబారిన పడి నడవలేని పరిస్థితి వారిది. పదేళ్ల క్రితం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కాళ్లు లేకున్నా ఆత్మవిశ్వాసంతో తమకు తాముగా నిలదొక్కుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా బతుకుతున్న ఆ జంటను చూసి అంతా అభినందిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణానికి సమీపంలో ఉన్న బాలాజీనగర్ తండాకు చెందిన కాట్రోత్ శంకర్ పుట్టుకతోనే వికలాంగుడు. నడవలేకున్నా చేతులనే ఆధారం చేసుకొని ఇంటర్ వరకూ చదువుకున్నాడు. ఆ తర్వాత సైకిల్ పంక్చర్ దుకాణం పెట్టుకుని జీవనం సాగించడం మొదలుపెట్టాడు. టీవీఎస్ మోపెడ్‌ను తనకు వీలుగా మరో రెండు చక్రాలు బిగింపజేసుకుని దానిపై ఊరూరు తిరుగుతూ సీజనల్ వ్యాపారాలు చేస్తుంటాడు. ఇష్టపడిన జీవితం మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన శారద చిన్నప్పుడే పోలియోబారిన పడింది. శారదను కలిసిన శంకర్ ఆమెనే తన జీవితభాగస్వామిగా రావాలనుకున్నాడు. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ వికలాంగులు కావడంతో ఎలా బతుకుతారోనని ఆ తండాలోని అంతా అనుకున్నారు. కాని వారి ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం ఓడిపోయింది. ఊరూరా ఇడ్లీలు ఇద్దరూ తెల్లవారకముందే నిద్రలేచి ఇడ్లీలు తయారు చేసుకుని ద్విచక్ర వాహనంపై పెట్టుకొని ఊరూరు తిరుగుతూ అమ్ముతుంటారు. ఇడ్లీల అమ్మకంతో వచ్చిన డబ్బును పొదుపు చేసుకున్నారు. ఇడ్లీలతోపాటు వేసవి వస్తే ఐస్‌క్రీమ్‌లు అమ్మేవారు. చలికాలం దుప్పట్ల వ్యాపారం చేసేవారు. ఇలా సీజన్‌కు తగ్గట్టు రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్న శంకర్, శారద దంపతులు తండావాసులకు ఆదర్శం అయ్యారు. కిరాణా కొట్టుతో పోషణ పొదుపు చేసుకున్న డబ్బుతో ఇప్పుడు కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పక్కన ఓ చిన్న షాప్ వేసుకుని కిరాణాకొట్టు నిర్వహిస్తున్నారు. ఇద్దరు కలిసి కామారెడ్డి, ఎల్లారెడ్డి పట్టణాలకు వెళ్లి సామాన్లు కొనుగోలు చేసుకుని వస్తారు. ప్రతీ రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ దుకాణం తెరిచే ఉంటుంది. తండావాసులే కాకుండా, రోడ్డున వెళ్లేవారు సైతం అక్కడ ఆగి తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇద్దరినీ చూసి మెచ్చుకొని వెళుతుంటారు. కొత్త కష్టం కుటుంబ పోషణకు ఎవరిపైనా ఆధారపడకుండా వెళ్లదీసుకుంటున్న ఈ జంటకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చింది. ఇన్నాళ్లూ పోగేసుకొని నిర్మించుకున్న షాప్ రోడ్డు వెడల్పులో పోతుందని ఆందోళన చెందుతోంది. అక్కడే ప్రభుత్వ స్థలం ఉందని, ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందిస్తే ఆ స్థలంలో షెడ్డు నిర్మించుకొని తమ బతుకులు తాము బతుకుతామని అంటున్నారు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి ఫొటోలు: అరుణ్ మాకు కాళ్లు లేవని బాధగా ఉండేది. కానీ, ఇప్పుడు ఒకరికి ఒకరం ఉన్నాం. కాళ్లు లేవనే బాధ లేదు. నలుగురిలో భేషుగ్గా బతకాలని ఇద్దరం కష్టపడుతున్నాం. దేనికీ లోటులేకుండా బతుకుతున్నాం. మమ్మల్ని చూసి మా తండాలోనే కాదు చుట్టుపక్కల ఊళ్లవాళ్లూ మెచ్చుకుంటుంటే ఎంతో ఆనందం కలుగుతోంది. – కాట్రోత్ శంకర్, శారద దంపతులు -
బిక్కుబిక్కుమంటూ
వారంతా మానసిక వికలాంగులు. చుట్టూ వరద నీరు ముంచేస్తున్నా ఏం జరుగుతోందో గ్రహించలేని నిస్సహాయులు. ఆరు రోజులు నీళ్లల్లోనే కాలం గడిపేశారు. చివరికి సహాయక బృందాలు కాపాడాయి. త్రిసూర్ జిల్లా మురింగూర్‌లోని మానసిక సంరక్షణ కేంద్రంలో 400 మంది వరకు రోగులు ఉన్నారు. ఆ ప్రాంతాన్ని వరద చుట్టుముట్టడంతో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. జనావాసాలకు దూరంగా ఉండే ఆ మానసిక కేంద్రం గురించి పట్టించుకునేవారే లేకపోయారు. మొదటి అంతస్తులోకి నీళ్లు వచ్చేయడంతో స్థానిక బ్లాక్ పంచాయతీ సభ్యుడు థామస్ మాత్రం వాళ్లని జాగ్రత్తగా పై అంతస్తులోకి తరలించారు. ప్రతీరోజూ చిన్న మరబోటులో ఆ కేంద్రానికి ఆహార పదార్థాలను తీసుకువెళ్లి వాళ్లకి తినిపించేవారు. ఆరు రోజులు గడిచాక సహాయ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. కానీ వరదనీరు చుట్టుముట్టేయడంతో వారందరినీ తరలించడం క్లిష్టంగా మారింది. ఆహారం, మందులు లేక ఇద్దరు మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోయారు. థామస్ సహకారంతో మిగిలిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇన్ని రోజులూ వారిని కంటికి రెప్పలా కాపాడిన థామస్‌ని రియల్ హీరో అని స్థానికులు కొనియాడుతున్నారు. -
అందరితో సమానంగా చూడాలి
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్) : సమాజంలో దివ్యాంగులు కూడా ఒక భాగమేనని, వారిని అందరితో సమానంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌లోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం సర్వశిక్షా అభియాన్, విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు సహాయ ఉపకరణాల నిర్ధారణ, పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు అవపరమైన అన్ని సదుపాయాలు కల్పించడం సమాజం బాధ్యత అని అన్నారు. 40శాతం ప్రభుత్వ నిధులు, 60శాతం ఎంపీ నిధుల్లో నుంచి ఈ పరికరాలను అందజేస్తున్నామన్నారు. జిల్లాలోని 374 మంది దివ్యాంగులకు భవిత కేంద్రాల్లో చదువు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందిస్తున్న రీసోర్స్ పర్సన్ అలీంతో పాటు ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం గతేడాది క్యాంప్ ద్వారా గుర్తించిన 164మంది పిల్లలకు కిట్స్, ట్రై సైకిళ్లు, ఎంఆర్ కిట్లు, బ్రెయిలీ కిట్లు అందజేశారు. శంకర్‌భవన్ స్కూల్ తనిఖీ అంతకుముందు శంకర్‌భవన్ స్కూల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్ షెడ్లో వండిన భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఎనిమిదో తరగ తి గదిలోకి వెళ్లి పిల్లలను సిలబస్ అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. -
దివ్యాంగ పురస్కారాల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులకు, సంస్థలకు జాతీయ దివ్యాంగ పురస్కారాలు దక్కాయి. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి సాధికారత కోసం పనిచేస్తున్న సంస్థలకు, వ్యక్తులకు కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ అవార్డులను ప్రదానం చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేశారు. వ్యక్తిగత వృత్తిలో రాణింపునకు గుర్తింపుగా కరీంనగర్ జిల్లా చిర్తకుంటకు చెందిన సి.సాయికృష్ణ, చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లికి చెందిన కెవి.శిరీషలకు అవార్డులు దక్కాయి. దివ్యాంగులకు ఉద్యోగ కల్పన ద్వారా వారి సాధికారతకు తోడ్పడుతున్న హైదరాబాద్‌కు చెందిన యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్‌కు, అలాగే సికింద్రాబాద్‌కు చెందిన దేవ్నార్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ సంస్థలకు అవార్డులు దక్కాయి. దేవ్నార్ సంస్థ చైర్మన్ సాయిబాబాగౌడ్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రోల్ మోడల్ అవార్డుల విభాగంలో సికింద్రాబాద్‌కు చెందిన కె.శేషగిరిరావు, ఆదిలాబాద్‌కు చెందిన ఆకుల రోహిత్‌లకు అవార్డులు దక్కాయి. అలాగే దివ్యాంగులకు అవసరమైన ఉత్పత్తులను తక్కువ ధరలో అందుబాటులోకి తేవడంపై జరిపిన పరిశోధనలకుగానూ హైదరాబాద్‌కు చెందిన బిశ్వజిత్‌రాయ్, ఆశాదాస్, విజయ్‌కుమార్ అలిషాలకు అవార్డులు దక్కాయి. ఇక దివ్యాంగులకు అనువుగా పరిసరాల ఏర్పాటు విభాగంలో శ్రీకాకుళం సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసుకు అవార్డు దక్కింది. దివ్యాంగుల సంక్షేమ అవార్డును ఈ ఏడాదికిగానూ మెడ్ ఇండియా వ్యవస్థాపకుడు పద్మశ్రీ డా.టీఎస్ చంద్రశేఖర్ అందుకున్నారు. -
దివ్యాంగుల సంక్షేమానికి రూ.33 కోట్లు
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్‌కు అదనంగా రూ.33 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో వికలాంగుల కోసం రూ.37 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. దివ్యాంగుల కోసం రూ.7 కోట్లతో ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, కర్రలు, క్యాలిపర్స్, కృత్రిమ అవయవాలు, వాహనాలను అందించనున్నట్లు తెలిపారు. బధిరులకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. దివ్యాంగుల కోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, టాయిలెట్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా కేంద్రంలో వయోవృద్ధుల కోసం డే కేర్ సెంటర్లు ప్రారంభించాలన్నారు. స్వయం ఉపాధి పథకం కింద దివ్యాంగులకు రుణ సదుపాయంలో సబ్సిడీ గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు పెంచుతున్నామని తెలిపారు. వివాహం కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు రూ.50 వేల చొప్పున 2,120 మంది దివ్యాంగులకు బహుమతి అందించాలని నిర్ణయించారు. దివ్యాంగుల ఆటల పోటీలకు ప్రతి జిల్లాకు రూ.లక్ష కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మూడో శనివారం ‘స్వరక్ష’ అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకత పెరగాలని, ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నట్లు చెప్పారు. మహిళలకు రక్షణ మరింత కట్టుదిట్టం చేస్తున్నామని, మహిళల అక్రమరవాణాను శాశ్వతంగా నిరోధించాలనే లక్ష్యంతో ప్రతి మూడో శనివారం రాష్ట్రమంతా ‘స్వరక్ష’డే పేరిట అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పా రు. డిజిటల్ ఇండియాలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు ట్యాబ్‌లు ఇస్తామని చెప్పారు. కేంద్రాల్లో పిల్లల నమోదు, వయసు, భోజన పథకాలు ట్యాబ్‌ల ద్వారానే పర్యవేక్షిస్తామన్నారు. సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డైరెక్టర్ విజయేందిర, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు. -
దివ్యాంగులకు ప్రయోజనకరం
పుట్టపర్తి టౌన్ : దివ్యాంగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ రాయితీ బస్సుపాసు సౌకర్యం కల్పిస్తోంది. వివిధ రకాల వైకల్యాల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు 50 శాతం రాయితీలో బస్సు పాసు సౌకర్యం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్టీసీ పుట్టపర్తి డిపో మేనేజర్ రమణయ్య గురువారం వివరించారు. ప్రత్యేకంగా దివ్యాంగ మేళాలను ఏర్పాటు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి పాస్‌లు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎములకల సంబంధిత వైకల్యం 40 శాతం, పోలియో, ఫెరాలసిస్కు సంబంధించి 40 శాతం, మూగ, చెవుడు, అంధత్వం 100 శాతం, బుద్ధి మ్యాంద్యం 50 శాతం కలిగిన వారికి ఆర్టీసీ 50 శాతం రాయితీతో బస్సు పాసులను అందజేస్తోంది. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ రాయితీ ద్వారా దివ్యాంగులు ప్రయాణించవచ్చు. ఇంటర్ స్టేట్ బస్సులు, ఆల్ట్రా లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులకు మాత్రం ఈ సౌకర్యం వర్తించదు. అంధత్వం ఉన్న వారికి, మరో సహాయకునికి కూడా 50 శాతం రాయితీని కల్పిస్తారు. ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే వారు తమ అంగవైకల్యం ధ్రువీకరణ పత్రంతోపాటు, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను ఆర్టీసీ అధికారులకు అందజేసి రాయితీ బస్సు పాసులు పొందవచ్చు. గతంలో డిపోల్లో మాత్రమే ఈ బస్సుపాసు కేంద్రాలను నిర్వహించిన సంస్థ, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రస్తుతం బస్టాండ్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా రాయితీ బస్సు పాస్‌లను అందజేస్తోంది. దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆర్టీసీ దివ్యాంగులకు 50 శాతం రాయితీతో బస్సు పాసు సౌకర్యం కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రతి దివ్యాంగుడు సద్వినియోగం చేసుకోవాలి. త్వరలోనే ప్రత్యేక దివ్యాంగ మేళా ఏర్పాటు చేసి అర్హులందరికీ బస్సుపాసులు మంజూరు చేస్తాం. విద్యావంతులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు తమ పరిసరాల్లోని దివ్యాంగులకు ఈ పథకంపై అవగాహన పెంపొందించాలి. – రమణయ్య, ఆర్టీసీ డీఎం, పుట్టపర్తి -
విభిన్న ప్రతిభావంతులకు సెన్సరీ పార్కు
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు(అర్బన్): కర్నూలులో విభిన్న ప్రతిభావంతులకు రూ.6.50 కోట్లతో సెన్సరీ పార్కు ఏర్పాటుకు ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక నియామకాల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 26 మంది విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించామని, త్వరలో మరో 54 పోస్టులను వారితో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. నేడు శోభయాత్ర ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం 9 గంటలకు అంబేడ్కర్‌భవన్ నుంచి శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం 10 గంటలకు సునయన ఆడిటోరియంలో ప్రత్యేక విద్య అభ్యసిస్తున్న దివ్యాంగులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, విభిన్న ప్రతిభావంతులు, ఆయా సంఘాలకు చెందిన నాయకులు హాజరు కావాలని కోరారు. -
వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ
ఆదిలాబాద్ : వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను మెరిట్ ఆధారంగా అర్హత సాధించిన వారితో భర్తీ చేసినట్లు కలెక్టర్ జగన్మోహన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాక్లాగ్ కోటాలో 18 మంది వికలాంగులకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ ఉత్తర్వులను సంబంధిత అభ్యర్థులకు అందజేశారు. హాస్టల్ వెల్ఫేర్ అధికారి మహిళ–1, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్–3, కార్యాలయం సబార్డినేట్–2, వాచ్‌మన్–1, కుక్–1, నర్సింగ్ ఆర్డర్లి–1, పబ్లిక్ హెల్త్‌వర్కర్–6, మహిళ వెల్ఫేర్ వర్కర్–1, ప్లాంటేషన్ లేబర్–1, కామాటి–1 పోస్టులు ఉన్నాయి. 18 మందిలో 9 అంధులు, 9 మందివికలాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వికలాంగ శాఖ ఏడీ వెంకటేశ్వర్లు తెలిపారు. -
వికలాంగుల సాధికారతకు కృషి: మోదీ
వారణాసి: అంగ వైకల్యం కలిగిన వ్యక్తులకు కూడా అసాధారణ శక్తిసామర్థ్యాలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వికలాంగులకు గౌరవం, సాధికారత కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వికలాంగులపై మనకున్న ఆలోచన ధోరణి మారాల్సిన అవసరం ఉందని.. లేదంటే వారిలోని అసాధారణ శక్తిసామర్థ్యాలను గుర్తించలేమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం వారణాసిలో జరిగిన ఒక కార్యక్రమంలో మానసిక, శారీరక వైకల్యం కలిగిన సుమారు 9వేల మందికి యాంత్రిక ట్రైసైకిళ్లు, వినికిడి పరికరాలు, ప్రత్యేకంగా రూపొందించిన స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లను మోదీ అందజేశారు. కాగా, ప్రధాని కార్యక్రమానికి వికలాంగులతో వస్తున్న ఓ బస్సు కప్సేతి ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 22 మంది వికలాంగులకు గాయాలయ్యాయి. జీవన ప్రమాణాలపైనా దృష్టి: మోదీ లక్నో: ఆర్థికాభివృద్ధే ముఖ్యం కాదని.. ఆ ఫలాలు సామాన్యునికి అందడం, పేదల జీవన ప్రమాణాల పెంపు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యాలని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ పేర్కొన్నారు. ఉపాధి కల్పన మెరుగుదల తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జన్‌ధన్ యోజన అకౌంట్లలో రూ.30వేల కోట్లు డిపాజిట్ అయ్యాయని మోదీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలనకు సంబంధించి ఐక్యరాజ్యసమితి అనుసరిస్తున్న విధానాల్లో సంస్కరణలు అవసరమని ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక కౌన్సిల్ కార్యక్రమంలో మోదీ తెలిపారు. -
కాలినడకతో శ్రీవారిని దర్శించుకున్న 200 మంది వికలాంగులు
చంద్రగిరి: హైదరాబాద్‌కు చెందిన రెండు వందల మంది వికలాంగులు శుక్రవారం కాలినడకన తిరుమలకు బయలుదేరారు. హైదరాబాద్‌కు చెందిన అష్టోత్తర చుక్కల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వేణుకుమార్ చుక్కల ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి 200 మంది వికలాంగులు, మరో వందమంది వాలంటీర్లు తిరుమలకు నడచి వెళ్లేందుకు శుక్రవారం శ్రీనివాసమంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు వద్దకు చేరుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి జెండా ఊపి వారి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ చుక్కల చారిటబుల్ ట్రాస్ట్ ఆధ్వర్యంలో ఇంతమంది కాలినడకన తిరుమలకు రావడం అభినందనీయమన్నారు. వికలాంగ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి వారిని వారి స్వస్థలంకు చేరుకునే విధంగా టీటీడీ సహాయసహకారాలు అందజేస్తుందన్నారు. మనోనేత్రంతో దర్శించుకునేందుకు వెళుతున్న అంధులకు ఆ భగవంతుడి కృపాకటాక్షాలు ఉంటాయన్నారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ వేణుకుమార్ చుక్కల మాట్లాడుతూ తన జీవితంలో వికలాంగ భక్తులతో కలసి 1000 సార్లు శ్రీవారిని దర్శించుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టానన్నారు. తాను ఇప్పటి వరకు 150సార్లు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నానన్నారు. -
నేటి నుంచే సదరమ్ క్యాంపులు
కలెక్టర్ రఘునందన్‌రావు వెల్లడి సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో మంగళవారం నుంచి సదరమ్ (వికలత్వ నిర్ధారణ క్యాంపులు) నిర్వహించనున్నట్టు కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ క్యాంపులు కొనసాగుతాయని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రాల్లోని క్లస్టర్ ఆస్పత్రుల్లో క్యాంపులు కొనసాగుతాయని, తేదీలవారీగా ఆయా నియోజకవర్గాలకు చెందిన వికలాంగులు హాజరుకావాలని కోరారు. -
తప్పెవరిది.. శిక్ష ఎవరికి..?
బషీరాబాద్: పింఛన్ కావాలంటే ఆధార్ కార్డు కావాల్సిందే.. ఆధార్ కార్డు కావాలంటే వేలిముంద్రలు, కంటి రెటినా తప్పనిసరి. మరి ఈ రెండూ లేని వికలాంగుల పరిస్థితి గురించి ప్రభుత్వం ఆలోచించలేదు. ఈ రెండూ లేకుండా ఆధార్ కార్డు పొందడం అసాధ్యం. అది లేకుండా పింఛన్ ఇవ్వలేమని ప్రభుత్వం ప్రకటించడం దారుణమని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డులు ఇవ్వలేదని వికలాంగులకు రేషన్ సరుకుల పంపిణీ ఇప్పటికే నిలిచిపోయింది. ప్రస్తుతం వారు పింఛన్లకు కూడా దూరమవుతున్నారు. ఆధార్ ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయని అధికారులు నిర్ధాక్షిణ్యంగా చెబుతున్నారు. మండలంలో ఇప్పటి వరకు 80 శాతం వరకు ఆధార్ ప్రక్రియ పూర్తయింది. అయితే కంటిచూపు లేనివారు, చేతులు లేనివారికి ఆధార్ కార్డు అందించలేమని అక్కడి సిబ్బంది తిరిగి పంపిస్తున్నారు. ఇటువైపేమో ఆధార్ కార్డు ఉంటేనే పింఛన్ అంటూ ప్రభుత్వం కొత్త రాగం అందుకుంది. మరి ఆధార్ కార్డు పొందలేని వారి పరిస్థితి గురించి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించడం లేదు. ఈ విషయమై అధికారులను అడిగితే నిబంధనల మేరకే తాము నడుచుకుంటున్నామని, తాము ఏమీ చేయలేమని చెప్పి పంపిస్తున్నారని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని జీవన్గి దామర్‌చెడ్, ఎక్మాయి, మైల్వార్‌తోపాటు పలు గ్రామాలలో వికలాంగులు ఇదే సమస్యతో సతమతమవుతున్నారు. కళ్లులేని వారికి, చేతులు లేని వారికి ప్రత్యేక ఆధార్ కార్డులు అందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. -
పింఛన్ పాట్లు
తిరుపతి క్రైం: అధికారుల్లో ముందుచూపు లేకపోవడం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడ్డం పింఛనుదారుల పాలిట శాపంగా మారుతోంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గంటల తరబడి పింఛన్ కోసం ఎదురు చూసేలా, రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేస్తోంది. గురువారం తిరుపతిలోని ప్రధాన తపాలా కార్యాలయాన్ని చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తపాలశాఖ ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సైతం తపాలాశాఖ ఆధ్వర్యంలోనే పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయకపోవడంతో గందరగోళం నెలకొంది. తిరుపతితో పాటు జిల్లాలోని దాదాపు 32వేల మందికి పింఛన్ మంజూరు చేయాల్సి ఉంది. ఏపీ ఆన్లైన్, డీఆర్డీఏ నగర పాలక సంస్థ అవగాహన చేస్తూ బయోమెట్రిక్ యంత్రాలను తపాలాశాఖకు అందించాయి. తిరుపతిలో 10 తపాలా కార్యాలయాల్లో బయోమెట్రిక్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. అయితే కేటాయింపుల్లో నిర్లక్ష్యం చూపారు. నివాసం ఉన్న ప్రాంతం ఒకటైతే పింఛన్ ఇచ్చే కార్యాలయం మరో ప్రాంతంలో కేటాయించారు. దీంతో పింఛన్‌దారులు ఏ కార్యాలయానికి పోవాలో తెలియక హెడ్‌పోస్టాఫీస్‌కు చేరుకుంటున్నారు. ఎక్కడ పింఛన్ తీసుకోవాలో తెలియకే... తిరుపతిలో దాదాపు 4,800 మంది లబ్ధిదారులున్నారు. ఏపీ ఆన్లైన్లో ఇచ్చిన సమాచారం మేరకు వారికి ఖాతాలు తెరిచి పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఈ సోమవారం నుంచి పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న పింఛన్ పొందే వృద్ధులు, వికలాంగులు తిరుపతిలోని ప్రధాన కార్యాలయానికి నాలుగు రోజులుగా తండోపతండాలుగా చేరుకుంటున్నారు. ఇటు తపాలాశాఖ అధికారులు ఏమి చేయాలో అర్థం కాక ప్రతి ఒక్కరికీ నచ్చజెప్పుకుంటూ వారికి మార్గనిర్దేశం చేసి పంపిస్తున్నారు. అయినా గంటల తరబడి వృద్ధులు, వికలాంగులు పింఛన్ల కోసం తపాలా కార్యాలయం వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. తమ ఇళ్ల వద్దకే వచ్చి పింఛను పంపిణీ చేస్తే బాగుంటుందని పింఛన్లు పొందే వృద్ధులు, వితంతువులు వికలాంగులు కోరుతున్నారు. -
పింఛన్ కోసం ట్యాంక్ ఎక్కిన వికలాంగులు
కేసముద్రం : అర్హులమైన తమకు పింఛన్ ఎందుకు మంజూరు చేయలేదంటూ ఆగ్రహించిన వికలాంగులు ఓవర్‌హెడ్ ట్యాంకు ఎక్కి ఆందోళనకు దిగారు. ఈ ఘటన మండలంలోని ఇనుగుర్తిలో గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఇనుగుర్తిలో నవంబర్ 24న పింఛన్‌దారుల జాబితాను చదివి వినిపించే క్రమంలో అర్హులంతా తమను గుర్తించలేదంటూ గ్రామసభను అడ్డుకున్నారు. వీఆర్వో తప్పిదంతోనే ఇలా జరిగిందంటూ సంబంధిత అధికారులను నిలదీయడంతో మళ్లీ విచారణ జరిపి, అర్హులకు న్యాయం చేస్తామన్నారు. సవరించిన జాబితాలో కూడా మరికొందరు అర్హుల పేర్లు రాకపోవడంతో పంపిణీ తేదీలను వాయిదా వేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే గురువారం గ్రామపంచాయతీలో ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టారు. గ్రామంలో మొత్తం 1156 మంది అర్హులు ఉండగా 578 మందిని మాత్రమే గుర్తించడంతో పింఛన్ రానివారు ఆందోళనకు దిగారు. అంతేగాక వీరిలో మరో 98 మంది పేర్లు ఉన్నప్పటికీ వారిపేరుమీద డబ్బులు మంజూరు కాకపోవడం గమనార్హం. దీంతో ఆగ్రహించిన పింఛన్‌దారులంతా రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పోలీసులు, అధికారులతోపాటు సర్పంచ్ విజయ్‌కుమార్ వారిని బుజ్జగించి ఆందోళన విరమింపజేసి పక్కకు పంపించారు. అనంతరం తాము వంద శాతం వికలాంగులమైనప్పటికీ కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే మాకు పింఛన్లు రాలేదంటూ ఆగ్రహించిన వికలాంగులు గ్రామపంచాయతీ వెనకున్న ఓవర్‌హెడ్ ట్యాంక్ మెట్ల మీదుగా మధ్య వరకు ఎక్కి నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయకపోతే దూకుతామని బెదిరించారు. మీకు న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సై రంజిత్‌రావు వారిని శాంతింపజేసేందుకు యత్నించినా వారు వినలేదు. తమకు అన్యాయం చేసిన వీఆర్వోను ఇక్కడికి పిలిపించాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఎంపీడీఓ అరుణాదేవి మీకు ఎలాగైన రెండు నెలల పింఛన్ డబ్బులను వచ్చే జనవరిలో ఇప్పిస్తామంటూ నచ్చజెప్పారు. దీంతో వారు శాంతించి కిందకు దిగారు. -
ఇదేం ‘ఆసరా’
చిత్రంలో కనిపిస్తున్న వికలాంగులు.. హసన్‌పర్తి మండలం పెగడపల్లికి చెందిన గన్నోజు శ్రీనివాస్, దామెరబాబు, తిరుపతి, గన్నోజు కుమారస్వామి, రాజ్‌కుమార్. బుధవారం అధికారులు ప్రకటించిన ఆసరా పింఛన్ జాబితాలో వీరి పేర్లు లేవు. దీంతో వీరు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గతంలో మాకు పింఛన్లు వచ్చారుు. మాకు అర్హత లేదా? అని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. పరిశీలించి డబ్బులు ఇప్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. - హసన్‌పర్తి కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం రాస్తారోకోలు.. ధర్నాలతో దద్దరిల్లిన పంపిణీ కేంద్రాలు ఇంటి, నల్లా పన్నుల పేరిట కోత రఘునాథపల్లి, ధర్మసాగర్.. మహబూబాబాద్ సెగ్మెంట్లోని కేసముద్రంలో పింఛన్‌దారుల నుంచి పంచాయతీ కార్యదర్శులు ఇల్లు, నల్లా పన్నును బలవంతంగా వసూలు చేశారు. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆవేదన వ్యక్తం చేశారు. పర్వతగిరి మండలం రావూర్లో పింఛన్‌దారుల నుంచి కారోబార్ రూ.200 వసూలు చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే పేర్లు తొలగిస్తాననడంతో ఇచ్చినట్లు బానోత్ అచ్చిరాం, బానోత్ కోట, బానోత్ చాంది, ఆర్. దేవేందర్, డి.బిచ్చానాయక్, రాజేందర్ తెలిపారు. దుగ్గొండి వుండల వికలాంగుల సంఘం అధ్యక్షురాలు బోళ్ల దేవికి వికలాంగుల పింఛన్‌కు బదులుగా వితంతు పింఛన్ వుంజూరైంది. నర్సింహులపేట మండలం రేపోణి గ్రామంలో తమ కుటుంబాల వారికి పింఛన్లు మంజూరు కాకపోవడంతో వీఆర్వో రమేష్‌పై ఇద్దరు వ్యక్తులు దాడికి ప్రయత్నించగా.. పింఛన్ల పంపిణీ నిలిచింది. జిల్లావ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే దాదాపు 46 వేల మందికి రూ.9.30 కోట్ల పంపిణీ జరిగింది. జిల్లాలో ‘ఆసరా’ పథకం కొందరికి మోదం కలిగించగా.. మరికొందరికి ఖేదం మిగిల్చింది. జాబితాలో పేర్లు లేకపోవడంతో అర్హులైన వికలాంగులు, వితంతువులు, వృద్ధులు రాస్తారోకోలు నిర్వహించారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు తప్పలేదు. ఆన్లైన్ మొరాయించడంతో లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. పలు కారణాలతో కొన్ని చోట్ల పింఛన్ పంపిణీ కాలేదు.. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పింఛన్ ఇస్తామని అధికారులు ప్రకటించారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పథకం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత కార్మికులకు అవస్థలు తెచ్చిపెట్టింది. రెండు నెలల పింఛన్లు బుధవారం నుంచి ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనకు.. అధికారుల చర్యలకు సారూప్యత కనిపించలేదు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కొద్ది మందికే పింఛన్లు మంజూరయ్యాయి. పంపిణీ చేసిన కొద్ది మందికి సంబంధించిన నగదులో పంచాయతీ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కోత పెట్టారు. ఇంటి, నల్లా పన్నుల కింద జమ చేసుకున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. జిల్లావ్యాప్తంగా లబ్ధిదారుల జాబితాపై అర్హులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్హతలు ఉన్న చాలా మంది తమ పేర్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. అభ్యుదయ అధికారి, కమిటీ సభ్యులైన సర్పంచ్, వీఓ మెంబర్, మహిళా వార్డు మెంబర్ సమక్షంలో పింఛన్లు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఉన్నా, క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. నియోజకవర్గాల వారీగా ఇలా... స్టేషన్‌ఘన్‌పూర్ : ధర్మసాగర్ మండలం కమ్మరిపేటలో అర్హులందరికీ పింఛన్లు అందే వరకు పంపిణీ కార్యక్రమం చేపట్టొద్దని ప్రజలు అడ్డుకున్నారు. దీంతో కార్యక్రమాన్ని అధికారులు నిలిపేశారు. రఘునాథపల్లి మండల కేంద్రంలో ఇంటిపన్నులు వసూలు చేస్తుండగా కొందరు అడ్డుకుని అధికారులతో గొడవకు దిగారు. ధర్మసాగర్ మండలం ధర్మసాగర్, వేలేరు, పీచర, నారాయణగిరి, పెద్దపెండ్యాల, జానకిపురం, క్యాతంపల్లి, సోమదేవరపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాల్లో పింఛన్ లబ్ధిదారులకు ఇచ్చే మొత్తంలో కోత విధించారు. ఇంటి, నల్ల పన్నుల రూపంలో వసూలు చేశారు. వరంగల్ తూర్పు : కాశిబుగ్గలో పింఛన్‌దారులకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆందోళన నిర్వహించారు. పింఛన్ డబ్బులు వస్తాయని, ఈ సారైనా తమ పేర్లు జాబితాలో ఉంటాయని ఆశతో ఉర్సు చమన్ సీఆర్సీ భవన్‌కు వద్దకు వచ్చిన వారు నిరాశకు గురయ్యారు. రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ : హన్మకొండలోని పింఛన్ పంపిణీ కేంద్రాల వద్దకు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సాయంత్రం వరకు అధికారుల కోసం పడిగాపులు కాసిన వృద్ధులు, వితంతువులు చేసేది లేక... తిరిగి ఇళ్లకు వెళ్లారు. లబ్ధిదారులకు డబ్బులు రాకపోవడంతో అధికారులు, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డోర్నకల్ : డోర్నకల్ మండలంలో పింఛన్ లబ్ధిదారుల వివరాలు ‘ఆన్లైన్’లో డౌన్లోడ్ కాకపోవడంతో పంపిణీ గురువారానికి వాయిదా పడింది. నర్సింహులపేట మండ లం రేపోణిలో తమ కుటుంబాల వారికి పింఛన్లు మంజూరు కాకపోవడంతో ఇద్దరు వ్యక్తులు వీఆర్వో రమేష్‌పై దాడికి యత్నించడంతో పంపిణీ నిలిచిపోరుుంది. ఈ విషయా న్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లిన అనంతరం వీఆర్వో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చే శారు. మహబూబాబాద్ : పింఛన్ల జాబితా, నగదు రాలేదని మునిసిపల్ కమిషనర్ రాజలింగు పేర్కొన్నరు. దీనిపై ఇన్చార్జ్ ఎంపీడీఓ రవీందర్‌ను సంప్రదించగా పింఛన్ డబ్బుల చెక్కులను సంబంధిత గ్రామాల వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల పేర్ల మీద రాసి ఇవ్వగా, బ్యాంక్ అధికారులు తిరస్కరించారని తెలిపారు. కేవలం రూ.25 వేలు మాత్రమే ఆ విధంగా తీసుకునే అవకాశం ఉన్నదని చెప్పడంతో మళ్లీ సెల్ఫ్ చెక్కులు ఇచ్చామని వెల్లడించారు. కేసముద్రం మండలం వెంకటగిరిలో పింఛన్లు తీసుకున్న వారివద్ద అదే పంచాయతీ ఆఫీసులోని కారోబార్ ఇంటి, నల్లా పన్నులు వసూలు చేయడంతో వాగ్వాదం జరిగింది. నర్సంపేట : దుగ్గొండి వుండల వికలాంగుల సంఘం అధ్యక్షురాలు బోళ్ల దేవికి వికలాంగుల పింఛన్‌కు బదులుగా వితంతు పింఛన్ వుంజూరైంది. చెన్నారావుపేట వుండలంలోని పలు గ్రావూల్లో అర్హులైన వారికి పింఛన్లు రాకపోవడంతో అధికారులను నిలదీశారు. పరకాల : పరకాల నగర పంచాయతీ, మం డల పరిధిలో పింఛన్ల పంపిణీ జరగలేదు. పింఛన్ల జాబితా ఇంకా ఖరారు కాకపోవ డం... సర్వసభ్య సమావేశం ఉండడంతో పింఛన్ల పంపిణీ చేపట్టలేదు. వర్ధన్నపేట : కొన్ని గ్రామాల్లో లబ్ధిదారులకు పింఛన్లు ఇచ్చే ముందే స్థానిక పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు వారితో ఇంటి, నల్లా పన్నులు చెల్లించుకున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఆయూ మండలాల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పింఛన్లు పంపిణీ చేశారు. జనగామ : జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ నర్మెటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ ఒక్క గ్రామంలోనూ పూర్తి స్థాయిలో పంపిణీ పూర్తి కాక పోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుర్తి : తొర్రూరు మండలం మినహా నాలుగు మండలాల్లో జరిగిన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దయాకర్‌రావు పాల్గొన్నారు. తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామంలో సుమారు 70 మంది అర్హులకు పింఛన్ మంజూరు కాలేదని గొడవ చేయడంతో కార్యక్రమం నిలిపేశారు. -
వైకల్యం ఉందని వదిలేశాడు...
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఘనకార్యం జీడిమెట్ల: ప్రేమించాడు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు.. ఏడాది పాటు కాపురం చేశాకా నీవు వికలాంగురాలివి వద్దు పొమ్మన్నాడు.. జీడిమెట్ల సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నమ్మడు, ఆంజనేయులు కుటుంబం తో సహా 2008లో నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్‌లోని వినాయకనగర్‌లో ఉంటున్నారు. వీరి కుమార్తె లక్ష్మి (27) షాపూర్‌నగర్‌లోని ఆర్కే ఫోర్స్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో ఈమెకు తూర్పు గోదావరి జిల్లా వెదురుకుదురుకు చెందిన కృష్ణవేణి, బాబూరావుల కుమారుడు బాలాజీతో ఫోన్లో పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో నగరానికి వచ్చిన బాలాజీ ఒక కాలు పోలియో ఉన్న లక్ష్మి ని చూసి ప్రేమను కొనసాగించాడు. అమీర్‌పేటలో ఉంటూ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటున్న బాలాజీకి లక్ష్మి రూ. 50 వేలు ఇచ్చింది. జూన్ 13, 2012 లో షాపూర్‌నగర్‌లోని ఓ ఆలయంలో బాలాజీ.. లక్ష్మిలు వివాహం చేసుకున్నారు. అనంతరం బాలాజీకి హబ్సిగూడలో సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో ఆరు నెలల పాటు అదే ప్రాంతంలో కాపురం పెట్టారు. తర్వాత బాలాజీకి హైటెక్ సిటీకి బదిలీ కావడంతో లక్ష్మిని కూకట్‌పల్లిలోని ఓ హాస్టల్లో ఉంచా డు. ఎందుకు హాస్టల్లో పెట్టావని లక్ష్మి నిలదీయగా తప్పించుకు తిరుగుతూ వచ్చాడు. ఇరు కుటుంబాల పెద్దలు ఆర్య సమాజ్‌లో 2014లో బాలాజీ, లక్ష్మిలకు తిరిగి పెళ్లి చేశారు. ఆ సమయంలో లక్ష్మి తల్లిదండ్రులు బాలాజీకి రూ. లక్ష కట్నంగా ఇచ్చారు. ఆ తర్వా త బాలాజీ భార్యను కుత్బుల్లాపూర్‌లో ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఉంచి వెళ్లిపోయాడు. తిరిగి రాకపోవగా ఫోన్ స్విచ్చాఫ్ పెట్టాడు. దీంతో లక్ష్మి పది రోజుల క్రితం జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం బాలాజీపై 498 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.