వికలాంగుల సాధికారతకు కృషి: మోదీ
వారణాసి: అంగ వైకల్యం కలిగిన వ్యక్తులకు కూడా అసాధారణ శక్తిసామర్థ్యాలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వికలాంగులకు గౌరవం, సాధికారత కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వికలాంగులపై మనకున్న ఆలోచన ధోరణి మారాల్సిన అవసరం ఉందని.. లేదంటే వారిలోని అసాధారణ శక్తిసామర్థ్యాలను గుర్తించలేమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం వారణాసిలో జరిగిన ఒక కార్యక్రమంలో మానసిక, శారీరక వైకల్యం కలిగిన సుమారు 9వేల మందికి యాంత్రిక ట్రైసైకిళ్లు, వినికిడి పరికరాలు, ప్రత్యేకంగా రూపొందించిన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లను మోదీ అందజేశారు. కాగా, ప్రధాని కార్యక్రమానికి వికలాంగులతో వస్తున్న ఓ బస్సు కప్‌సేతి ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 22 మంది వికలాంగులకు గాయాలయ్యాయి.
జీవన ప్రమాణాలపైనా దృష్టి: మోదీ
లక్నో: ఆర్థికాభివృద్ధే ముఖ్యం కాదని.. ఆ ఫలాలు సామాన్యునికి అందడం, పేదల జీవన ప్రమాణాల పెంపు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యాలని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ పేర్కొన్నారు. ఉపాధి కల్పన మెరుగుదల తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జన్‌ధన్ యోజన అకౌంట్లలో రూ.30వేల కోట్లు డిపాజిట్ అయ్యాయని మోదీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలనకు సంబంధించి ఐక్యరాజ్యసమితి అనుసరిస్తున్న విధానాల్లో సంస్కరణలు అవసరమని ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక కౌన్సిల్ కార్యక్రమంలో మోదీ తెలిపారు.