
అమెరికాలోని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వేదికగా 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా జరిగింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం న్యూయార్క్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఈ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.. యూఎన్ జనరల్ సెక్రటరీ సహా 180 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. వసుదైక కుంటుంబం థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.
యోగా ఓ జీవన విధానం
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన మోదీ.. యోగా దినోత్సవంలో పాల్గొన్న అందరికీ ధన్యావాదాలు తెలియజేశారు. యోగా దినోత్సవం ప్రాముఖ్యాన్ని, కలిగే లాభాలను ప్రధాని వివరించారు. యోగా అనేది ఏ ఒక్క దేశానికి, మతానికి లేదా జాతికి చెందినది కాదని తెలిపారు. యోగాకు కాపీరైట్, పేటెంట్, రాయల్టీల వంటివి లేవన్నారు. యోగా డేలో దాదాపు అన్ని దేశాల ప్రతినిధులు పాల్గొన్నారన్న ఆయన.. యోగా అంటేనే అందరినీ కలిపేది అని కితాబిచ్చారు. ఇది కేవలం వ్యాయామం కాదని, ఒక జీవన విధానం అని అన్నారు.
భారత్‌లో పుట్టిన ప్రాచీన సంప్రదాయం యోగా!
యోగా భారత్‌లో పుట్టిన ప్రాచీన సంప్రదాయమని మోదీ తెలిపారు. యోగా పూర్తిగా విశ్వజనీనం.. ఆరోగ్యకరమన్నారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందని చెప్పారు. 2023ను చిరుధాన్యాల ఏడాదిగా ప్రకటించాలని భారత్ ప్రతిపాదించిందని, ఈ ప్రతిపాదనను ప్రపంచమంతా ఆమోదించిందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వార్షిక వేడుకగా గుర్తించాలని మోదీ ప్రతిపాదించారు. యోగా డే జరపాలనే ప్రతిపాదనను కూడా దేశాలన్నీ ఆమోదం తెలిపాయని చెప్పారు. భారత ప్రతిపాదనను ప్రపంచమంతా ఆమోదించిందని మోదీ చెప్పుకొచ్చారు. కాగా 2014లో యోగా దినోత్సవం నిర్వహించాలని మోదీ ప్రతిపాదించగా.. 2015 నుంచి జూన్ 21న ఐరాస యోగా దినోత్సవం నిర్వహిస్తోంది.
గిన్నిస్ రికార్డు సాధించిన మోదీ యోగా కార్యక్రమం
న్యూయార్క్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. అత్యధికంగా 140 దేశాలకు చెందిన జాతీయస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో గిన్నిస్ రికార్డు సాధించింది. ఈమేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అధికారి మైఖేల్ ఎంప్రిక్ బుధవారం ఐరాస ప్రధాన కార్యాలయం లాన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ క్సాబా కొరోసి, ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌లకు ఈ అవార్డును అందించారు.
Delighted to take part in the #YogaDay programme at @UN HQ. Let us make Yoga a part of our lives and further wellness. https://t.co/XvsB8AYfGs
— Narendra Modi (@narendramodi) June 21, 2023