ఐరాసలో యోగా వైట్‌హౌస్‌లో విందు | PM Narendra Modi To Visit US, Egypt From June 20 To 25 | Sakshi
Sakshi News home page

ఐరాసలో యోగా వైట్‌హౌస్‌లో విందు

Published Sat, Jun 17 2023 5:37 AM | Last Updated on Sat, Jun 17 2023 5:42 AM

PM Narendra Modi To Visit US, Egypt From June 20 To 25 - Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటన షెడ్యూల్‌ను శుక్రవారం విదేశాంగ శాఖ విడుదల చేసింది. జూన్‌ 20 నుంచి 25 వరకు ప్రధాని అమెరికా, ఈజిప్టులలో పర్యటిస్తారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యోగా కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్‌ లేడీ జిల్‌ బైడెన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఈ సారి పర్యటనలో యూఎన్‌లో జరిగే యోగా డేలో ప్రధాని పాల్గొనడం విశేషం. ప్రతీ రోజూ యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రపంచంలో అవగాహన పెరగాలని మోదీ ప్రధాని పదవి చేపట్టాక చేసిన ప్రయత్నాలతో యూఎన్‌  2014లో జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఇప్పుడు తొమ్మిదేళ్లయ్యాక యూఎన్‌లో జరిగే కార్యక్రమానికి నేతృత్వం వహిస్తూ ఉండడంపై ప్రధాని మోదీ ఉద్విగ్నంగా స్పందించారు. యోగా మరింతగా ప్రజాదరణ పొందాలని ఒక ట్వీట్‌లో ఆశాభావం వ్యక్తం చేశారు.

పర్యాటన ఇలా..!
► ప్రధాని మోదీ అమెరికా పర్యటన న్యూయార్క్‌ నుంచి మొదలవుతుంది. జూన్‌ 21న యూఎన్‌ ప్రధాన కార్యాలయంలో ఉదయం 8 నుంచి 9 గంటలవరకు జరిగే యోగా సెషన్‌లో ప్రధాని పాల్గొంటారు.  భారత్‌ యూఎన్‌కు బహుమతిగా ఇచ్చిన మహాత్మా గాంధీ విగ్రహం ఎదుటే ఈ యోగా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో యూఎన్‌ ప్రతినిధులు, వివిధ దేశాల రాయబారులు యోగా గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతారు.
► న్యూయార్క్‌ నుంచి వాషింగ్టన్‌కు వెళతారు. జూన్‌ 22న  అధ్యక్షుడు బైడెన్‌తో అత్యున్నత స్థాయి చర్చలు జరుపుతారు.
► అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్‌ స్పీకర్ల ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు
► అదే రోజు రాత్రి ప్రధాని గౌరవార్థం బైడెన్‌ దంపతులు శ్వేత సౌధంలో అధికారిక విందు ఇస్తారు.
► జూన్‌ 23న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ ప్రధానికి ఆతిథ్యమిస్తారు. అదే రోజు ప్రధాని పారిశ్రామికవేత్తలతో, కార్పొరేట్‌ సంస్థల సీఈవోలతో సమావేశమవుతారు. ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు.
► జూన్‌ 24న ఈజిప్టుకి బయల్దేరి వెళతారు. అక్కడ రెండు రోజులు పర్యటిస్తారు. మన గణతంత్ర ఉత్సవాలకు హాజరైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌ సిసి ఆహ్వానం మేరకు అక్కడ పర్యటించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement