ఎన్‌ఆర్‌ఐలే భారత్‌ అంబాసిడర్లు: ప్రధాని మోదీ | PM Modi Says NRIs Are India Brand Ambassadors In US | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌ఐలే భారత్‌ అంబాసిడర్లు: ప్రధాని మోదీ

Published Mon, Sep 23 2024 7:36 AM | Last Updated on Mon, Sep 23 2024 7:36 AM

PM Modi Says NRIs Are India Brand Ambassadors In US

న్యూయార్క్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. మూడు రోజులు పర్యటనలో భాగంగా అమెరికాలో మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ప్రవాస భారతీయుల సదస్సులో పాల్గొన్న మోదీ.. భారత్‌ అవకాశాల స్వరమని పేర్కొన్నారు. అలాగే, సుపరిపాలన, సుసంపన్న భారత్‌ సాధన కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చానని ప్రధాని తెలిపారు.

న్యూయార్క్‌లోని నస్సావ్‌ వెటరన్స్‌ కొలస్సియంలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘భారత్‌ అవకాశాలకు స్వర్గం వంటింది. భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు వీలుగా ఎన్నో నిర్మాణాత్మక పనులు చేపడుతున్నాం. అత్యంత సంక్లిష్టమైన, సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియను దాటి ముందుకొచ్చాం. ఈ ఎన్నికల్లో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. అబ్‌ కీ బార్‌ మోదీ సర్కార్‌ (మరోసారి మోదీ ప్రభుత్వం) వచ్చింది. భారత ప్రజలు ఇచ్చిన ఈ తీర్పునకు అత్యంత ప్రాధాన్యత ఉంది.

నేను రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చాను. గుజరాత్‌ ముఖ్యమంత్రిని, దేశానికి ప్రధానిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. త్యాగాలు చేసే వారే ఫలాలను పొందుతారు. ప్రవాస భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రతి రంగంలోనూ సామాజిక, దేశాభివృద్ధికి దోహదపడతారు. దేశం గర్వపడేలా చేయడంలో భారతీయ అమెరికన్ల పాత్రను ఎంతో ముఖ్యమైనది.

140 కోట్ల మందికి దక్కిన గౌరవం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నన్ను శనివారం డెలావేర్‌ని తన నివాసానికి తీసుకెళ్లారు. ఆయన ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని స్పృశించింది. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం. మీ విజయాల వల్లే ఈ గౌరవం సాధ్యమైంది. అమెరికాలో నివసిస్తున్న వేల మంది ప్రవాస భారతీయులే భారత్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లు. భారత్, అమెరికా కలిసి ప్రజాస్వామ్య పండగలో భాగస్వాములు కూడా అవుతున్నాయి.

 

 

2036లో భారత్‌లో ఒలింపిక్స్‌..
ఏఐ అంటే ప్రపంచానికి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌. కానీ ఏఐ అంటే అమెరికా, ఇండియా స్ఫూర్తి అని నా నమ్మకం. మీరు భారత్, అమెరికాలను అనుసంధానం చేస్తున్నారు. మీ నైపుణ్యం, ప్రతిభ, నిబద్ధత అసమానం. భిన్నత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం. అది రక్తం, సంస్కృతిలోనే ఉంది. అలాగే, 2036లో భారత్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించాలనే గట్టి లక్ష్యంతో పని చేస్తున్నాం. కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలే అభివృద్ధి దిశగా దేశాన్ని నడిపిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌లో 5జీ, డిజిటల్‌ చెల్లింపులు సరికొత్త విప్లవాన్ని సృష్టించాయి. భారత్‌లో ఉన్న 5జీ నెట్‌వర్క్‌ అమెరికా కంటే పెద్దది. మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్‌ను ప్రపంచవ్యాప్తంగా విక్రయించే రోజు ఎంతో దూరంలో లేదు అంటూ కామెంట్స్‌ చేశారు.

 

 ఇదిలా ఉండగా.. న్యూయార్క్‌లోని నస్సావ్‌ వెటరన్స్‌ కొలస్సియంలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సుకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 42 రాష్ట్రాల నుండి దాదాపు 15,000 మంది భారతీయ ప్రవాసులు ఈవెంట్‌కు వచ్చారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆయన సదస్సుకు వచ్చిన వెంటనే మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు.

 ఇది కూడా చదవండి: ట్రంప్‌ భద్రతలో వైఫల్యం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement