United Nations Headquarters
-
సెప్టెంబర్‌లో అమెరికాకు మోదీ
న్యూయార్క్: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ న్యూయార్క్ నగర పరిధిలోని లాంగ్ ద్వీపంలో భారతీయ అమెరికన్లనుద్దేశించి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 16వేల సీటింగ్ సామర్థ్యమున్న నసావూ కొలీసియం ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 22వ తేదీన మోదీ ప్రసంగించనున్నారు. న్యూయార్క్‌లో ఐరాస ప్రధాన కార్యాలయంలో సర్వ ప్రతినిధి సభ సమావేశంలో పాల్గొనేందుకు మోదీ అమెరికా వెళ్తున్నారు. భారతీయ అమెరికన్లతో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. 2014లో తొలిసారిగా ఆయన ప్రధాని అయ్యాక ఐరాసలో వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. న్యూయార్క్ మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో వేలాది మంది భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. దానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ మళ్లీ భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు. -
ఐక్యరాజ్యసమితికి తెలుగు యువ ప్రతిభ
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో రాబోయే డిసెంబర్లో జరిగే 8వ వార్షిక 1ఎమ్1బి (1మిలియన్ ఫర్ 1బిలియన్) యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనడానికి తెలంగాణలోని వివిధ కాలేజీలకు చెందిన ఐదుగురు యువ ఆవిష్కర్తలు ఎంపికయ్యారు. వీరిలో నలుగురు అమ్మాయిలు– నారాయణం భవ్య, పెమ్మసాని లిఖిత చౌదరి, సత్యవతి కోలపల్లి, మనల్ మునీర్ కాగా మరొకరు మీత్కుమార్ షా ఉన్నారు. వీరి ఆవిష్కరణలకు ‘1ఎమ్1బి గ్రీన్స్కిల్స్ అకాడమీ’ వేదికయ్యింది. ఐదు నెలలపాటు సాగిన ఈ ప్ర్రక్రియలో 200 మంది పాల్గొనగా ఐదుగురు తెలుగు విద్యార్థులు ఎంపికై యువ ప్రతిభ కు ప్రేరణగా నిలిచారు.పట్టణ సవాళ్ల పరిష్కారం‘మానిఫెస్టింగ్ మ్యాన్ హోల్స్’ పేరుతో పట్టణ వరదలు, సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగాప్రాజెక్ట్ను ఆవిష్కరించాను. భారతీయ నగరాల్లో మౌలిక సదుపాయాల భద్రతను కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. – నారాయణం భవ్యటెక్.. టూర్‘ఇంటెలినెక్సా’ అనే నాప్రాజెక్ట్ ఎకో–టూరిజంను ఏఆర్, వీఆర్, ఏఐల ద్వారా మార్చేందుకుæవీలుగా ఫీచర్లను అందిస్తోంది. వైల్డ్ లైఫ్ ట్రైల్స్, వీఆర్ అడ్వెంచర్స్, ఎకో కెరీర్ గైడ్స్, ఎకో డైరీస్ ద్వారా మనప్రాంతాల పట్ల సమాజానికి అవగాహన కల్పించడం, గ్లోబల్ ఫోరమ్‌లపై ప్రభావం చూపడమే లక్ష్యంగా దీనిని ఆవిష్కరించాను.– మనల్ మునీర్లక్ష్యానికి మార్గం‘అప్నా ఇంటర్వ్యూ క్రాకర్’ అనే నాప్రాజెక్ట్ మార్కెట్ ట్రెండ్లు, పోర్ట్‌ఫోలియో క్రియేషన్, ఎటిఎస్ రెజ్యూమ్ టెంప్లేట్లు, ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్ లను అందించే ఒక వేదిక. దీని ద్వారా ఎంతోమంది తమ లక్ష్యాలు చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. – మీత్ కుమార్ షావిద్యార్థులకు ప్రాక్టికల్ స్కిల్స్‘టెక్.వెసాలియస్’ అనే నాప్రాజెక్ట్ లక్ష్యం అనాటమీ విద్యలో ఎఆర్/విఆర్ సాంకేతికత ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకురావడం. విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేలా, వారిలోప్రాక్టికల్ స్కిల్స్ పెంపొందించడమే ఈ ఆవిష్కరణ లక్ష్యం. – పెమ్మసాని లిఖిత చౌదరివాస్తవ అనుభూతినారు పోషణలో ఏఐ సాధనాలు, మెటా స్పార్క్ స్టూడియోని ఉపయోగించుకొని వాస్తవ అనుభూతిని ఎలా పొందవచ్చో నాప్రాజెక్ట్ పరిచయం చేస్తుంది. అంతేకాదు కెమెరా ట్రాకింగ్ ద్వారా వినియోగదారులకు వారి మొక్కలను సేంద్రీయంగా, వేగంగా ఎలా పెంచాలనే దానిపై లింక్‌లు, మార్గదర్శకాలను అందిస్తుంది. మొక్కల పెంపకంపై రూపొందించిన ప్రాజెక్ట్ ఇది. – సత్యవతి కోలపల్లి -
Deepika Deshwal: ముచ్చటగా మూడోసారి...
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడుసార్లు ప్రసంగించిన తొలి భారతీయ యువతిగా లా ఆఫీసర్ దీపికా దేశ్వాల్ చరిత్ర సృష్టించింది. కాలేజీ రోజుల నుంచి సేవాపథంలో నడుస్తున్న దిల్లీకి చెందిన దీపిక ఎంతోమంది బాధితులకు అండగా నిలిచి, ఎన్నోరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొంది. నలుగురిని ఒకటి చేసి తన దారిలో నడిచేలా చేసింది... పీహెచ్డీ స్కాలర్ అయిన దీపికా దేశ్వాల్కు చదువు మాత్రమే ప్రపంచం కాదు. కాలేజీ రోజుల నుంచి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. కోవిడ్ కల్లోల కాలంలో సామాజిక సేవా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వందలాదిమందికి సహాయం అందించింది. స్నేహితులు, బంధువులను కూడా తన సేవాకార్యక్రమాలలో భాగం చేసింది. అన్నదానం నుంచి అనుకోకుండా ఆపదలో చిక్కుకున్న వారికి సహాయం చేయడం వరకు ఎన్నో చేసింది. తన జీతం మొత్తం కరోనా బాధితుల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేది. ఆమె తండ్రి కూడా తన జీతంలోని కొంతమొత్తాన్ని విరాళంగా ఇచ్చేవాడు. ఏ అవసరం ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయమంటూ ఎంతోమందికి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఫోన్ వచ్చినా పరుగులు తీసేది. బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచేది. సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న 80 మంది అమ్మాయిలకు అండగా నిలిచి, నేరస్థులు అరెస్ట్ అయేలా ఉద్యమించింది. వ్యభిచార కూపంలో చిక్కుకున్న అమ్మాయిలను రక్షించి వారికి పునరావాసం ఏర్పాటయ్యేందుకు కృషి చేసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగానికి మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. మహిళా సాధికారత నుంచి మానవ హక్కుల వరకు ఎన్నో కార్యక్రమాలలో క్రియాశీల పాత్ర పోషించిన దీపికకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడోసారి ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. గత రెండు సమావేశాల్లో ‘మానవ హక్కులు–మహిళా హక్కులు’ అంశంపై మాట్లాడి 150 దేశాలకు చెందిన ప్రతినిధుల ద్వారా ప్రశంసలు అందుకుంది. మనసున్న దీపిక ఆటల్లోనూ బంగారం అనిపించుకుంది.‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’ లో రెజ్లింగ్, జూడోలలో ఆరుసార్లు బంగారు పతకం గెలుచుకుంది. ఆత్మరక్షణకు సంబంధించి అమ్మాయిల కోసం రకరకాల వర్క్‌షాప్‌లు నిర్వహించింది. -
ఐరాసలో యోగా వైట్‌హౌస్‌లో విందు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటన షెడ్యూల్‌ను శుక్రవారం విదేశాంగ శాఖ విడుదల చేసింది. జూన్ 20 నుంచి 25 వరకు ప్రధాని అమెరికా, ఈజిప్టులలో పర్యటిస్తారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యోగా కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఈ సారి పర్యటనలో యూఎన్‌లో జరిగే యోగా డేలో ప్రధాని పాల్గొనడం విశేషం. ప్రతీ రోజూ యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రపంచంలో అవగాహన పెరగాలని మోదీ ప్రధాని పదవి చేపట్టాక చేసిన ప్రయత్నాలతో యూఎన్ 2014లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఇప్పుడు తొమ్మిదేళ్లయ్యాక యూఎన్‌లో జరిగే కార్యక్రమానికి నేతృత్వం వహిస్తూ ఉండడంపై ప్రధాని మోదీ ఉద్విగ్నంగా స్పందించారు. యోగా మరింతగా ప్రజాదరణ పొందాలని ఒక ట్వీట్లో ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటన ఇలా..! ► ప్రధాని మోదీ అమెరికా పర్యటన న్యూయార్క్ నుంచి మొదలవుతుంది. జూన్ 21న యూఎన్ ప్రధాన కార్యాలయంలో ఉదయం 8 నుంచి 9 గంటలవరకు జరిగే యోగా సెషన్లో ప్రధాని పాల్గొంటారు. భారత్ యూఎన్‌కు బహుమతిగా ఇచ్చిన మహాత్మా గాంధీ విగ్రహం ఎదుటే ఈ యోగా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో యూఎన్ ప్రతినిధులు, వివిధ దేశాల రాయబారులు యోగా గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతారు. ► న్యూయార్క్ నుంచి వాషింగ్టన్కు వెళతారు. జూన్ 22న అధ్యక్షుడు బైడెన్‌తో అత్యున్నత స్థాయి చర్చలు జరుపుతారు. ► అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ స్పీకర్ల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు ► అదే రోజు రాత్రి ప్రధాని గౌరవార్థం బైడెన్ దంపతులు శ్వేత సౌధంలో అధికారిక విందు ఇస్తారు. ► జూన్ 23న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ప్రధానికి ఆతిథ్యమిస్తారు. అదే రోజు ప్రధాని పారిశ్రామికవేత్తలతో, కార్పొరేట్ సంస్థల సీఈవోలతో సమావేశమవుతారు. ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. ► జూన్ 24న ఈజిప్టుకి బయల్దేరి వెళతారు. అక్కడ రెండు రోజులు పర్యటిస్తారు. మన గణతంత్ర ఉత్సవాలకు హాజరైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి ఆహ్వానం మేరకు అక్కడ పర్యటించనున్నారు.