
న్యూయార్క్ : పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా భారత్ అద్బుతమైన ప్రగతి సాధిస్తోందని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. అంతర్జాతీయంగా పర్యావరణ మార్పులపై జరుగుతున్న పోరాటంలో భారత్ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన ప్రశంసించారు. పలుమార్లు భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భాలను గుర్తుచేసుకున్న ఆంటోనియో , మహాత్మ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఐరాస కార్యాలయానికి 193 సౌర ఫలకలు బహుమతిగా ఇచ్చారని.. అవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను సమకూర్చుకోవడానికి సౌరవిద్యుత్‌పై భారత్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం శుభ పరిణామమని కొనియాడారు.
క్లీన్ ఇండియాలో భాగంగా మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రభావవంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, సెస్టెంబరు 23న ఐరాసలో వాతావరణ మార్పులపై సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మోర్కెల్, న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్, మార్షల్ ఐలాండ్ అధ్యక్షుడు హిల్డా హీన్లతో కలిసి ప్రసంగించనున్నారు. కర్బన ఉద్ఘారాలను తొలగించడం కోసం కొన్ని దేశాలు అణు ఇంధనం దిశగా అడుగులు వేస్తున్నాయని గుటెరస్ పేర్కొన్నారు. భారత్‌లో ఎక్కువభాగంలో బొగ్గు నిక్షేపాలు ఉన్న సంగతిని గుర్తుచేశారు. ప్రస్తుతం కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు కృషి చేస్తున్న భారత్‌ను ఐరాస గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఐరాస ప్రదాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సౌర ఫలకలతో కూడిన సోలార్ పార్కును సెస్టెంబర్ 24న వివిధ దేశాల ప్రతినిధుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం పలు దేశాలకు చెందిన నేతలు గాంధీ సిద్ధాంతాలు తమను ఏ విధంగా ప్రభావితం చేశాయో మాట్లాడనున్నారు. కాగా ఈ సౌర ఫలకలు 50 కిలోల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ కార్యక్రమానికి సింగపూర్ ప్రధాని లీ హ్సీన్ లూంగ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్, జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్, ఇతర దేశాల నేతలు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment