సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులకు, సంస్థలకు జాతీయ దివ్యాంగ పురస్కారాలు దక్కాయి. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి సాధికారత కోసం పనిచేస్తున్న సంస్థలకు, వ్యక్తులకు కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ అవార్డులను ప్రదానం చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేశారు. వ్యక్తిగత వృత్తిలో రాణింపునకు గుర్తింపుగా కరీంనగర్ జిల్లా చిర్తకుంటకు చెందిన సి.సాయికృష్ణ, చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లికి చెందిన కెవి.శిరీషలకు అవార్డులు దక్కాయి.
దివ్యాంగులకు ఉద్యోగ కల్పన ద్వారా వారి సాధికారతకు తోడ్పడుతున్న హైదరాబాద్‌కు చెందిన యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్‌కు, అలాగే సికింద్రాబాద్‌కు చెందిన దేవ్నార్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ సంస్థలకు అవార్డులు దక్కాయి. దేవ్నార్ సంస్థ చైర్మన్ సాయిబాబాగౌడ్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రోల్ మోడల్ అవార్డుల విభాగంలో సికింద్రాబాద్‌కు చెందిన కె.శేషగిరిరావు, ఆదిలాబాద్‌కు చెందిన ఆకుల రోహిత్‌లకు అవార్డులు దక్కాయి.
అలాగే దివ్యాంగులకు అవసరమైన ఉత్పత్తులను తక్కువ ధరలో అందుబాటులోకి తేవడంపై జరిపిన పరిశోధనలకుగానూ హైదరాబాద్‌కు చెందిన బిశ్వజిత్‌రాయ్, ఆశాదాస్, విజయ్‌కుమార్ అలిషాలకు అవార్డులు దక్కాయి. ఇక దివ్యాంగులకు అనువుగా పరిసరాల ఏర్పాటు విభాగంలో శ్రీకాకుళం సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసుకు అవార్డు దక్కింది. దివ్యాంగుల సంక్షేమ అవార్డును ఈ ఏడాదికిగానూ మెడ్ ఇండియా వ్యవస్థాపకుడు పద్మశ్రీ డా.టీఎస్ చంద్రశేఖర్ అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment