వాళ్లిద్దరూ వికలాంగులు. పుట్టుకతోనే పోలియోబారిన పడి నడవలేని పరిస్థితి వారిది. పదేళ్ల క్రితం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కాళ్లు లేకున్నా ఆత్మవిశ్వాసంతో తమకు తాముగా నిలదొక్కుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా బతుకుతున్న ఆ జంటను చూసి అంతా అభినందిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణానికి సమీపంలో ఉన్న బాలాజీనగర్ తండాకు చెందిన కాట్రోత్ శంకర్ పుట్టుకతోనే వికలాంగుడు. నడవలేకున్నా చేతులనే ఆధారం చేసుకొని ఇంటర్ వరకూ చదువుకున్నాడు. ఆ తర్వాత సైకిల్ పంక్చర్ దుకాణం పెట్టుకుని జీవనం సాగించడం మొదలుపెట్టాడు. టీవీఎస్ మోపెడ్‌ను తనకు వీలుగా మరో రెండు చక్రాలు బిగింపజేసుకుని దానిపై ఊరూరు తిరుగుతూ సీజనల్ వ్యాపారాలు చేస్తుంటాడు.
ఇష్టపడిన జీవితం
మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన శారద చిన్నప్పుడే పోలియోబారిన పడింది. శారదను కలిసిన శంకర్ ఆమెనే తన జీవితభాగస్వామిగా రావాలనుకున్నాడు. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ వికలాంగులు కావడంతో ఎలా బతుకుతారోనని ఆ తండాలోని అంతా అనుకున్నారు. కాని వారి ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం ఓడిపోయింది.
ఊరూరా ఇడ్లీలు
ఇద్దరూ తెల్లవారకముందే నిద్రలేచి ఇడ్లీలు తయారు చేసుకుని ద్విచక్ర వాహనంపై పెట్టుకొని ఊరూరు తిరుగుతూ అమ్ముతుంటారు. ఇడ్లీల అమ్మకంతో వచ్చిన డబ్బును పొదుపు చేసుకున్నారు. ఇడ్లీలతోపాటు వేసవి వస్తే ఐస్‌క్రీమ్‌లు అమ్మేవారు. చలికాలం దుప్పట్ల వ్యాపారం చేసేవారు. ఇలా సీజన్‌కు తగ్గట్టు రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్న శంకర్, శారద దంపతులు తండావాసులకు ఆదర్శం అయ్యారు.
కిరాణా కొట్టుతో పోషణ
పొదుపు చేసుకున్న డబ్బుతో ఇప్పుడు కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పక్కన ఓ చిన్న షాప్ వేసుకుని కిరాణాకొట్టు నిర్వహిస్తున్నారు. ఇద్దరు కలిసి కామారెడ్డి, ఎల్లారెడ్డి పట్టణాలకు వెళ్లి సామాన్లు కొనుగోలు చేసుకుని వస్తారు. ప్రతీ రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ దుకాణం తెరిచే ఉంటుంది. తండావాసులే కాకుండా, రోడ్డున వెళ్లేవారు సైతం అక్కడ ఆగి తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇద్దరినీ చూసి మెచ్చుకొని వెళుతుంటారు.
కొత్త కష్టం
కుటుంబ పోషణకు ఎవరిపైనా ఆధారపడకుండా వెళ్లదీసుకుంటున్న ఈ జంటకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చింది. ఇన్నాళ్లూ పోగేసుకొని నిర్మించుకున్న షాప్ రోడ్డు వెడల్పులో పోతుందని ఆందోళన చెందుతోంది. అక్కడే ప్రభుత్వ స్థలం ఉందని, ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందిస్తే ఆ స్థలంలో షెడ్డు నిర్మించుకొని తమ బతుకులు తాము బతుకుతామని అంటున్నారు.
– సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి
ఫొటోలు: అరుణ్
మాకు కాళ్లు లేవని బాధగా ఉండేది. కానీ, ఇప్పుడు ఒకరికి ఒకరం ఉన్నాం. కాళ్లు లేవనే బాధ లేదు. నలుగురిలో భేషుగ్గా బతకాలని ఇద్దరం కష్టపడుతున్నాం. దేనికీ లోటులేకుండా బతుకుతున్నాం. మమ్మల్ని చూసి మా తండాలోనే కాదు చుట్టుపక్కల ఊళ్లవాళ్లూ మెచ్చుకుంటుంటే ఎంతో ఆనందం కలుగుతోంది.
– కాట్రోత్ శంకర్, శారద దంపతులు
Comments
Please login to add a commentAdd a comment