వారంతా మానసిక వికలాంగులు. చుట్టూ వరద నీరు ముంచేస్తున్నా ఏం జరుగుతోందో గ్రహించలేని నిస్సహాయులు. ఆరు రోజులు నీళ్లల్లోనే కాలం గడిపేశారు. చివరికి సహాయక బృందాలు కాపాడాయి. త్రిసూర్ జిల్లా మురింగూర్‌లోని మానసిక సంరక్షణ కేంద్రంలో 400 మంది వరకు రోగులు ఉన్నారు. ఆ ప్రాంతాన్ని వరద చుట్టుముట్టడంతో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. జనావాసాలకు దూరంగా ఉండే ఆ మానసిక కేంద్రం గురించి పట్టించుకునేవారే లేకపోయారు.
మొదటి అంతస్తులోకి నీళ్లు వచ్చేయడంతో స్థానిక బ్లాక్ పంచాయతీ సభ్యుడు థామస్ మాత్రం వాళ్లని జాగ్రత్తగా పై అంతస్తులోకి తరలించారు. ప్రతీరోజూ చిన్న మరబోటులో ఆ కేంద్రానికి ఆహార పదార్థాలను తీసుకువెళ్లి వాళ్లకి తినిపించేవారు. ఆరు రోజులు గడిచాక సహాయ బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
కానీ వరదనీరు చుట్టుముట్టేయడంతో వారందరినీ తరలించడం క్లిష్టంగా మారింది. ఆహారం, మందులు లేక ఇద్దరు మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోయారు. థామస్ సహకారంతో మిగిలిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇన్ని రోజులూ వారిని కంటికి రెప్పలా కాపాడిన థామస్‌ని రియల్ హీరో అని స్థానికులు కొనియాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment