Overhead tank
-
వరంగల్ రైల్వేస్టేషన్లో తప్పిన పెను ప్రమాదం
వరంగల్ రైల్వేస్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ఒక్కసారి పగిలిపోవడంతో స్టేషన్ మొత్తం నీటి తో తడిసిపోయింది. పై నుంచి వరదలా నీరు రావడం..రైల్వే లైన్‌పై హై వోల్టేజ్ విద్యుత్ సరఫరా అవుతుండటంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దీంతో సిబ్బంది అలర్టై కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏంజరిగిందో తెలియక ప్రయాణికులు సిబ్బంది ఆందోళన చెందారు. అసలే రైల్వేస్టేషన్లో 2500 వోల్టేజీ పవర్ సరఫరా ఉండటంతో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుందోనని సిబ్బంది హైరానా పడ్డారు. నాణ్యతా లోపం వల్లే ట్యాంక్ పగిలిందని సిబ్బంది చెబుతున్నారు. ఎవరికీ ఏమీ జరగకపోవడంతో రైల్వేశాఖ ఊపిరి పీల్చుకుంది. -
ఎలా కూలింది..?
♦ బంగ్లా వెంకటాపూర్ ట్యాంకుపై సీఎం ఆరా! ♦ ఓవర్‌హెడ్ ట్యాంకు కూలిన ఘటనపై సీఎం ఆరా! ♦ ‘వాటర్‌గ్రిడ్ ’ పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశం ♦ రంగంలోకి దిగిన ‘గడా’ ఓఎస్డీ బంగ్లావెంకటాపూర్ ♦ వ్యవహారంపై విచారణ నాణ్యతపై ఎస్ఈ, ఈఈలకు సూచన గజ్వేల్: గజ్వేల్ మండలం బంగ్లావెంకటాపూర్‌లో ఓవర్‌హెడ్ ట్యాంకు పైభాగం పిల్లర్‌బెడ్ కూలడంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. పనుల్లో నాణ్యత లోపించడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. నిర్మాణంలో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంక్ కూలిన తీరుపై ‘నాణ్యత నగుబాటు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ మెయిన్‌లో ప్రచురితమైన కథనం సీఎం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. తన సొంత నియోజకవర్గంలో జరుగుతోన్న పనుల తీరుపై స్వయంగా ఆరా తీసినట్టు తెలిసింది. పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించినట్టు సమాచారం. ఏప్రిల్ 30 నాటికి నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించాలనే లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు సూచించినట్టు తెలిసింది. అదే సమయంలో పనుల్లో వేగం పెంచడంతోపాటు నాణ్యత విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ క్రమంలో ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు రంగంలోకి దిగారు. బంగ్లావెంకటాపూర్‌కు చేరుకుని పిల్లర్‌బెడ్ కూలిపోయిన వాటర్‌ట్యాంక్‌ను పరిశీలించారు. ఈ ఘటనపై గ్రామస్థుల ద్వారా విచారణ జరిపారు. అక్కడికి చేరుకున్న వాటర్‌గ్రిడ్ ఎస్ఈ విజయప్రకాశ్, గజ్వేల్ ఈఈ రాజయ్యలకు ట్యాంకు పనులను పటిష్టంగా చేపట్టేలా చూడాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని చెప్పారు. -
పింఛన్ కోసం ట్యాంక్ ఎక్కిన వికలాంగులు
కేసముద్రం : అర్హులమైన తమకు పింఛన్ ఎందుకు మంజూరు చేయలేదంటూ ఆగ్రహించిన వికలాంగులు ఓవర్‌హెడ్ ట్యాంకు ఎక్కి ఆందోళనకు దిగారు. ఈ ఘటన మండలంలోని ఇనుగుర్తిలో గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఇనుగుర్తిలో నవంబర్ 24న పింఛన్‌దారుల జాబితాను చదివి వినిపించే క్రమంలో అర్హులంతా తమను గుర్తించలేదంటూ గ్రామసభను అడ్డుకున్నారు. వీఆర్వో తప్పిదంతోనే ఇలా జరిగిందంటూ సంబంధిత అధికారులను నిలదీయడంతో మళ్లీ విచారణ జరిపి, అర్హులకు న్యాయం చేస్తామన్నారు. సవరించిన జాబితాలో కూడా మరికొందరు అర్హుల పేర్లు రాకపోవడంతో పంపిణీ తేదీలను వాయిదా వేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే గురువారం గ్రామపంచాయతీలో ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టారు. గ్రామంలో మొత్తం 1156 మంది అర్హులు ఉండగా 578 మందిని మాత్రమే గుర్తించడంతో పింఛన్ రానివారు ఆందోళనకు దిగారు. అంతేగాక వీరిలో మరో 98 మంది పేర్లు ఉన్నప్పటికీ వారిపేరుమీద డబ్బులు మంజూరు కాకపోవడం గమనార్హం. దీంతో ఆగ్రహించిన పింఛన్‌దారులంతా రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పోలీసులు, అధికారులతోపాటు సర్పంచ్ విజయ్‌కుమార్ వారిని బుజ్జగించి ఆందోళన విరమింపజేసి పక్కకు పంపించారు. అనంతరం తాము వంద శాతం వికలాంగులమైనప్పటికీ కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే మాకు పింఛన్లు రాలేదంటూ ఆగ్రహించిన వికలాంగులు గ్రామపంచాయతీ వెనకున్న ఓవర్‌హెడ్ ట్యాంక్ మెట్ల మీదుగా మధ్య వరకు ఎక్కి నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయకపోతే దూకుతామని బెదిరించారు. మీకు న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సై రంజిత్‌రావు వారిని శాంతింపజేసేందుకు యత్నించినా వారు వినలేదు. తమకు అన్యాయం చేసిన వీఆర్వోను ఇక్కడికి పిలిపించాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఎంపీడీఓ అరుణాదేవి మీకు ఎలాగైన రెండు నెలల పింఛన్ డబ్బులను వచ్చే జనవరిలో ఇప్పిస్తామంటూ నచ్చజెప్పారు. దీంతో వారు శాంతించి కిందకు దిగారు.