ఎలా కూలింది..?
♦ బంగ్లా వెంకటాపూర్ ట్యాంకుపై సీఎం ఆరా!
♦ ఓవర్‌హెడ్ ట్యాంకు కూలిన ఘటనపై సీఎం ఆరా!
♦ ‘వాటర్‌గ్రిడ్ ’ పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశం
♦ రంగంలోకి దిగిన ‘గడా’ ఓఎస్డీ బంగ్లావెంకటాపూర్
♦ వ్యవహారంపై విచారణ నాణ్యతపై ఎస్‌ఈ, ఈఈలకు సూచన
గజ్వేల్: గజ్వేల్ మండలం బంగ్లావెంకటాపూర్‌లో ఓవర్‌హెడ్ ట్యాంకు పైభాగం పిల్లర్‌బెడ్ కూలడంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. పనుల్లో నాణ్యత లోపించడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. నిర్మాణంలో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంక్ కూలిన తీరుపై ‘నాణ్యత నగుబాటు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ మెయిన్‌లో ప్రచురితమైన కథనం సీఎం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. తన సొంత నియోజకవర్గంలో జరుగుతోన్న పనుల తీరుపై స్వయంగా ఆరా తీసినట్టు తెలిసింది. పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించినట్టు సమాచారం. ఏప్రిల్ 30 నాటికి నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించాలనే లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు సూచించినట్టు తెలిసింది.
అదే సమయంలో పనుల్లో వేగం పెంచడంతోపాటు నాణ్యత విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ క్రమంలో ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు రంగంలోకి దిగారు. బంగ్లావెంకటాపూర్‌కు చేరుకుని పిల్లర్‌బెడ్ కూలిపోయిన వాటర్‌ట్యాంక్‌ను పరిశీలించారు. ఈ ఘటనపై గ్రామస్థుల ద్వారా విచారణ జరిపారు. అక్కడికి చేరుకున్న వాటర్‌గ్రిడ్ ఎస్‌ఈ విజయప్రకాశ్, గజ్వేల్ ఈఈ రాజయ్యలకు ట్యాంకు పనులను పటిష్టంగా చేపట్టేలా చూడాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని చెప్పారు.